కుటుంబానికి బీమా .. తొలి రాష్ట్రం మ‌న‌దే

– ఈనెల 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రారంభం
– కుటుంబంలో ఉపాధి పొందే ఒక వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 13 : ‎‎రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పించడం ద్వారా దేశంలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్న తొలి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను దివంగ‌త ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19న ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో రాష్ట్రంలో అమలైన కొన్ని బీమా పథకాలు నిర్దిష్ట శాఖలు, కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. కుటుంబంలో ఉపాధి పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.‎ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నిజమైన సార్వత్రిక జీవిత బీమా పథకమని స్పష్టం చేశారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తిస్తుందని, ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు.‎ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయ‌న మాట్లాడుతూ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో ఏకకాలంలో, సంతృప్త స్థాయిలో లబ్ధిదారుల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.‎ ఈ పథకంలో ప్రత్యేకత కేవలం బీమా పరిధికే పరిమితం కాదని, కుటుంబాలకు అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నామని వివరించారు. ప్రతి కుటుంబంలో ఒకరు ఉపాధి పొందుతున్నట్లయితే ఆ వ్యక్తికి బీమా వర్తిస్తుందని, ఒక కుటుంబంలో పలువురు ఉపాధి పొందుతున్నట్లయితే వారిలో ఎవరికి బీమా కల్పించాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చని తెలిపారు. అలాగే ఒకరిని లేదా పలువురిని నామినీలుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని, బీమా మొత్తాన్ని నామినీలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలన్నది కూడా కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చని అన్నారు.‎ లబ్ధిదారుల నమోదు సమయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. బీమా పొందే వ్యక్తి పేరు, నామినీల వివరాలు సహా అన్ని వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, సంతకం తీసుకునే ముందు నమోదు చేసిన వివరాలను కుటుంబ సభ్యులకు చదివి వినిపించి, వారి అంగీకారాన్ని నిర్ధారించుకోవాలని ఆదేశించారు.‎ పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు 17, 18 తేదీల్లో గ్రామాల్లో టామ్‌టామ్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. నమోదు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలని, సామాజిక మాధ్యమాలతోపాటు అన్ని ప్రసార మాధ్యమాలను వినియోగించి పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *