తెలంగాణ ప్రభుత్వానికి ఇక అసలైన పరీక్ష

“రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇక ముందు కాలం కీలకం. తొలి దశలో రాజకీయ మార్పును నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పాలనా మార్పును నిరూపించుకోవాలి. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా పొందిన రాజకీయ ఆధిక్యం క్రమంగా తగ్గుతుంది. సొంత పనితీరే ఇక రక్షణ కవచం..”

పెండ్యాల కొండల్

అధికారంలోకి వచ్చినప్పుడు హామీలు వినిపిస్తాయి. తొలి రోజుల్లో ప్రకటనలు ఆకట్టుకుంటాయి. కానీ పాలనా కాలం సగం దాటేసరికి ప్రజలు ప్రకటనలను కాదు.. ఫలితాలను లెక్కిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇప్పుడు ఎదురవుతున్న అసలు సవాలు ఇదే. పదవీకాలం రెండో అర్ధభాగంలోకి అడుగుపెడుతున్న వేళ.. ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి హామీల అమలుపై ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఇకపై ‘ఏం ప్రకటించారు?’ కాదు.. ‘ఏం చేశారు?’ అన్నదే కొలమానం. 2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినది మార్పు హామీతో. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ఉన్న అసంతృప్తికి ఆరు గ్యారంటీలు తోడయ్యాయి. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వడం సహజమే. పాలనా వ్యవస్థను సర్దుబాటు చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలి. గత నిర్ణయాలను సమీక్షించాలి. కానీ ఆ సమయానికీ ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటిన తర్వాత కారణాల కంటే ఫలితాలే మాట్లాడతాయి. తెలంగాణలో ఇప్పుడు అదే దశ. ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వం ఒక లెక్క చెబుతోంది. ప్రతిపక్షం మరో లెక్క చెబుతోంది. అసలు లెక్క ప్రజలకు తెలియాలి. ఎన్ని హామీలు పూర్తయ్యాయి? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? ఎంత నిధి విడుదలైంది? ఎంతమందికి చేరింది? ఎక్కడ ఆలస్యం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? వీటికి ప్రభుత్వం స్పష్టమైన గణాంకాలతో సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.

ప్రభుత్వ ఉత్తర్వులో పథకం ఉండటం వేరు.. అది ప్రజల జీవితంలో కనిపించడం వేరు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు.. ఇవి రాజకీయ ప్రసంగాల్లో చెప్పుకునే విజయాలు కావు. రైతు ఖాతాలో సాయం పడిందా? విద్యార్థి ఫీజు బకాయి తీరిందా? నిరుద్యోగికి నియామక ఉత్తర్వు అందిందా? పేద కుటుంబానికి ఇల్లు దక్కిందా? అన్నదే అసలు కొలమానం. ఇక్కడే ప్రచారానికీ పాలనకూ మధ్య తేడా తెలుస్తుంది. పథకం ప్రారంభించడం అంతిమ విజయం కాదు. నిధులు కేటాయించడం కూడా ఫలితం కాదు. లబ్ధిదారుడి జీవితంలో మార్పు కనిపించినప్పుడే పాలన తన ఉనికిని నిరూపించుకుంటుంది. కాగితంపై ఉన్న కేటాయింపులు, ప్రకటనల్లో ఉన్న లక్ష్యాలు ప్రజల అనుభవాన్ని మార్చలేవు.

ప్రభుత్వానికి మరో సవాలు గతాన్ని ఎంతకాలం రాజకీయ రక్షణగా ఉపయోగించుకోవచ్చన్నది. బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై విచారణ జరపడం అవసరమే. బాధ్యులను జవాబుదారీ చేయడం కూడా ప్రభుత్వ బాధ్యతే. కానీ గత ప్రభుత్వ తప్పులను బయటపెట్టడం.. ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు సర్టిఫికెట్‌ కాదు. 2023లో ప్రజలు కాంగ్రెస్‌కు వోటు వేసింది గత ప్రభుత్వాన్ని తిట్టడానికి కాదు.. తమకు మెరుగైన పాలన కావాలని.అందుకే మూడేళ్ల తర్వాత కూడా ‘వాళ్లు ఏం చేశారు?’ అన్నదే ప్రధాన సమాధానంగా మిగిలితే.. ‘మేమేం చేశాం?’ అన్న ప్రశ్నకు ప్రభుత్వం సొంతంగా జవాబు చెప్పాల్సిందే.

ఆర్థిక పరిమితులు వాస్తవమే. రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి. జీతాలు, పెన్షన్లు, సంక్షేమం, అప్పుల చెల్లింపులు, మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్టులు.. అన్నింటికీ నిధులు కావాలి. ప్రతి ఎన్నికల హామీని ఒకేసారి అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ పరిమితులను ప్రజలకు నిజాయితీగా వివరించడం, ప్రాధాన్యతలను స్పష్టం చేయడం, అమలుకు గడువులు చెప్పడం మాత్రం ప్రభుత్వ బాధ్యత. ‘ఇప్పుడే సాధ్యం కాదు’ అనడం కంటే ‘ఎప్పుడు సాధ్యం అవుతుంది?’ చెప్పడం ముఖ్యం.

నిధుల కొరత ఒక పరిమితి కావచ్చు. స్పష్టత లేకపోవడం మాత్రం పాలనా లోపం. మీడియా ప్రశ్నలూ మారుతున్నాయి. ప్రభుత్వం ఏం ప్రకటించిందన్నదానికంటే.. ఏం అమలు చేసిందన్నదే ఇప్పుడు ప్రాధాన్యం పొందుతోంది. ఇకపై ప్రతి పథకానికీ లెక్క అడగబడుతుంది. ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారు? ఎంతమందికి చేరింది? ఫలితం ఏమిటి? ఈ ప్రశ్నలను రాజకీయ విమర్శలుగా కొట్టిపారేయడం సాధ్యం కాదు.

ప్రజల సహనానికీ ఒక పరిమితి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కారణాల జాబితాగా మారితే.. నమ్మకం క్రమంగా క్షీణిస్తుంది. మాటకూ చేతకూ మధ్య దూరం పెరిగే కొద్దీ రాజకీయ మూల్యం కూడా పెరుగుతుంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇక ముందు కాలం కీలకం. తొలి దశలో రాజకీయ మార్పును నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పాలనా మార్పును నిరూపించుకోవాలి. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా పొందిన రాజకీయ ఆధిక్యం క్రమంగా తగ్గుతుంది. సొంత పనితీరే ఇక రక్షణ కవచం. ప్రతిపక్షాలు ప్రశ్నించడం రాజకీయ ధర్మం. మీడియా ప్రశ్నించడం ప్రజాస్వామ్య ధర్మం. కానీ ప్రజలు ప్రశ్నించడం మొదలైతే.. అది ప్రభుత్వానికి అసలైన హెచ్చరిక. అయితే 2023లో ప్రజలకు వాగ్దానం చేసిన మార్పు.. 2026 నాటికి వారి జీవితాల్లో నిజంగా ఎంతమేర కనిపిస్తోంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *