– ఐదు లక్షల మందికి ఉపాధి
– తొలి యేడాదిలోనే రూ.22174 కోట్ల పెట్టుబడులు
– ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో పర్యాటకరంగానికి కొత్త రూపు
– ఆదివాసీల కోసం రివర్స్ టూరిజం
– పర్యాటక శాఖ మంత్రి జూపల్లి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 26: తెలంగాణను దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ టూరిజం పాలసీ 2025–30 ద్వారా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించి, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణకు ఘనమైన చరిత్ర, వారసత్వం, ఆధ్యాత్మికత, సంస్కృతి, ప్రకృతి, వన్యప్రాణులు, వంటకాలు, ఆధునిక పట్టణ ఆకర్షణలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని వారసత్వ సంపద నుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం వరకు, వరంగల్, యాదాద్రి, భద్రాచలం, నాగార్జునసాగర్, సోమశిల, నల్లమల అడవులు, జలపాతాల వరకు రాష్ట్రంలో విభిన్న పర్యాటక అనుభవాలకు అవకాశాలున్నాయని వివరించారు. తెలంగాణ టూరిజం పాలసీ 2025–30 ద్వారా తొలుత రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశంతో ఇప్పుడు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టడం, 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకలో తెలంగాణను అగ్రశ్రేణి రాష్ట్రాల్లో నిలపడం లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. టూరిజం పాలసీ అమల్లోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రాష్ట్రానికి రూ.22,174 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. వాటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 ప్రధాన ఇతివృత్తమైన ‘డిజిటల్ ఎజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పర్యాటక రంగానికి పునఃరూపకల్పన’ తెలంగాణకు ఎంతో సముచితమని మంత్రి అన్నారు. తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌ను పునఃరూపకల్పన చేసి ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఆధునిక, సమగ్ర డిజిటల్ వేదికగా ఇది అందుబాటులో ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలను సందర్శించేందుకు వీలుగా హాప్–ఆన్, హాప్–ఆఫ్ పర్యాటక సేవలను కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
పర్యాటక రంగంలో సరికొత్త ప్రయోగంగా ‘రివర్స్ టూరిజం – ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ కు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. నగరవాసులు పల్లెలు, ప్రకృతి ప్రాంతాలకు వెళ్లడం మాత్రమే కాక అడవి బిడ్డలు సైతం ఆధునిక అభివృద్ధిని, చారిత్రక వైభవాన్ని ప్రత్యక్షంగా చూసేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు. పర్యాటక రంగంలో యువత, మహిళలు, కళాకారులు, గైడ్లు, ఆతిథ్య రంగ సిబ్బంది, రవాణా నిర్వాహకులు, స్థానిక పారిశ్రామికవేత్తలకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గ్రామీణ, పర్యావరణ, సమాజ ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక సమాజాలు అభివృద్ధిలో భాగస్వాములై, దాని ప్రయోజనాలను నేరుగా పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పర్యాటక అభివృద్ధి వారసత్వ సంపద, అడవులు, వన్యప్రాణులు, జలవనరులు, సహజ పర్యావరణ పరిరక్షణతో సమన్వయంగా సాగాలని అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న పర్యాటక నిపుణులు, పారిశ్రామికవేత్తలు, గైడ్లు, హోటల్ నిర్వాహకులు, టూర్ ఆపరేటర్లు, కళాకారులు, స్థానిక సమాజాలకు మంత్రి అభినందనలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





