– గతేడాదితో పోల్చితే 14.8 శాతం అధికం
– తాత్కాలిక గణాంకాలు విడుదల
న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతున్నదనడానికి సంకేతంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి ఆశాజనకంగా నమోదయ్యాయి. ఆగస్టు నెలకు జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.1,99,853 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 14.8 శాతం అధికం. ముఖ్యంగా దిగుమతులపై పన్నుల వసూళ్లు గణనీయంగా పెరగడమే ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక గణాంకాలను మంగళవారం విడుదల చేసింది. గత ఏడాది ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు రూ.1,74,116 కోట్లుగా ఉండగా ఈసారి దాదాపు రూ.2 లక్షల కోట్ల మార్కుకు చేరువయ్యాయి. ఈ ఏడాది జులైలో నమోదైన రూ.2.11 లక్షల కోట్లతో పోలిస్తే ఆగస్టు వసూళ్లు కొంత తక్కువగా ఉన్నాయి. ఈ వృద్ధిలో దిగుమతుల నుంచి వచ్చిన జీఎస్టీ కీలక పాత్ర పోషించింది. దిగుమతులపై స్థూల జీఎస్టీ ఆదాయం ఏకంగా 29 శాతం పెరిగి రూ.62,604 కోట్లకు చేరింది. మరోవైపు, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ కూడా 9.3 శాతం వృద్ధితో రూ.1,37,249 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో ఆగస్టులో ప్రభుత్వం చెల్లించిన రిఫండ్‌లు కూడా భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే రిఫండ్‌లు 67.9 శాతం పెరిగి రూ.31,795 కోట్లకు చేరాయి. దీంతో రిఫండ్‌లను మినహాయించిన తర్వాత ప్రభుత్వానికి అందిన నికర జీఎస్టీ ఆదాయం రూ.1,68,057 కోట్లుగా ఉంది. ఇది గతేడాది నికర ఆదాయంతో పోలిస్తే 8.3 శాతం మాత్రమే ఎక్కువ. నికర వసూళ్లను విశ్లేషిస్తే కస్టమ్స్ జీఎస్టీ ఆదాయం 22.3 శాతం వృద్ధితో రూ.49,299 కోట్లకు చేరగా, దేశీయ నికర జీఎస్టీ వసూళ్ల వృద్ధి మాత్రం కేవలం 3.4 శాతానికే పరిమితమై రూ.1,18,759 కోట్లుగా నమోదైంది. దేశీయంగా రిఫండ్‌లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ గణాంకాలు వెలువడిన నేపథ్యంలో ఈనెల 12న దిల్లీలో 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి ఒకరోజు ముందు అధికారులస్థాయి సమావేశం కూడా జరగనున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





