– జనాభాకు అనుగుణంగా హక్కులు, అవకాశాలు,
– మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి
– సిరిసిల్లలో ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభ
సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ముదిరాజ సమాజ హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా గొంతు వినిపించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, యువజన సర్వీసులు, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముదిరాజ్ సమాజం కోసం, బీసీల హక్కుల కోసం గట్టిగా మాట్లాడే శక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే బలహీన వర్గాల సమస్యలపై పోరాడుతున్నానని తెలిపారు. పార్లమెంట్, శాసనసభల్లో బీసీల హక్కుల కోసం గళం వినిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
దేశవ్యాప్తంగా కుల గణన చేయాలి
దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి బీసీల జనాభాను అధికారికంగా వెల్లడించాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీల జనాభా తెలుసుకునేందుకు కులగణనకు మద్దతు ఇచ్చామని, అదే విధంగా దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. “జిత్నీ ఆబాది ఉత్నే ఇసేదారి” అనే సూత్రం ప్రకారం జనాభాకు అనుగుణంగా హక్కులు, అవకాశాలు, ప్రాతినిధ్యం ఉండాలనే డిమాండ్‌ను బలంగా వినిపించాలన్నారు. జనాభా లెక్కలు స్పష్టంగా తేలితేనే బీసీలకు ఎంత ప్రాతినిధ్యం, ఎంత వాటా, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరమో సమర్థంగా చెప్పగలమన్నారు.
వృత్తి కులాలకు 50 ఏళ్లకే పెన్షన్
నేతన్నలు, గీత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ అందుతున్న విధంగానే ఇతర వృత్తి కులాలకు కూడా 50 ఏళ్లకే పెన్షన్ అందించే అంశంపై కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. యాదవులు, మత్స్యకారులు, రజకులు, నాయీబ్రాహ్మణులు, ముదిరాజులు తదితర వృత్తి ఆధారిత కులాల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఈ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ముదిరాజ్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు
ముదిరాజ్ కుల ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నామని, ముదిరాజ్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కుల సంఘాల భవనాల నిర్మాణానికి సహకారం అందించాలని అన్నారు.
కుల భవనాలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే విద్యార్థులకు వసతి, చదువు, పోటీ పరీక్షల సన్నద్ధతకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. భవిష్యత్ తరాలకు విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షల మార్గదర్శక కేంద్రాలుగా కుల భవనాలు మారాలని ఆకాంక్షించారు.
బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలి
కులాల మధ్య విభేదాలకు తావులేకుండా పరస్పరం సమస్యలను పరిష్కరించుకుంటూ బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పొన్నం ప్రభాకర్ కోరారు. సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం అండగా ఉండాలని, వృత్తులు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవడంతో పాటు వాటిపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముదిరాజ్, బీసీ సమాజ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు మంత్రి వాకిటి శ్రీహరి, శాసన మండలి చైర్మన్ బండా ప్రకాశ్ తదితర నాయకులతో కలిసి ముఖ్యమంత్రిని త్వరలో కలవనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాసన మండలి చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ముదిరాజ్ సంఘాల నాయకులు, పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




