భూ ఆక్రమణల రగడలో మూగబోతున్న నేతన్నల భవితవ్యం!

ఒకవైపు సిరిసిల్ల నేతన్నలు తమ సమస్యలకు పరిష్కారం లభించక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో, గత పాలనలో సిరిసిల్ల పరిధిలో దాదాపు 8,000 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు అక్రమంగా ప్రైవేటు వ్యక్తుల హస్తగతమయ్యాయని,  2016–2023 మధ్య సుమారు 8 వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌, సీలింగ్ మిగులు భూములు ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయ్యాయని,అందులో కొంత భాగం అంటే 2400 ఎకరాలు తాము రికవరీ చేశామని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి  ఈనెల 30న ముఖ్యమంత్రి సిరిసిల్లలో పర్యటింస్తున్న సందర్భంగా, రూ.వెయ్యికోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడమే కాకుండా, పెద్ద బహిరంగసభలో ప్రసంగించనుండటం వెనుక, కచ్చితంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ సొంత నియోజకవర్గంలో ఆయన్ను డిఫెన్స్‌లోకి నెట్టడం, గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న భూ ఆక్రమణల ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది .
ఒక ప్రాంతం ప్రతిపక్ష ఎమ్మెల్యే చేతిలో ఉన్నప్పటికీ, అభివృద్ధి విషయంలో వివక్ష చూపకుండా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని నిరూపించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కేటీఆర్ 9పేజీల బహిరంగ లేఖరాయడం సిరిసిల్ల రాజకీయంలో మరో కోణం. బహిరంగసభలో కేవలం బూతుపురాణం కాకుండా, క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టిపెట్టి, 8వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయని అందులో 2400 ఎకరాలు రికవరీ చేసామని అసెంబ్లీలో చేసిన ప్రకటనకు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. రీకరవరీ చేసిన భూములు ఏ మండలం, ఏ గ్రామానికి చెందినవో ఒక శ్వేతప్రతం విడుదలచేయాలని డిమాండ్ చేయడం ద్వారా ప్రభుత్వం కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమైందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాన్ని బీఆర్ఎస్ అనుసరిస్తున్నది. దీంతోపాటు గతంలో కాంగ్రెస్ పాలనలో నేతన్నల ఆత్మహత్యలు జరిగాయని, బీఆర్‌ఎస్ హయాంలోనే సిరిసిల్ల అభివృద్ధి చెందిందనే సెంటిమెంట్‌ను బీఆర్ఎస్ స్థానిక కార్మికుల్లో బలంగా నాటే ప్రయత్నం చేస్తున్నది . సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనను కేవలం రాజకీయ ప్రసంగాలకు, విమర్శలకు వేదికగా మార్చుకోకుండా.. తాము సంధించిన ప్రశ్నలకు, నేతన్నల బకాయిలకు సమాధానం చెప్పేలా ఒత్తిడి తీసుకురావడమే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తున్నది .
నిజం చెప్పాలంటే సిరిసిల్ల చేనేత, పవర్‌లూమ్ రంగాలు గత కొంతకాలంగా విధానపరమైన లోపాలు, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల పాలిస్టర్ యార్న్, రసాయనాల ధరలు ఆకాశాన్నంటడం, అదే సమయంలో స్థానిక మార్కెట్లో ఆర్డర్లు క్షీణించడం వస్త్ర పరిశ్రమను దెబ్బతీసింది. దీనికి తోడు మార్కెట్లో ఆర్డర్లు తగ్గడం, బకాయిలు పేరుకుపోవడం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.విద్యుత్ సబ్సిడీల పునరుద్ధరణలో ఆలస్యం , చేనేత బీమా పథకాల అమలులో స్తబ్దతపై కార్మిక లోకం ఆందోళన చెందుతున్నది . ప్రభుత్వం రుణమాఫీ వంటి ఊరట చర్యలను ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పేరుకుపోయిన కోట్లాది రూపాయల బకాయిల వల్ల నేతన్నల ఇళ్లల్లో ఇంకా నిలకడ రాలేదన్నది నగ్నసత్యం. దీనికితోడు ఇదిలావుండగా  సిరిసిల్ల నేతన్నలకు రూ.60కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు.
బతుకమ్మచీరెలు, స్కూల్ యూనిఫామ్ల ఆర్డర్లు రద్దు కావడంతో నేతన్నలకు ఉపాధి కరువైంది . అంతేకాదు రూ.5లక్షల నేతన్నల బీమా పథకం పునరుద్ధరణకు నోచడంలేదు. యార్న్ ధరలో పదిశాతం సబ్సిడీని ప్రభుత్వం బంద్ పెట్టింది. రూ.387 కోట్లతో నిర్మించిన వీవింగ్ షెడ్లను నేతన్నలకు ఇస్తారో లేదన్నది ఇంకా సస్పెన్స్ లో కొనసాగుతున్నది . వీటిని నేతన్నలకే ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది . దీనికితోడు ఇక్కడ నిర్మించబోయే అపెరల్ పార్క్ లో ఎటువంటి పరిశ్రమలు వస్తాయన్నదానిపై వొస్తాయన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.నియోజకవర్గంలో రైతుభరోసా పూర్తిగా అమలు కాలేదు. ఈ రూ.2లక్షల సబ్సిడీ అందని రైతులకు ఎప్పుడు చెల్లించేది ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు!అంతేకాదు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన రూ.1604కోట్ల మల్కపేట రిజర్వాయర్ నుంచి అప్పర్ మానేరుకు ఇప్పటివరకు ప్రభుత్వం నీటిని తరలించలేదు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
ప్రభుత్వాలు మారినప్పుడు రాజకీయ పట్టుకోసం వ్యూహ ప్రతివ్యూహాలు సహజమే. సిరిసిల్ల వేదికగా వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ద్వారా అధికార కాంగ్రెస్ తన రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకోవాలని చూస్తున్నది . కేటీఆర్ హోమ్ టర్ఫ్‌లో రేవంత్ రూ.వెయ్యికోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తుండటం హర్షణీయమైనా, ఆకలితో అలమటిస్తున్న నేత కార్మికుడి పొట్ట నింపే విషయంలో ప్రభుత్వ విధానం స్పష్టంగా లేదన్నది తేటతెల్లమవుతున్నది . భూ ఆక్రమణలపై వొస్తున్న ఆరోపణలపై పారదర్శకమైన దర్యాప్తు జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. కానీ, ఆ నెపంతో సిరిసిల్ల అపరెల్ పార్క్, మెగా పవర్‌లూమ్ క్లస్టర్ వంటి కీలక పారిశ్రామిక వనరుల అభివృద్ధి కుంటుపడకూడదు.నేతన్నకు బాకీ పడిన 60 కోట్లు ఎప్పుడిస్తరు?. శ్రామికుల ఆత్మహత్యల చీకటి రోజులు పునరావృతం కాకూడదంటే, పాలకుల ప్రాధాన్యత ప్రతీకార రాజకీయాలపై కాకుండా, శ్రామిక సంక్షేమం పైనే కేంద్రీకృతం కావాలి. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేసి, వస్త్ర రంగానికి నిరంతర ఊతం అందిస్తూ, నేతన్నలకు బతుకుపై భరోసా కల్పించాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *