– యాసంగికి ముందే జల లభ్యతపై శాస్త్రీయ అంచనా
– నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
– వాటర్‌షెడ్‌ల వారీగా నీటి లెక్కలు తేల్చాలన్న ప్రొఫెసర్ వీరేంద్ర
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : ఎల్‌నినో ముప్పు నేపథ్యంలో రానున్న నెలల్లో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వెలికితీతను నియంత్రించడం, అందుబాటులో ఉన్న జలవనరులను సుస్థిరంగా వినియోగించుకోవడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలని తెలిపారు.
యాసంగికి ముందే నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే పంటలపై రైతులకు మార్గనిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నతాధికారులు, నిపుణులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భూగర్భ జలాల పరిస్థితిని సమీక్షించారు. భూగర్భ జలాల స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తామని, దాని ఆధారంగా అధికారులతో చర్చించి శాఖల సమన్వయంతో కార్యాచరణను రూపొందిస్తామని మంత్రి తెలిపారు.
వాటర్‌షెడ్‌ల వారీగా సాగునీటి లెక్కలు
భూగర్భ జలాల అంచనా కమిటీ (జీఈసీ) నమూనాను ఉపయోగించి వర్షపాత గణాంకాలను భూగర్భ జల నిల్వలతో పోల్చి తక్షణమే అంచనా వేయాలని సీఎస్‌ఐఆర్-నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణుడు, ఐఐటీ హైదరాబాద్ అనుబంధ ఆచార్యుడు ప్రొఫెసర్ వీరేంద్ర తివారీ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షలో పాల్గొన్నారు. ప్రాథమిక అంచనాను కొద్ది రోజుల్లోనే పూర్తి చేయవచ్చని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం నీటి వినియోగంలో 94 శాతానికి పైగా సాగుకే వెళ్తోందని, గృహావసరాలు, ఇతర వినియోగాల వాటా సుమారు 1.8 శాతమని తివారీ పేర్కొన్నారు. ప్రతి వాటర్‌షెడ్ (జల పరీవాహక ప్రాంతం) పరిధిలో భూగర్భ జలాల లభ్యత ఎంత, సాగుకు అవసరమైన నీరు ఎంత అనే వివరాలను పటాల రూపంలో పొందుపరచాలన్నారు. ఆ వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాలకు అనువైన పంటలను రైతులకు సూచించాలని చెప్పారు. తగినంత నీటి నిల్వలున్న ప్రాంతాల్లో వరి సాగుకు అవకాశం ఉంటుందని, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తివారీ సూచించారు. ఆయా పంటల సాగుతో ఎంత ఆదాయం పొందవచ్చో ప్రభుత్వం రైతులకు వివరించాలన్నారు.
పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ ప్రతిపాదన
టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి అది నేరుగా రాష్ట్ర నాయకత్వానికి నివేదించేలా చూడాలని తివారీ ప్రతిపాదించారు. వారానికో లేదా రెండు వారాలకోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలను సమన్వయం చేయాలన్నారు. వీటికి స్పందించిన మంత్రి ఉత్తమ్‌కుమార్ భూగర్భ జలాల శాఖను బలోపేతం చేయడంపై విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు. శాఖకు అవసరమైన మౌలిక వసతులు, నిధులు, సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించే అంశాలను పరిశీలిస్తామన్నారు. తక్కువ వర్షపాతం ఉండే ఇజ్రాయెల్ తదితర దేశాలు ప్రతి వానచుక్కను ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకుంటున్న తీరును ప్రస్తావించారు. రాష్ట్రంలోనూ ఆ విధానాన్ని అనుసరించాలన్నారు. వచ్చే వర్షాకాలం వరకు జల సంరక్షణను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉమ్మడి బాధ్యతగా తీసుకోవాలని మంత్రి అన్నారు. భవిష్యత్తులో వర్షపాతం తగ్గినా పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వర్షపు నీటి సేకరణ, సంరక్షణకు పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. సమీక్షలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, ఈఎన్‌సీ (జనరల్) ఓ.వి.రమేష్‌బాబు, సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాస్, భూగర్భ జలాల శాఖ డైరెక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





