ఆధునిక భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం, పురాతన సంప్రదాయాల మధ్య ఘర్షణ నిరంతరం జరుగుతూనే ఉన్నది. ఈ ఘర్షణకు అత్యంత స్పష్టమైన ఉదాహరణగా హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం నిర్వహించే ‘చేప ప్రసాదం’ నిలుస్తున్నది. సుమారు 180 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కార్యక్రమం, కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన సంప్రదాయంగా కాకుండా, వేల సంఖ్యలో ప్రజల విశ్వాసంగా, రాజకీయ ప్రాధాన్యం కలిగిన ఒక సామాజిక వేడుకగా రూపాంతరం చెందింది. అయితే ఆధునిక వైద్య శాస్త్రం దీనిని తీవ్రంగా విమర్శిస్తోంది. ఆస్తమా వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులకు శాస్త్రీయమైన చికిత్సలు అందుబాటులో ఉన్న నేటి కాలంలో, ఒక ప్రాణమున్న చేపను మింగడం ద్వారా వ్యాధి నయమవుతుందనే వాదన ఎంతవరకు సమంజసం అనేది ప్రధాన చర్చాంశం. చేప ప్రసాదం చారిత్రక నేపథ్యం, అందులో ఉపయోగించే పదార్థాల శాస్త్రీయత, ప్రభుత్వం దీనికి అందిస్తున్న మద్దతు వెనుక ఉన్న రాజకీయ కోణాలు, రాజ్యాంగం నిర్దేశించిన ‘శాస్త్రీయ దృక్పథం’ (సైంటిఫిక్ టెంపర్) అమలులో ఎదురవుతున్న సవాళ్లను విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది.
చేప ప్రసాదం మూలాలు 19వ శతాబ్దపు మధ్యకాలంలో ఉన్నాయి. 1845వ సంవత్సరంలో హైదరాబాద్‌లోని దూద్‌బౌలి ప్రాంతంలో నివసించే బత్తిని వీరన్న గౌడ్ అనే వ్యక్తికి ఒక హిమాలయ యోగి ఈ రహస్య మూలికా మిశ్రమాన్ని ఉపదేశించారని ఈ కుటుంబం చెబుతున్నది. ఆ యోగి చెప్పిన నిబంధన ప్రకారం ఈ ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేయాలి. దాని తయారీ విధానాన్ని రహస్యంగా ఉంచాలి. అప్పుడే అది పని చేస్తుందని వారి నమ్మకం. వీరన్న గౌడ్ నుంచి మొదలైన ఈ పరంపర ప్రస్తుతం వారి ఐదవ, ఆరవ తరానికి చేరుకున్నది. ఈ సంప్రదాయం కేవలం ఒక చికిత్సగా మాత్రమే కాకుండా, ఒక మతపరమైన, ఆధ్యాత్మిక ఆచారంగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం రుతుపవనాల రాకను సూచించే ‘మృగశిర కార్తి’ నక్షత్రం రోజున ఈ పంపిణీ జరుగుతున్నది. మృగశిర కార్తి రోజున వాతావరణంలో వచ్చే మార్పులు ఆస్తమా రోగులపై ప్రభావం చూపుతాయని, ఆ సమయంలో ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని బత్తిని కుటుంబ సభ్యులు వాదిస్తారు.
గతంలో దూద్‌బౌలిలోని వారి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం, జనాభా పెరుగుదల, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ప్రభుత్వం జోక్యంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మార్చారు. దూరప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రసాదం కోసం రావడంతో 1980లలో దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 1990లలో ఈ ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టింది. చేపమందుకు శాస్త్రీయత లేకపోవడంతో న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా 2012లో దీనికి ‛చేప ప్రసాదం’గా పేరు మార్చారు. 2026లో దీనికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసి, డిజిటల్ పర్యవేక్షణను పెంచింది. దీనితో పాలనాపరమైన ప్రాధాన్యం పెరిగింది. బత్తిని కుటుంబం ఈ రహస్యాన్ని అత్యంత జాగ్రత్తగా కాపాడుతోంది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపినా తాము ఈ సూత్రాన్ని వెల్లడించలేదని, కేవలం సేవా దృక్పథంతోనే దీనిని కొనసాగిస్తున్నామని వారు చెబుతారు. అయితే ఈ రహస్యమే ఆధునిక వైద్యుల విమర్శలకు ప్రధాన కారణమైంది. ఏ పదార్థంతో ఔషధం తయారైందో తెలియకుండా దానిని రోగులకు ఇవ్వడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆహార నియమాలతోనే ఉపశమనం?
చేప ప్రసాదంలో ప్రధానంగా ‘ముర్రెలు’ రకం చేపను ఉపయోగిస్తారు. ఈ చేప సుమారు 2 నుంచి 3 అంగుళాల పొడవు ఉంటుంది. చేప నోటిలో ఒక పసుపు రంగు మూలికా మిశ్రమాన్ని ఉంచి, దానిని సజీవంగా రోగి గొంతులోకి పంపిస్తారు. శాస్త్రీయంగా చూస్తే ఈ చేపలో అధిక మొత్తంలో ప్రోటీన్లు, అమినో యాసిడ్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ప్రోటీన్లతో కణజాల మరమ్మతు, ఎదుగుదల ఉంటుంది. అమినో యాసిడ్లు, గ్లైసిన్, గ్లుటామిక్ యాసిడ్లు గాయాలను నయం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వాపును తగ్గిస్తూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. విటమిన్ ఏ, డీ కంటిచూపు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. బత్తిని కుటుంబం వాదన ప్రకారం ప్రాణమున్న చేప గొంతులోకి వెళ్తున్నప్పుడు అది తన తోకను, మొప్పలను ఆడించడం ద్వారా శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే అది తనతో పాటు తీసుకెళ్లే మూలికా మిశ్రమం నేరుగా ప్రభావం చూపుతుందని వారు చెబుతారు. కానీ వైద్య నిపుణులు ఈ వాదనను అసంబద్ధమైనదిగా కొట్టిపారేస్తున్నారు.
మానవ శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం చేప ఆహార నాళం ద్వారా జీర్ణశయానికి చేరుకుంటుంది. కానీ ఆస్తమా అనేది శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి. ఆహార నాళంలో కదిలే చేప శ్వాసనాళాలను శుభ్రం చేయడం అసాధ్యమని వైద్యులు వివరిస్తున్నారు. చేప ప్రసాదం తీసుకున్న తర్వాత రోగులు 45 రోజుల పాటు కఠినమైన ఆహార నియమాలను పాటించాలి. ఈ నియమాలలో భాగంగా కొన్ని రకాల అలర్జీ కారక ఆహారాలను (ఉదాహరణకు వేయించిన పదార్థాలు) నిలిపివేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ ఆహార నియమాల వల్ల రోగులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది తప్ప, కేవలం చేప వల్ల కాదని వైద్య విశ్లేషకులు భావిస్తున్నారు.
వైద్య విమర్శలు, ప్రజారోగ్య సమస్యలు
వైద్య సంఘాలు, ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చేప ప్రసాదానికి సంబంధించి ఎటువంటి క్లినికల్ ట్రయల్స్ జరగలేదని, దాని సామర్థ్యాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవని వారు వాదిస్తున్నారు. చేప ప్రసాదం తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలను వైద్యులు ప్రధానంగా మూడు రకాలుగా విడదీస్తున్నారు. మొదటిది చేపలలో ఉండే ప్రోటీన్ల పట్ల కొంతమందికి తీవ్రమైన అలెర్జీ ఉంటుంది. ఆస్తమా రోగులలో ఇప్పటికే రోగనిరోధక వ్యవస్థ సున్నితంగా ఉంటుంది కాబట్టి, చేపల వల్ల వచ్చే అలెర్జీ వారి శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేయవచ్చు. రెండవది ఇన్ఫెక్షన్ల ప్రమాదం. వందలాది మందికి ఒకే వ్యక్తి తన చేతులతో, ఎటువంటి శానిటైజేషన్ లేకుండా చేపలను నోట్లో వేయడం ద్వారా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉన్నది. మూడవది భౌతిక ప్రమాదాలు. బలవంతంగా చేపను మింగించే క్రమంలో, అది ఆహార నాళానికి బదులుగా శ్వాసనాళంలోకి వెళ్లే ప్రమాదం ఉన్నది. గొంతులో చేప ఎముకలు గుచ్చుకోవడం లేదా గొంతు వాపు రావడం వంటి కేసులు కూడా నమోదయ్యాయి.
జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు గతంలో ఈ ప్రసాదంలోని పసుపు రంగు ముద్దను వివిధ ప్రయోగశాలలలో పరీక్షించాయి. కొన్ని పరీక్షలలో ఇందులో మాంగనీస్, సీసం వంటి భార లోహాలు (హెవీ మెటల్స్) అనుమతించదగిన స్థాయి కంటే ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని సార్లు ఇందులో స్టెరాయిడ్లు కలిపి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం తరపున నిర్వహించిన కొన్ని పరీక్షలలో ఇటువంటి హానికర పదార్థాలు ఏవీ లేవని తేలిందని బత్తిని కుటుంబం కోర్టులో వాదించింది. ఐఐసీటీ/విమ్టా ల్యాబ్స్ పరిశోధనలో భార లోహాలు (సీసం, మాంగనీస్) ఉన్నట్టు తేలింది. చేపమందు వాడిన పలువురు రోగుల ఊపిరితిత్తుల సామర్థ్యంలో మార్పు లేదని అపోలో హాస్పిటల్స్ క్లినికల్ పరిశీలనలో తేలింది. ప్రముఖ శాస్త్రవేత్త, సీసీఎంబీ వ్యవస్థాపకుడు డాక్టర్ పీఎం. భార్గవ ఈ ప్రసాదాన్ని ఒక “జోక్” గా అభివర్ణించారు. ఒక ప్రత్యేకమైన రోజున మాత్రమే ఔషధం పనిచేస్తుందని చెప్పడం వెనుక ఎటువంటి తార్కికత లేదని ఆయన అన్నారు. కేవలం నమ్మకం ఆధారంగానే ప్రజలు తమకు వ్యాధి నయమైనట్టు భావిస్తున్నారని, కానీ వాస్తవానికి వారి శరీరంలో ఎటువంటి మార్పు జరగడం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మూఢనమ్మకానికి ప్రభుత్వ ప్రోత్సాహమా?
చేప ప్రసాదం చుట్టూ ఉన్న వివాదాలు దశాబ్దాలుగా కోర్టు మెట్లెక్కాయి. ప్రధానంగా ‘ఔషధం’ అనే పదప్రయోగంపై న్యాయపరమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం, శాస్త్రీయంగా నిరూపించబడని ఏ పదార్థాన్నీ ఔషధంగా ప్రచారం చేయకూడదు. ఈ చట్టం నుంచి తప్పించుకోవడానికి బత్తిని కుటుంబం 2012 నుంచి దీనిని ‘చేప ప్రసాదం’గా పిలవడం ప్రారంభించింది. ప్రసాదం అనేది విశ్వాసానికి సంబంధించింది కాబట్టి, దానిని ఔషధ నియంత్రణ చట్టాల పరిధిలోకి తీసుకురావడం కష్టమని వారు భావించారు. 2013లో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ బీ. సుభాషణ్ రెడ్డి ఒక సంచలన తీర్పు ఇచ్చారు. శాస్త్రీయ ఆధారం లేని ఇటువంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజా ధనాన్ని వినియోగించకూడదని ఆయన ప్రభుత్వాన్ని ఆదేశించారు. చేపలను సరఫరా చేయడం లేదా శిబిరాలను నిర్వహించడం వంటి పనుల నుంచి ప్రభుత్వం తప్పుకోవాలని ఆయన సూచించారు.
అయితే ఈ తీర్పుపై బత్తిని కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి, శాంతిభద్రతల దృష్ట్యా, వారి భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం తప్పనిసరి అని హైకోర్టు అభిప్రాయపడింది. ఫలితంగా నేటికీ ప్రభుత్వ శాఖలు నేరుగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ అచ్యుతరావు వంటి వారు కూడా కోర్టులో పిటిషన్లు వేశారు. ముఖ్యంగా చిన్న పిల్లల నోట్లోకి బలవంతంగా చేపలను కుక్కడం అనేది వారి హక్కుల ఉల్లంఘన అని, అది వారి ప్రాణాలకు ప్రమాదకరమని ఆయన వాదించారు. కోర్టు ఈ విషయమై ప్రభుత్వాన్ని వివరణ కోరినప్పటికీ, “ప్రజా విశ్వాసం” అనే అంశం ముందు ఈ వాదనలు బలహీనపడ్డాయి.
తెలంగాణ ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి ప్రతి ఏటా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోంది. 21 ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ పంపిణీ జరుగుతుంది. ఫిషరీస్ శాఖ సుమారు 1.5 లక్షల నుంచి 3.5 లక్షల చేప పిల్లలను సిద్ధం చేస్తున్నది. పోలీస్ శాఖ వేలాది మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నది. మున్సిపల్, వాటర్ బోర్డ్, విద్యుత్ శాఖలు నిరంతర సేవలను అందిస్తాయి. జూన్ 8, 2026న జరగనున్న చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టరేట్‌లో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో తెలియజేస్తాయి. “179 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం హైదరాబాద్ నగర ప్రత్యేకత” అని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా లైటింగ్, తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సీపీఆర్ శిక్షణ పొందిన వలంటీర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ మద్దతు వెనుక ఉన్న అసలు కారణం వోట్ల రాజకీయాలని విమర్శకులు భావిస్తున్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూడా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారు. ఇంతటి భారీ స్థాయిలో ఉన్న ప్రజల విశ్వాసాన్ని వ్యతిరేకించడం ద్వారా రాజకీయంగా నష్టం జరుగుతుందని ఏ ప్రభుత్వం కూడా సాహసించడం లేదు. అందుకే శాస్త్రీయత కంటే ప్రజల నమ్మకానికే ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి.
శాస్త్రీయ దృక్పథం వర్సెస్ మూఢనమ్మకాలు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(హెచ్) ప్రకారం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి “శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, విచారణా, సంస్కరణ స్ఫూర్తిని అభివృద్ధి చేసుకోవడం”. ప్రభుత్వం ఒక అశాస్త్రీయ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం ఈ రాజ్యాంగ విధికి విరుద్ధమని రాజ్యాంగ నిపుణులు వాదిస్తున్నారు. శాస్త్రీయ దృక్పథం అంటే కేవలం విజ్ఞాన శాస్త్రం చదవడం కాదు, సమాచారాన్ని తర్కంతో ఆలోచించడం, ఆధారాలు లేని విషయాలను తిరస్కరించడం. ప్రభుత్వం ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగతి సాధిస్తున్నామని చెబుతూనే, మరోవైపు ఇటువంటి అశాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
శాస్త్రీయ దృక్పథం విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. 2026లో ముఖ్యమంత్రి విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్కుడిని ప్రభుత్వ ఓఎస్డీగా నియమించగా, తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ఉత్తర్వును 24 గంటల్లోనే వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వం అధికారికంగా జ్యోతిష్యానికి, మూఢనమ్మకాలకు మద్దతు ఇవ్వకూడదని, అటువంటి నియామకాలు ప్రజలలో తప్పుడు సందేశాన్ని పంపిస్తాయని మేధావులు, రాజకీయ నేతలు విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం లౌకికవాదంతో పాటు శాస్త్రీయ ఆలోచనలను కూడా ప్రోత్సహించాలని వారు వాదించారు. ఈ పోలికతో చూస్తే, తెలంగాణ ప్రభుత్వం చేప ప్రసాదం విషయంలో అనుసరిస్తున్న తీరు మరింత అశాస్త్రీయంగా కనిపిస్తోందని విమర్శకులు ఎత్తి చూపుతున్నారు.
ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు చేప ప్రసాదం వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారనేది ఒక కీలకమైన సామాజిక ప్రశ్న. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆస్తమా చికిత్సలో ఉన్న భయం. రెండు అద్భుతాల పట్ల ఉన్న ఆశ. ఆస్తమా రోగులు జీవితాంతం ఇన్హేలర్లు వాడాల్సి ఉంటుందని వైద్యులు చెబుతారు. కానీ ఇన్హేలర్ల పట్ల సమాజంలో ఒక రకమైన అపోహ ఉన్నది. ఇన్హేలర్లు వాడితే అలవాటు అయిపోతుందని, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ప్రజలు భయపడుతుంటారు. ఈ క్రమంలో “ఒక్కసారి తీసుకుంటే శాశ్వతంగా తగ్గిపోతుంది” అనే చేప ప్రసాదం వాగ్దానం వారిని ఆకర్షిస్తోంది. అలాగే భారతదేశంలో సంప్రదాయ వైద్యం, ఆధ్యాత్మికత కలిసి ఉండడం వల్ల ప్రజలు ఇటువంటి ‘మహిమలను’ సులభంగా నమ్ముతారు. ఇది పూర్వికుల నుంచి వస్తున్న సంప్రదాయమని చెబుతూ దీనిని ప్రజలు నమ్ముతున్నారు. పాతదైనంత మాత్రాన అది సరైనదనే నిరూపణ ఏదని శాస్త్రీయవాదులు ప్రశ్నిస్తున్నారు. అది ఉచితంగా లభిస్తుండడంతో ఎటువంటి జవాబూదారితనం ఉండదు. “నేను తీసుకున్నాక బాగుంది” అనే సాక్ష్యాలు కేవలం ప్లాసిబో ఎఫెక్ట్ మాత్రమే. రాజకీయ అవసరం కోసం ప్రభుత్వం దీనికి ఏర్పాట్లు చేస్తున్నది.
భవిష్యత్తు సవాళ్లు, సూచనలు
చేప ప్రసాదం పంపిణీ అనేది కేవలం ఒక ఆరోగ్య సమస్య మాత్రమే కాదు. అది ఒక సంక్లిష్టమైన సామాజిక, రాజకీయ సమస్య. దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం, సమాజం శాస్త్రీయ దృక్పథంతో ముందడుగు వేయాలి. ప్రభుత్వం, స్వతంత్ర పరిశోధనా సంస్థలు ఈ ప్రసాదంపై శాస్త్రీయమైన పరిశోధనలు జరపాలి. అందులో ఉపయోగించే మూలికల వల్ల నిజంగానే శ్వాసనాళాల వాపు తగ్గుతుందా లేదా అనే విషయాన్ని ఆధారాలతో నిరూపించాలి. ప్రజలకు ఆస్తమా వ్యాధి గురించి, ఇన్హేలర్ల వాడకం గురించి సరైన అవగాహన కల్పించాలి. చేప ప్రసాదం అనేది ఒక సంప్రదాయ వేడుక మాత్రమే తప్ప అది శాస్త్రీయ చికిత్స కాదనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలి. పంపిణీ జరిగే చోట కనీస ఆరోగ్య ప్రమాణాలు పాటించేలా చూడాలి. ప్రతి ఒక్కరికీ చేపను మింగించే ముందు వలంటీర్లు చేతులను శుభ్రం చేసుకోవడం, అనారోగ్యంతో ఉన్న పిల్లలకు దూరంగా ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతను గుర్తుంచుకొని, అశాస్త్రీయ పద్ధతులను అధికారికంగా ప్రోత్సహించడం మానుకోవాలి. నిధుల కేటాయింపులో ప్రాధాన్యతలను గుర్తించి, మూఢనమ్మకాల కంటే ఆధునిక వైద్య సౌకర్యాల మెరుగుదలకే ఎక్కువ ఖర్చు చేయాలి.
హైదరాబాద్ చేప ప్రసాదం అనేది విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య ఉన్న గీతను చెరిపేసే ఒక ప్రయత్నం. 180 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న కుటుంబ సంప్రదాయం, నేడు ప్రభుత్వ అండదండలతో ఒక భారీ సామాజిక వేడుకగా మారింది. అయితే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, ఆరోగ్య ముప్పులు పొంచి ఉండడం రాజ్యాంగబద్ధమైన శాస్త్రీయ దృక్పథానికి ఇది విరుద్ధంగా ఉండడం ఆందోళన కలిగించే అంశాలు. ప్రభుత్వం కేవలం వోట్ల రాజకీయాల కోసం కాకుండా, ప్రజల ప్రాణాలను, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని గౌరవిస్తూ వ్యవహరించాలి. ప్రజలు కూడా సంప్రదాయాలను గౌరవిస్తూనే, ఆధునిక వైద్య చికిత్సలను పక్కన పెట్టకుండా జాగ్రత్త వహించాలి.
చివరగా ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే అది కేవలం సాంకేతికతతో మాత్రమే కాదు. ఆలోచనా విధానంలో వచ్చే మార్పుతో కూడా సాధ్యమవుతుంది. చేప ప్రసాదం వంటి విషయాలపై బహిరంగంగా, శాస్త్రీయంగా చర్చ జరగడం ఆ మార్పునకు మొదటి అడుగు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి చేసే ఏర్పాట్లలో చూపిస్తున్న ఉత్సాహాన్ని, అదే స్థాయిలో ప్రజలకు ఆస్తమా వ్యాధిపై శాస్త్రీయ అవగాహన కల్పించడంలో కూడా చూపాల్సిన అవసరం ఉన్నది. మంత్రులు తాము ప్రోత్సహిస్తున్న విషయాలు ప్రజారోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తున్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం ఓఎస్డీ నియామకం విషయంలో చూపిన చొరవ, శాస్త్రీయ దృక్పథం పట్ల ప్రభుత్వాలకు ఉండాల్సిన నిబద్ధతకు ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. ప్రజారోగ్యం అనేది రాజీ పడకూడని అంశం. అక్కడ కేవలం విజ్ఞాన శాస్త్రానికే పెద్దపీట వేయాలి తప్ప, అశాస్త్రీయ నమ్మకాలకు కాదు!
– మేకల ఎల్లయ్య,
– సీనియర్ జర్నలిస్ట్,
-ప్రజాతంత్ర
మిస్‌ఫైర్ అయిన ‘హిట్లర్’ పోలిక