రాజకీయ రణ క్షేత్రంలో రగులుతున్న వివాదాలు

  “నిరసనలను పట్టించుకోకుండా,  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డీ లిమిటేషన్ బిల్లుతో పాటు, మహిళలకు చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లులు ప్రస్తుతం జరుగుతున్న సిజెపి, విపక్షాల నిరసనల నుండి దారి మళ్ళించడానికా? లేక ప్రతి పక్షాలు మహిళల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ప్రజల్లో దురభిప్రాయం కలిగించడానికా? అనే అంశాలను పక్కన బెడితే డీ లిమిటేషన్ బిల్లును,మహిళల రిజర్వేషన్ల బిల్లుతో ముడిపెట్టి, తాము అనుకున్న లక్ష్యం సాధించడానికే సన్నద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి..”
-సుంకవల్లి సత్తిరాజు. (సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్)  తూ. గో. జిల్లా,ఆంధ్రప్రదేశ్.    మొ:9704903463.

దేశ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇరాన్ యుద్ధం వలన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం లోని పాలక,ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలకు పదును పెడుతున్నాయి. దురదృష్టవశాత్తూ జన్ జి లకు కూడా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు పట్టడం లేదు. సిఇసి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఒక వైపు సిజెపి, మరో వైపు ఇండీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం పై తీవ్ర వత్తిడిని కొనసాగిస్తూ, నిరసనలతో దేశ రాజధానిలోను, ఇతర రాష్ట్రాల్లోను తమ ఆందోళనలను ఉధృతం చేస్తుండగా మరొక వైపు కేంద్ర ప్రభుత్వం ప్రత్యర్ధులను కట్టడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇంతకు ముందే జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి, కాక్రోచ్ లు నిర్వహించిన ఉద్యమానికి స్పందించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి,సోనమ్ వాంగ్ చుక్ చేత నిరాహార దీక్ష విరమింప చేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దల పై మరోసారి ఒత్తిడి పెంచి, ఇప్పుడు సిఇసి జ్ఞానేష్ కుమార్ చేత రాజీనామా చేయించాలని వైరి పక్షాలు పట్టుబడుతున్నాయి.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో బొద్దింకల ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం సిఇసి విషయంలో తలెత్తిన నిరసన జ్వాలలను పట్టించుకోవడం లేదు. జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న  సిజెపి, ప్రతిపక్షాల ఆందోళనలను అణచి వేయడానికే ఎన్డీఏ ప్రభుత్వం మొగ్గు చూపడం గమనార్హం. ప్రత్యర్ధుల ఆందోళనలకు లొంగిపోతే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా తాము వారు చేసిన ఆరోపణలను అంగీకరించినట్టే అవుతుందని భావించి ఉండవచ్చు. అందుకే ఈ నిరసనలను పట్టించుకోకుండా,  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డీ లిమిటేషన్ బిల్లుతో పాటు,మహిళలకు చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లులు ప్రస్తుతం జరుగుతున్న సిజెపి, విపక్షాల నిరసనల నుండి దారి మళ్ళించడానికా? లేక ప్రతి పక్షాలు మహిళల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ప్రజల్లో దురభిప్రాయం కలిగించడానికా? అనే అంశాలను పక్కన బెడితే డీ లిమిటేషన్ బిల్లును,మహిళల రిజర్వేషన్ల బిల్లుతో ముడిపెట్టి, తాము అనుకున్న లక్ష్యం సాధించడానికే సన్నద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
 గతంలో డీలిమిటేషన్ బిల్లు పై వ్యతిరేక గళం వినిపించిన స్టాలిన్ నేతృత్వం లోని డిఎంకె ప్రస్తుతం ఎన్డీఏ కు దగ్గరవుతున్న సూచనలు అగుపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుండి చీలిన పలువురు ఎంపిలు,ఇతర పార్టీలకు చెందిన సభ్యులు ఈ బిల్లులను గట్టెక్కించడంలో సహకరిస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, పార్లమెంటు లోను,కేంద్రంలోను దక్షిణాది రాష్ట్రాల ప్రాభవం తగ్గి, ఉత్తరాది రాష్ట్రాలు ఆధిపత్యం చెలాయిస్తాయనే వాదన సత్య దూరం కాదు. అయితే లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల చట్టసభల సీట్లను 50 శాతం పెంచి పునర్విభజన చేపట్టడం కొంతలో కొంత ఉపశమనం కలిగించే చర్య అయినప్పటికీ, ఇది పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగించే చర్య మాత్రం కాబోదు .ప్రతిపక్షాలు సూచించిన విధంగా డీ లిమిటేషన్ బిల్లు పక్కన బెట్టి,ఇప్పుడున్న 543 స్థానాల్లోనే మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడానికి కేంద్రం అంగీకరించదు.
జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలు సీట్ల విషయంలో అధికంగా లబ్ధి పొందుతాయి. దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఉత్తరాది ప్రాబల్యం పెరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి, తీవ్ర వివక్షతకు గురయ్యే అవకాశాలున్నాయి. నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, ఇప్పటికే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలనుండి అధిక మొత్తంలో పన్నులు గుంజి, దక్షిణాదికి లాంఛనంగా నాలుగు మెతుకులు విదుల్చుతూ, ఉత్తరాదికి మేలు చేస్తున్నదనే వాదన విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు జోరందుకోవడంతో అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాల అసెంబ్లీ,లోక్ సభ సీట్లను 50 శాతం పెంచుతామని ప్రకటించింది. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన డీ లిమిటేషన్ బిల్లులో ఈ విషయమై స్పష్టత కొరవడిందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ గతంలోనే నిలదీసింది. అయితే గతంలో ప్రవేశ పెట్టిన బిల్లులోని అంశాలను మారుస్తారా? లేక యథాతథంగా బిల్లును ప్రవేశ పెడతారా? కాంగ్రెస్ కోరినట్టు ప్రతిపక్షాలతో సంప్రదిస్తారా? అనే విషయాలపై సందిగ్ధత తొలగితే కాని, ఈ అంశం పై పూర్తి స్థాయిలో స్పష్టత రాదు.
ప్రస్తుతం దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు తెలుగు రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్ కు లోక్ సభ లో 55 సీట్ల వ్యత్యాసముంది. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ విషయంలో 63 సీట్ల వ్యత్యాసముంది. తమిళనాడు తో పోల్చిచూస్తే ప్రస్తుత యుపి లోక్ సభ సీట్లు 41 సీట్లు అధికం. జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెంచితే ఆంధ్ర, యుపి ల మధ్య 82 సీట్లు, ,తెలంగాణాతో పోల్చి చూస్తే 94 సీట్లు ,తమిళనాడు,యు.పి ల మధ్య 61 సీట్ల వ్యత్యాసముంటుంది. ఏ విధంగా చూసినా పెద్ద రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుత మున్న లోక్ సభ సీట్ల సంఖ్య 543 నుండి 816 కు పెంచడం వలన పెరిగే లోకసభ సభ్యుల సంఖ్య వలన ప్రభుత్వ ఖజానా పై మరింత భారం పడే అవకాశముంది. ఇక రాష్ట్రాల్లో పెరిగే శాసన సభ్యుల సంఖ్య వలన కూడా విపరీతమైన ఆర్ధిక భారం పడుతుంది. ఈ భారాన్ని ప్రజల మీద మోపడం భావ్యమా? ఇప్పటికే సామాన్య ప్రజలపై వివిధ మార్గాల్లో ప్రభుత్వాలు ఆర్ధిక భారం మోపుతున్నాయి. పెద్ద పెద్ద నియోజకవర్గాలను విభజించి, అధికార వికేంద్రీకరణ చేయడం సముచితమే. అయితే ప్రభుత్వ నిర్ణయాలు కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా పరిణమించరాదు. డీ లిమిటేషన్ హేతుబద్ధంగా జరగాలి. ఉత్తర,దక్షిణ భారతాల మధ్య విబేధాలు తలెత్తకూడదు. డీలిమిటేషన్ పై లోతైన మేథోమధనం జరగాలి. తీవ్రమైన కసరత్తు జరగాలి. అందరికీ ఆమోదయోగ్యం పద్ధతిలో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *