అక్టోబర్ 25 నుంచి ‘హ్యామ్’ రహదారుల పనులు

– గ్రామీణ తెలంగాణకు శాశ్వత మౌలిక వసతులే లక్ష్యం
– తొలి విడత రూ.6 వేల కోట్లతో 7,448 కి.మీ మేర రోడ్లు
– ఎల్‌నినో దృష్ఠ్యా తాగునీటికి తొలి ప్రాధాన్యం
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
– ఉమ్మడి వరంగల్, ఖమ్మం అధికారులతో సమీక్ష

హనుమకొండ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 25: గ్రామీణ తెలంగాణకు మెరుగైన, నాణ్యమైన రహదారి సౌకర్యాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ విధానంలో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులను అక్టోబర్ 25 నుంచి ప్రారంభించాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రాంతీయ అధికారులతోపాటు కాంట్రాక్టర్లతో మంత్రి శుక్రవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. హ్యామ్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో మొత్తం 18,472 కి.మీ మేర గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తొలి విడతలో మూడు వేల గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6 వేల కోట్లకు పైగా వ్యయంతో 7,448 కి.మీ (2,145 రహదారులు) మేర పనులు చేపట్టనున్నామన్నారు. వీటిని 17 సర్కిళ్లు, 17 ప్యాకేజీలుగా విభజించినట్లు చెప్పారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రూ. 1,130 కోట్లతో 1,366 కి.మీ మేర 445 రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఉన్న రోడ్ల అభివృద్ధితోపాటు 10 శాతం కొత్త రహదారులను నిర్మిస్తామన్నారు.

15 ఏళ్లపాటు నాణ్యతకు బాధ్యత

హ్యామ్ విధానం ద్వారా రహదారుల నాణ్యతకు, నిర్వహణకు పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ప్రాజెక్టు పూర్తయిన వెంటనే 40 శాతం నిధులు చెల్లించి మిగిలిన 60 శాతం నిధులను 15 ఏళ్ల పాటు విడతల వారీగా చెల్లిస్తామన్నారు. దీనివల్ల 15 ఏళ్ల పాటు రోడ్ల నిర్వహణ, నాణ్యత బాధ్యత పూర్తిగా కాంట్రాక్టర్లదే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అగ్రిమెంట్లు, సాంకేతిక ప్రక్రియ పూర్తయినందున అక్టోబర్ 25న కచ్చితంగా పనులు ప్రారంభం కావాలని దిశానిర్దేశం చేశారు.

తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రిజర్వాయర్లలోని నీటిని తాగునీటికే ప్రాధాన్యతనిస్తూ వాడుతున్నామని, మిషన్ భగీరథ పరిధిలోని 86 సమస్యాత్మక జనావాసాల్లో యుద్ధప్రాతిపదికన నీటి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో నీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ పనిచేస్తోందని తెలిపారు.

జలసిరి.. మహిళా సాధికారత

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు ‘ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి పొలానికి పంట కుంట.. ప్రతి ఊరికి ఊటకుంట’ లక్ష్యంగా జలసిరి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే రూ. 2 వేల కోట్ల వేతనాలు చెల్లించామని, అక్టోబర్ 2న జరిగే గ్రామ సభల్లో వచ్చే ఏడాది అభివృద్ధి ప్రణాళికలను ఆమోదించాలని అధికారులకు సూచించారు. మరోవైపు మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, స్వయం సహాయక సంఘాలకు రూ. 67 వేల కోట్ల రుణాలు అందించి 6 లక్షల మంది మహిళలు వ్యాపారాలు పెట్టుకునేలా ప్రోత్సహించామన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళల పేరుపైనే ఇస్తూ వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని ఆమె ఉద్ఘాటించారు. 

గ్రామ ఆస్తులు, అవసరాలను తెలిపే చిత్రపటాన్ని ప్రతి గ్రామంలో వేసి అవసరాలను గుర్తించాల‌న్నారు. హనుమకొండ కలెక్టరేట్లో వేసిన చింత నెక్కొండ గ్రామ పటాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. అవసరమైన నిధులు మంజూరు చేస్తాం.. గ్రామ అవసరాలను తీర్చే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల స్పెషల్ సీఎస్ దాన కిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ కలెక్టర్ సత్య శారద, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, ఈఎన్సీలు కృపాకర్ రెడ్డి, జగదీశ్వర్, కాంట్రాక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జబ్బుతో బాధపడుతున్న బాలికను కలిసిన మంత్రి   

స‌మావేశం అనంత‌రం అరుదైన జబ్బుతో బాధపడుతున్న హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన రిషితను మంత్రి సీతక్క ఆమె ఇంటికి వెళ్లి క‌లుసుకున్నారు. త‌నను కలుసుకోవాలన్న‌ రిషిత  కోరికను నెరవేర్చిన మంత్రి సీతక్క బాలిక బాగోగులు తెలుసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *