దేశంలోనే తొలిసారి తెలంగాణలో మొదలు
పేదల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు
డీలర్లకు కమీషన్ పెంపునకు యోచన
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, ప్రజాతంత్ర, మార్చి 29 : సన్న బియ్యం పంపిణీ పథకం స్వతంత్ర భారత దేశంలోనే విప్లవాత్మకమైన మార్పు అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. ప్రజలకు పూర్తిస్థాయిలో ఆహారభద్రత కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించ తలపెట్టిన సన్న బియ్యం పథకం కార్యక్రమాన్ని శనివారం ఆయన పర్యవేక్షించారు.
పథకం ప్రారంభం అనంతరం హుజూర్ నగర్ లో భారీ బహిరంగ సభ విజయవంతానికి ఆయన కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేసి లీడర్, క్యాడర్ తో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరిస్తున్న శుభసందర్భంలో ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యేలా ఆయన కార్యాచరణను రూపొందించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా సన్నాహక సమావేశాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందన్నారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కలను సాకారం చేయబోతున్నామని ఆయన తెలిపారు.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. పేద ప్రజలకు ఆహారభద్రత కల్పించేందుకు ఇంతకు మించిన పథకం మరోటి ఉండబోదన్నారు ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల పది లక్షల మందికి ప్రయోజనం కలగ నున్నట్లు ఆయన వివరించారు.అంటే రాష్ట్ర జనాభాలో సుమారు 84 శాతం ప్రజలకు లబ్ది చేకూరనుందని ఆయన స్పష్టం చేశారు. అందుకు గాను ఖరీఫ్ సీజన్ లో 4.41 లక్షల మంది రైతుల నుంచి 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. పేద ప్రజలకు సన్నబియ్యం అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ నుంచి సన్నాలకు 500 రూపాయల బోనస్ తో ప్రోత్సాహొంచిందన్నారు.
తద్వారా రాష్ట్రంలో సన్నాల దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు.బోనస్ రూపంలో రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి 1,199 కోట్ల రూపాయలను బోనస్ రూపంలో రైతులకు చెల్లించినట్లు ఆయన తెలిపారు. దొడ్డు బియ్యం తినేందుకు ప్రజలు మొగ్గు చూపకపోవడంతో పాటు తిరిగి అమ్ముకోవడం వల్ల పక్కదారి పడుతున్నాయన్నారు. వీటన్నింటినీ అధ్యయనం చేసిన మీదటనే ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పధకానికి అంకురార్పణ చుట్టిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.73 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా 2.8 కోట్ల లబ్ధిదారులు నమోదయి ఉన్నారన్నారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అదనంగా మరో 30 లక్షల దరఖాస్తులు వొచ్చాయన్నారు.ఇందులో ప్రస్తుతం ఉన్న తెల్ల కార్డులలో చేర్పులకై దరఖాస్తు పెట్టుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరుకుంటుందన్నారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరు త్వరలోనే ఉంటుందని త్రివర్ణపు రంగులో తెల్ల రేషన్ కార్డులు ఏపిఎల్ వారికి గ్రీన్ కలర్ లో ఉంటాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాలను కేవలం బియ్యానికి మాత్రమే పరిమితం చేయకుండా ఇతర నిత్వావసర సరుకుల పంపిణీని కుడా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. చౌక ధరల దుకాణాల డీలర్లకు కమీషన్ కూడా పెంచి వారి ఉపాధికి ప్రభుత్వం ఇతోధికంగా చేయూత నందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.