ములుగు పర్యాటక అభివృద్ధికి రాష్ట్రస్థాయి గుర్తింపు

– కలెక్టర్ బోర్ఖడే హేమంత్ కు ఘన సత్కారం
– రామప్ప నుంచి మేడారం వరకు పర్యాటక ప్రగతిలో కృషికి ప్రశంసలు

ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి గుర్తింపు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ శిల్పారామం వేదికగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం వేడుకలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావులు జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి, ములుగు జిల్లా పర్యాటక ప్రగతికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ  ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయుల శిల్పకళా వైభవం రామప్ప దేవాలయం, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర, లక్నవరం సరస్సు- వేలాడే వంతెన, తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధి చెందిన బొగత జలపాతం, ప్రకృతి వనమూలికల నడుమ దట్టమైన గుట్టపై వెలసిన శ్రీ మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందన్నారు. కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో జిల్లా పర్యాటక రంగం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. ఈ గౌరవం జిల్లా అధికారుల సమష్టి కృషికి దక్కిన గుర్తింపని తెలిపారు. జిల్లాలోని చారిత్రక, ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించేలా నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *