– పదేళ్లలో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పులపాలు చేశారు
– డిస్కంలను ముంచేసి ఇప్పుడు కల్లాల్లోకి వస్తామంటారా?
– ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం ఎందుకు కొనడం లేదు?
– హరీష్ రావు రోజుకో అబద్ధాన్ని సృష్టిస్తున్నారు
– త్వరలో 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా
– ఒకే విడతలో రూ.22 వేల కోట్ల రైతు రుణ మాఫీ
– 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
– స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధికి రూ.60 కోట్లతో విద్యుత్ పనులు
– బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి
స్టేషన్ ఘన్‌పూర్, ప్రజాతంత్ర, జూన్ 9 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆరఎస్‌లు కుమ్మక్కై రైతులను, ప్రజలను వంచిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం పల్లగుట్ట గ్రామంలో మంగళవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం చేస్తోన్న రికార్డు స్థాయి ధాన్యపు కొనుగోళ్లు, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆరఎస్, బీజేపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నిప్పులు చెరిగారు. గత బీఆరఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను, వనరులను విచ్చలవిడిగా దోపిడీ చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి వెళ్లారు. ఆ పాపానికి ఇప్పుడు తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రూ.76 వేల కోట్లను అసలు, వడ్డీల రూపంలో బ్యాంకులకు కట్టాల్సి వస్తోంది. ఆ అప్పులే లేకపోయి ఉంటే ఈ రూ.76 వేల కోట్లను ప్రజల సంక్షేమానికి అందించి రాష్ట్ర దశ, దిశ మార్చేవాళ్లం అని అన్నారు. పేదల సొమ్మంతా గత పాలకుల ఇళ్లకే పోయిందని, అందుకే పదేళ్లలో పేదలకు సన్న బియ్యం గానీ, ఇందిరమ్మ ఇళ్లు గానీ ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు.
డిస్కంలను ముంచేసింది మీరు కాదా?
పదేళ్లపాటు ఉచిత కరెంట్ ఇస్తున్నామని బీఆరఎస్ నేతలు గప్పాలు కొట్టుకున్నారే తప్ప డిస్కంలకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా వాటిని అప్పుల పాలు చేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. మీరు చేసిన తప్పుల వల్ల డిస్కంలు ఆదాయం లేక, క్వాలిటీ పవర్ ఇవ్వలేక ఇబ్బందిపడ్డాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రైతులు కట్టాల్సిన రూ.14 వేల కోట్లను, పేదల ఉచిత కరెంట్ (గృహజ్యోతి) బిల్లు రూ.5 వేల కోట్లను.. మొత్తంగా రూ.19 వేల కోట్లను ప్రతి నెలా నేరుగా డిస్కంలకు చెల్లిస్తూ క్వాలిటీ పవర్ ఇస్తున్నామని చెప్పారు.. దీనిపై కూడా అభాండాలు వేయడం బీఆరఎస్ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.
హరీష్ రావు రోజుకో అబద్ధాన్ని సృష్టిస్తున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ కేబినెట్ రోజుకు 18 గంటలు ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తుంటే పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కేవలం వార్తల్లో ఉండటం కోసం రోజుకొక అబద్ధపు వార్తను సృష్టిస్తున్నారు. గాలి కబుర్లు పోగేసి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారు. అధికారం పోవడంతో తట్టుకోలేక కట్టుకథలు అల్లుతున్నారు అని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసిన బీజేపీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రైతులను కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాల మీద వదిలేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని ఎఫ్‌సిఐ ద్వారా ఎందుకు సేకరించడం లేదని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రమే కొనుగోలు చేసేదని, ఇప్పుడెందుకు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు అని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం కొన్నా కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రమను గౌరవిస్తూ చివరి ధాన్యపు గింజ వరకూ కొంటుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మద్దతు ధరతో మొక్కజొన్నలు కొంటున్నారా అని ప్రశ్నించిన ఆయన కేవలం తెలంగాణలోనే మొక్కజొన్నను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.
తగుదునమ్మా అంటూ కల్లాల్లోకి వస్తారా?
రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 72.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుంటే తగుదునమ్మా అంటూ బీజేపీ, బీఆరఎస్ నాయకులు కల్లాల్లోకి వస్తాం, రైతుల కన్నీళ్లు తుడుస్తాం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇన్ని రోజులు మీరెక్కడికి పోయారు అని ప్రశ్నించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని భట్టి స్పష్టం చేశారు. ఒకే విడతలో రూ.22 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత తమదేనని, విమర్శలు మాని దమ్ముంటే కేంద్రం చేత ధాన్యం కొనుగోలు చేయించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
పేదల గృహ నిర్మాణానికి పెద్దపీట
గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ పేరుతో పేదలను వంచించిందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తొలి విడతగా రూ.22,500 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి అదనంగా మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబం ఉండకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.
మహిళా సాధికారతకు అండ
మహిళా సంఘాలకు రెండున్నరేళ్లలోనే రూ.67 వేల కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇప్పించామని, ఐదేళ్లలో ఈ మొత్తాన్ని రూ.1.25 లక్షల కోట్లకు పెంచుతామని భట్టి విక్రమార్క వెల్లడించారు. మహిళా సంఘాలే స్వయంగా బస్సులు కొనుగోలు చేస్తే వాటిని ఆర్టీసీలో తిప్పి వారికి స్థిరమైన ఆదాయం కల్పించే వినూత్న కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నామని వివరించారు.
స్థానిక సమస్యలపై సానుకూల స్పందన 
నియోజకవర్గంలో రూ.60 కోట్లతో సబ్‌స్టేషన్ల భూమి పూజలు, ప్రారంభోత్సవాలు జరిపారు. సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరిన పలు అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. రఘునాథపాలెంలో 232 కేవీ సబ్‌స్టేషన్ అప్‌గ్రేడేషన్‌పై తక్షణమే సాధ్యసాధ్యాల పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న కరెంట్ లైన్ల మార్పిడి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని సభాముఖంగా మాట ఇచ్చారు. గతంలో పక్కనబెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తోందని, ఈ నియోజకవర్గానికి కూడా సబ్‌ప్లాన్ నిధులు పెద్ద ఎత్తున వస్తాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పల్లగుట్టకు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్థానిక శాసనసభ్యుడు కడియం శ్రీహరి, పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, దొంతి మాధవరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తదితరులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





