పెన్షన్‌కు లంచం డిమాండ్

– ఎస్సీ అభివృద్ధి శాఖ సిబ్బంది ముగ్గురు సస్పెన్షన్
– బాధితురాలి ఫిర్యాదుతో విచారణ జరిపించిన కలెక్టర్ పవార్

సూర్యాపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: పదవీ విరమణ పొందిన తోటి ఉద్యోగిణి పింఛను ప్రతిపాదనలు పంపడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు లంచం డిమాండ్ చేసిన ముగ్గురు ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కొరడా ఝళిపించారు. ఈ మేరకు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్‌లను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు.షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభివృద్ధి శాఖలో విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగి గత మార్చి లో పదవీ విరమణ పొందారు. అయితే ఆమెకు రావాల్సిన పింఛను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తాలూకు ఫైలును (పెన్షన్ ప్రపోజల్) ఎప్పటికప్పుడు పై కార్యాలయానికి పంపించాల్సి ఉండగా గతంలో పనిచేసిన అధికారిణితో పాటు సంబంధిత విభాగ ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారు. ఆ శాఖకు చెందిన గతంలో పనిచేసిన సీనియర్ అధికారిణితోపాటు సీనియర్ అసిస్టెంట్ జి.రవివర్మ, జూనియర్ అసిస్టెంట్ బి.యాదగిరి, అటెండర్ బి.రాము బాధితురాలి నుంచి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేశారు.
అడిగిన మొత్తం ఇస్తేనే ఫైలుపై సంతకాలు చేసి ముందుకు పంపుతామని చెప్పడంతో ఆ మొత్తం ఇచ్చేందుకు బాధితురాలు నిరాకరించడంతో నెలలతరబడి ఫైల్ కదలకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వీసు ముగిసి నెలలు గడుస్తున్నా లంచం ఇవ్వలేదనే సాకుతో తన పెన్షన్ ఫైలును కదలకుండా అడ్డుకుంటున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

బాధితురాలి ఆవేదనపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులు జరిపిన విచారణలో ఉద్యోగులు లంచం డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, విధుల్లో తీవ్ర అలసత్వం, బాధ్యతారాహిత్యం ప్రదర్శించారని తెల్చారు. విచారణ నివేదిక ఆధారంగా సీనియర్ అసిస్టెంట్ రవివర్మ, జూనియర్ అసిస్టెంట్ యాదగిరి, అటెండర్ రాములను తక్షణమే సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు వెలువరించారు. దింతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అధికారిణి పై సైతం సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించినా, ప్రజలను లేదా విశ్రాంత ఉద్యోగులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ లంచాల కోసం వేధించినా ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *