– రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణనాథుల నిమజ్జనాలు
– రేపటికి పూర్తయ్యేలా చర్యలు
– రాష్ట్రవ్యాప్తంగా గణేష్ పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోద్ణు
– డీజీపీ ఆనంద్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 25: రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, ఇప్పటివరకు జరిగిన నిమజ్జనాల వివరాలను వెల్లడించారు. గణేష్ పోర్టల్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1.24 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని చెప్పారు. గతేడాది 1.15 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని, ఈసారి సంఖ్య పెరిగిందని చెప్పారు. ప్రజా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు. అపార్టుమెంట్లు, ఇళ్లు, వ్యక్తిగత ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను కలిపితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.5 నుంచి 4 లక్షల వరకు ఉండే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని డీజీపీ తెలిపారు. ఇంకా మిగతా విగ్రహాలు శనివారం ఉదయానికి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు.
మతపరమైన అంశాలను గౌరవిస్తూ..
శుక్రవారం కావడంతో మతపరమైన అంశాలను గౌరవిస్తూ నగరంలో శోభాయాత్రలు మధ్యాహ్నం కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, దీంతో నిమజ్జనాలు కొంత ఆలస్యంగా కొనసాగుతున్నాయని డీజీపీ వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తున్నందున సమయం పడుతోందన్నారు. తెలంగాణ అంటే అన్ని మతాల ప్రజలు సమైక్యంగా, సోదరభావంతో జీవించే ప్రాంతమని డీజీపీ అన్నారు. భైంసాలో ముస్లిం సోదరులు హిందూ-ముస్లిం భాయ్‌భాయ్ అంటూ గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం, గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరగడం ప్రజల ఐక్యతకు నిదర్శనమన్నారు.
25 వేల మంది పైగా పోలీసులతో బందోబస్తు
హైదరాబాద్‌లో నిమజ్జనాల కోసం గత పది రోజులుగా సుమారు 25 వేల మందిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ సీపీ, జీహెచఎంసీ కమిషనర్, కలెక్టర్ తదితరులతో ఏరియల్ సర్వే ద్వారా కూడా పరిస్థితిని పరిశీలించినట్లు తెలిపారు. రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల పరిధి విస్తరించడంతో నిమజ్జన విగ్రహాల తరలింపునకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా టీజీఎస్‌పీ, ఆరఏఎఫ్, ఎన్‌డీఆరఎఫ్, ఆక్టోపస్ బలగాలను మోహరించినట్లు డీజీపీ తెలిపారు. డీజీపి రిజర్వ్ నుంచి ఐదు కంపెనీలను కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో భారీగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
13 మంది మృతి.. 26మందికి గాయాలు
గణేష్ ఉత్సవాల సందర్భంగా గత పది రోజుల్లో 13మంది మృతిచెందడం బాధాకరమని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. నిమజ్జన విధులకు హైదరాబాద్ వచ్చిన కొత్తగూడెం ఎస్సై వెంకన్న మృతి బాధాకరమన్నారు. సైబరాబాద్ పరిధిలోని పటాన్‌చెరులో ఆరుగురు మృతిచెందడం దురదృష్టకరమన్నారు. ఖైరతాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒకరు మృతిచెందగా నిర్మల్‌లో గుండెపోటుతో ఒకరు మృతిచెందినట్లు తెలిపారు. డీజే శబ్దాల కారణంగా కూడా కొందరు మృతిచెందినట్లు పేర్కొన్నారు. మొత్తం 26మంది ప్రమాదాల్లో గాయపడగా మల్కాజిగిరిలో 17మంది గాయపడినట్లు డీజీపీ తెలిపారు. ప్రజలు శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, నిబంధనలు పాటించాలని సూచించారు.
శనివారం ఉదయానికల్లా పూర్తి
నగరంలో మిగిలిన విగ్రహాల నిమజ్జన ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. శనివారం ఉదయం 10.30 గంటలలోపు పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లోనూ నిమజ్జనాలు దాదాపు పూర్తయ్యాయని, నల్గొండ, నిర్మల్ తదితర ప్రాంతాల్లో కొంత సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. ఉత్సవాల నిర్వహణను పోలీసులు ఆరు దశలుగా విభజించుకున్నారని డీజీపీ తెలిపారు. అందులో చివరి దశగా ప్రతి ఒక్కరూ నిమజ్జనం పూర్తిచేసుకుని సురక్షితంగా ఇంటికి చేరేవరకు పోలీసుల విధులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





