బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాం

– సీఎం రేవంత్ రెడ్డి
– నెహ్రూ జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : నవభారత నిర్మాత, దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈనెల‌14న జరుపుకునే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని బాలబాలికలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలల పట్ల నెహ్రూకు ఉన్న అపారమైన ప్రేమ, వారి భవిష్యత్తుపై ఆయనకున్న దూరదృష్టి, విద్యాభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. బాలలే దేశ సంపద, వారే భావి భారత పౌరులనే నెహ్రూ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సమానావకాశాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. పిల్లల్లోని అంతర్లీన ప్రతిభను గుర్తించి వారి సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందన్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పోషకాహారం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు అల్పాహార పథకం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన బాల్యాన్ని అందించినప్పుడే బలమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని ఆకాంక్షించారు. పిల్లల కలలను సాకారం చేయడం, వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత కూడా అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *