దావోస్‌లో ‘తెలంగాణ రైజింగ్..’

తొలి ఒప్పందం సక్సెస్..!
స‌త్ఫ‌లితాలిస్తున్న  సీఎం రేవంత్ దావోస్ టూర్…
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌ద‌స్సుల్లో టీమ్‌..
యూనిలివర్ కంపెనీతో ఒప్పందాలు..
కామారెడ్డిలో పామాయిల్ త‌యారీ యూనిట్ కు అంగీకారం

దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రెండో రోజు వివిధ సదస్సులు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పాల్గొన్నారు.  స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 55వ వార్షిక సదస్సు మూడు రోజుల పాటు జరుగుతోంది. ఈసారి సమావేశాల్లో ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటిలిజెంట్ ఏజ్’ అనే థీమ్ ను వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎంచుకుంది. శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతోనే రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఆయా రంగాలు, పరిశ్రమలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేల మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఇటీవల అమల్లోకి వొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, పునరుత్పాదక  ఇంధనం, పంప్డ్ స్టోరేజీ విద్యుత్‌ ఉత్పత్తికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.  ఇంధన ఉత్పత్తితో పాటు హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ అభివృద్ధి, ఏఐ ఆధారిత ఐటీ సేవల విస్తరణ, అత్యాధునిక డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో దావోస్ లో రెండో రోజున పలు కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులు సమావేశమవనున్నారు.

అమెజాన్, యుని లివర్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సారధ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు జరుపనుంది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకోనుంది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ. 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రానికి ఈసారి భారీ పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి.

కార్పొరేట్‌ కంపెనీల‌తో చ‌ర్చ‌లు
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన మొదటి సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు ఎజిలిటీ సంస్థ చైర్మన్ తారెక్ సుల్తాన్ ను కలిశారు. ఎజిలిటీ సంస్థ ప్రపంచంలో పేరొందిన లాజిస్టిక్స్ కంపెనీల్లో ఒకటి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశంలో ఆయనతో పంచుకున్నారు. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో దిగ్గజ కంపెనీతో చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ అధికారులు యూనిలివర్ సీఈవో హీన్ షూమేకర్, ఆ కంపెనీ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను చర్చించారు.

యూనిలివ‌ర్ కంపెనీతో చ‌ర్చ‌లు విజ‌య‌వంతం
యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటైన యూనిలీవర్‌ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలివర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటుకు అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రెండో రోజు వరుసగా వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సాంబానోవా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూ లే తో చర్చలు జరిపారు. ప్రధానంగా తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.  కాలిఫోర్నియాకు చెందిన సాంబనోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. ఏఐ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అందించటంలో పేరొందిన సంస్థతో జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *