రాష్ట్రాన్ని చుట్టుముడుతున్న కరువు నీడలు!

తెలంగాణ రాష్ట్రంలో కరువు రక్కసి మళ్లీ కోరలు చాస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం 621 మండలాలకు గాను ఏకంగా 230 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న వార్తలు క్షేత్రస్థాయిలో ఉన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు ఇప్పటికే వందలాది తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి కేంద్ర సాయం కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పుడు తెలంగాణ సైతం అదే దారిలో పయనించక తప్పని స్థితి నెలకొంది. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం దారుణంగా పడిపోవడం, సకాలంలో రుతుపవనాలు సహకరించకపోవడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఇది కేవలం రైతాంగానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, ఆహార భద్రతను కుదిపేసే పెను సంక్షోభం. తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ (టీజీడీపీఎస్) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సగటు వర్షపాతం లోటు 16% మాత్రమే కనిపిస్తున్నప్పటికీ, ఆ రాష్ట్రవ్యాప్తంగా మండలాల మధ్య ఉన్న తీవ్రమైన అసమానతను దాచేస్తున్నది.
33 జిల్లాల్లో 17 జిల్లాలు తక్కువ వర్షపాతం నమోదైన కేటగిరీలో వున్నాయి.  అసలు నిజాలు మండలాలవారీ గణాంకాలను పరిశీలిస్తేనే బట్టబయలవుతున్నాయి. ప్లానింగ్ సొసైటీ నివేదికల ప్రకారం.. రాష్ట్రంలోని సగానికి పైగా, అంటే 312 మండలాలు తీవ్ర వర్షపాత లోటుతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ మండలాల్లో వర్షపాత లోటు మైనస్ 20 శాతం నుండి మైనస్ 59 శాతం వరకు నమోదైంది. మరింత లోతుగా పరిశీలిస్తే  దాదాపు 18 మండలాలు అంటే 50% నుంచి 59%, 57 మండలాల్లో 40 నుంచి 49%, 106 మండలాలు 30% నుంచి 39% శాతం, మరో 125 మండలాల్లో 20% నుంచి 29% వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. అన్నింటికంటే దారుణంగా, జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలం ఏకంగా మైనస్ 69 శాతం వర్షపాత లోటుతో రాష్ట్రంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతంగా రికార్డుకెక్కింది. ఇలాంటి గణాంకాలే పాలకుల కళ్లు తెరిపించాలి. కరువు ప్రకటన అనేది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమో లేదా తాత్కాలిక తూతూమంత్రపు నివేదికల ఆధారంగానో జరగకూడదు. ఈ శాస్త్రీయమైన గణాంకాలను ప్రామాణికంగా తీసుకుని , రాజకీయాలకు అతీతంగా అర్హమైన ప్రతి మండలాన్ని కరువు జాబితాలో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైఉంది.
ఎల్ నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు మొహం చాటేయడంతో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. పెట్టుబడులు పెట్టి, విత్తనాలు మొలకెత్తక రైతులు రెండు మూడు సార్లు తిరగదోలి విత్తనాలు వేయాల్సి వొచ్చింది. ఈ తరుణంలో అన్నదాతలకు ప్రభుత్వం తక్షణ భరోసా ఇవ్వాలి. కరువు పీడిత మండలాల్లోని రైతులకు పంట నష్టపరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) వెంటనే అందించాలి. వ్యవసాయ రుణాల రీ-షెడ్యూలింగ్ ప్రక్రియను బ్యాంకర్లతో మాట్లాడి వేగవంతం చేయాలి. కేవలం రైతులే కాకుండా, ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారుతున్నది . పల్లెల్లో వలసలను అరికట్టడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. కరువు ప్రాంతాలలో పనిదినాలను పెంచి వేగంగా వేతనాలు చెల్లించాలి. పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. కరువు ప్రాంతాలలో పనిదినాలను పెంచి వేగంగా వేతనాలు చెల్లించాలి. భూగర్భ జలాలు పడిపోతుండటంతో రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ప్రణాళికలు అవసరం. తెలంగాణ ప్రభుత్వం ఈ గణాంకాలను ఆయుధంగా చేసుకొని కేంద్ర బృందాల పర్యటన ద్వారా రాష్ట్రాన్ని ఆదుకునేలా గట్టి ఒత్తిడి తేవాలి. ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేకపోవొచ్చు , కానీ బాధ్యతాయుతమైన పారదర్శక పాలనతో అన్నదాతల కన్నీళ్లు తుడవవచ్చునని ప్రభుత్వం నిరూపించాల్సిన సమయమిది.
కరువు ప్రకటన అనేది కేవలం ఒక ప్రకటనతో ముగిసే వ్యవహారం కాదు. దీనికి శాస్త్రీయమైన, పారదర్శకమైన మండలాలవారీ గణాంకాలు ప్రామాణికం కావాలి. కేవలం పైపైన నివేదికలతో కాకుండా, ప్రతి మండలంలో కురిసిన వర్షపాతం, భూగర్భ జలాల మట్టం, సాగు చేసిన పంటల విస్తీర్ణం, జరిగిన పంట నష్టం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. గతంలో కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం లేదా అరకొర అంచనాలతో కరువు ప్రాంతాలను ఎంపిక చేయడం వల్ల నిజమైన బాధితులకు న్యాయం జరగలేదు. ఈసారి ప్రభుత్వం ఆ తప్పులు పునరావృతం కాకుండా, ఉపగ్రహ చిత్రాలు, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా అర్హమైన ప్రతి మండలాన్ని కరువు జాబితాలో చేర్చాలి.
అప్పుడే నిజమైన బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే సాయం సకాలంలో చేరుతుంది. కరువు మండలాలుగా ప్రకటించిన వెంటనే రైతులకు పంట నష్టపరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) అందించాలి. అలాగే, బ్యాంకర్లతో మాట్లాడి పాత రుణాల రీ-షెడ్యూలింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి. లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యల పరంపర మళ్లీ మొదలయ్యే ప్రమాదం ఉంది.రైతులతో పాటు వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారుతున్నది . ఇందుకోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఉపాధి హామీ) పూర్తిస్థాయిలో వాడుకోవాలి. కరువు పీడిత ప్రాంతాలలో పనిదినాలను పెంచడంతో పాటు, వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం లేకుండా చూడాలి. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, తాగునీటి ఎద్దడి రాకుండా జలాశయాల నుంచి నీటిని క్రమబద్ధీకరించడం అత్యవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *