రేపటినుంచే గిగ్ వర్కర్స్ చట్టం అమలు

– రాహుల్ గాంధీ చేతుల మీదుగా శ్రీకారం
– తెలంగాణ లెక్కల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ లేరు
– ఒకరు వినర్శించినంత మాత్రాన రాహుల్ గాంధీ ప్రతిష్ట తగ్గదు
– డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’
~అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ లు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : కేంద్ర ప్రభుత్వానికి గిగ్ వర్కర్లను ఆదుకునే ఆలోచన లేదని, కానీ రాష్ట్రంలో మాత్రం గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం చట్టాన్ని శ‌నివారం నుంచే అమలు చేయబోతున్నట్లు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ గిగ్ వర్కర్స్ పాలసీ అమలును లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఇక్క‌డ మీడియాతో మాట్లాడిన సీఎం ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పెట్టుబడులకు ఎంతగానో అనుకూలమని ప్రపంచానికి చాటడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే దిల్లీతోపాటు వివిధ ప్రాంతాల్లో కర్టెన్ రైజర్ కార్యక్రమాలు నిర్వహించామని, త్వరలో ముంబై, అహ్మదాబాద్‌లలోనూ వీటిని నిర్వహించనున్నట్లు చెప్పారు., రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఎదురవుతున్న రాజకీయ అడ్డంకులను కూలంకషంగా వివరించారు. ఈనెల 13, 14 తేదీల్లో జ‌రుగుతున్న భార‌త్‌ సమ్మిట్‌కు 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, వీరందరూ భవిష్యత్తులో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరాన్ని ప్రత్యక్షంగా చూసి పారిశ్రామిక విధానాలను తెలుసుకోవడం ద్వారా పెట్టుబడులు తరలివస్తాయన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీలలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

కేంద్ర మంత్రుల గైర్హాజరీపై మండిపాటు

దిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానించినప్పటికీ వారు హాజరుకాలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే ‘ఎల్ నినో’ పై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కూడా వారు రాలేదన్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు తెలంగాణ లెక్కల్లోనే లేరని భావిస్తున్నామని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీ విమర్శలకు కౌంటర్

భారత్ సమ్మిట్ ముగింపు సందేశాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారని సీఎం తెలిపారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి సదస్సులు నిర్వహిస్తే కరెక్ట్, అదే రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే తప్పు అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ రాకను వ్యతిరేకించడం సరికాదన్నారు. దిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వస్తే మీరు స్వాగతించారు.. కానీ భారత్ సమ్మిట్ కు రాహుల్ గాంధీ వస్తే విమర్శిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీని వ్యతిరేకిస్తే భారత దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదని, కాంగ్రెస్ పార్టీయే భారత దేశ ఆత్మ అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతోందని, రాజకీయాల కోసం ఆయన పర్యటనను అడ్డుకోవాలని చూడొద్దని హితవు పలికారు. బీజేపీని వ్యతిరేకిస్తే భారత దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదన్నారు. భారత్ సమ్మిట్ కు ఆహ్వానించిన కొంతమందికి మొదట అనుమతులు ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు నిరాకరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ భారత దేశం ఆత్మ అని, స్వాతంత్య్ర‌ పోరాటం నుంచి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉందని .గుర్తు చేశారు. ఒకరు వినర్శించినంత మాత్రాన రాహుల్ గాంధీ ప్రతిష్ట తగ్గదు..రాహుల్ గాంధీతొపాటు కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులలో ఉందని స్ప‌ష్టం చేశారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్

మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్.. ఇలా ప్రభుత్వం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా బీజేపీ, బీఆర్ఎస్‌లు కక్షగట్టినట్లు వ్యతిరేకిస్తున్నాయని సీఎం ఆరోపించారు. వీరు వ్యతిరేకించేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని, ప్రత్యక్షంగా రాష్ట్ర‌ ప్రజల ప్రయోజనాలనేన‌ని అన్నారు. కిషన్ రెడ్డి, రామ‌చందర్ రావు, కేటీఆర్ తదితరులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *