కేసులను తప్పించుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు దిల్లీకి చక్కర్లు
బీఆర్ఎస్ వాళ్లు ఎవరికి వోటేస్తారో చెప్పాలి
మా పనితనం నచ్చకపోతే వోటేయకండి
కరీంనగర్ సభలో ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు
కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : తెలంగాణ ఆత్మగౌరవాన్ని బిఆర్ ఎస్ నేతలు దిల్లీలో మోదీ కాళ్ల దగ్గర పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శంచారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్, హరీశ్ రావు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్న మాట వాస్తవమా కాదా అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు దిల్లీకి చక్కర్లు కొడుతున్నారని అన్నారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మేము తెలంగాణ కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ మాపై కుట్రలు చేస్తున్నాయి. కేటీఆర్, హరీష్ దిల్లీకి ఎందుకు చక్కర్లు కొడుతున్నారు.
మోదీ కాళ్లు పట్టుకుంటున్నది నిజం కాదా? ఈ ఎన్నికల్లో మనం గెలవాల్సిందే.. కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ అంటోంది. పోటీలో లేని బీఆర్ఎస్ మమ్మల్ని ఓడించాలని అంటోంది. అంటే మరి ఎవరిని గెలిపించాలని చెబుతోంది. కవిత, కేటీఆర్, హరీష్ ఎవరికి వోటేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయట్లేదు. బీఆర్ఎస్ వాళ్లు ఎవరికి ఓట్లేస్తారో చెప్పాలి. కేసులనుంచి తప్పించుకునేందుకు మోదీ జపం చేస్తున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర పెట్టారు. బీఆర్ఎస్ కు డిపాజిట్ పోయిన చోట బీజేపీ గెలిచింది. వీళ్ల డిపాజిట్లు పోతే.. వాళ్లు గెలిచారు.. అంటే బీజేపీని గెలిపించింది ఎవరు..? క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహిస్తున్నాం. సిరాజ్, నిఖిత్ జరీన్ కు డీఎస్పీ జాబ్స్ ఇచ్చాం. విద్య, క్రీడలను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. మొదటి ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మా పనితనం నచ్చకపోతే వోటేయకండి. గతంలో మీకు ఒకటో తేదీన జీతాలు పడేవా. మా ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇవ్వట్లేదా. మీ మనసు మీద చేయి వేసుకుని వోటేయండి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఒకే రోజు మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఒకే రోజున మూడు జిల్లాల్లో పర్యటించారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో పీసీసీ ఈ సభలు ఏర్పాటు చేసింది. నిజామాబాద్, మంచిర్యాలలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం అనంతరం సీఎం రేవంత్ కరీంనగర్ చేరుకున్నారు. అక్కడ ప్రచార సభలో ప్రసంగించారు.
బీఆర్స్, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. . కరీనంగర్ లో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షులు, జిల్లాల మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజానరసింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.





