పరిశోధన నిధులపై కిట్స్‌ లో సాంకేతిక సెమినార్

· అవకాశాలు.. వ్యూహాలపై అధ్యాపకులకు అవగాహన

· పరిశోధనకు ప్రణాళిక, ముందుచూపు, పట్టుదల అవసరం

·  హాజరైన 250 మందికి పైగా అధ్యాపకులు

వరంగల్‌,ప్రజాతంత్ర, అక్టోబర్ 01: పరిశోధన ప్రాజెక్టులకు నిధులు పొందేందుకు అనుసరించాల్సిన విధానాలు, అందుబాటులో ఉన్న అవకాశాలు, సమర్థవంతమైన వ్యూహాలపై కిట్స్‌ వరంగల్‌లో సాంకేతిక సెమినార్‌ నిర్వహించారు. కిట్స్‌ వరంగల్‌ డీన్‌–రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం క్యాంపస్‌లోని సిల్వర్‌ జూబ్లీ సెమినార్‌ హాల్‌లో ‘పరిశోధన నిధులను పొందడం.. అవకాశాలు మరియు వ్యూహాలు’ అనే అంశంపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఐటీ వరంగల్‌తో కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా అధ్యాపకుల పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించడం, పరిశోధన ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా సెమినార్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్ఐటీ వరంగల్‌ డీన్‌–అంతర్జాతీయ సంబంధాలు, పూర్వ విద్యార్థుల వ్యవహారాల విభాగం, ఏఐసీటీఈ విశిష్ట వృత్తి నిపుణుడు, ఈసీఈ విభాగం హెచ్‌ఏజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి. కిషోర్‌ కుమార్‌ పరిశోధన ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. జాతీయ సంస్థాగత ర్యాంకింగ్‌ చట్రంలోని బోధన–అభ్యసనం, పరిశోధన–ఆచరణ, పట్టభద్రుల ఫలితాలు, విస్తరణ కార్యక్రమాలు అనే నాలుగు ప్రధాన అంశాలను వివరించారు. పరిశోధన అనేది ప్రణాళిక, ముందుచూపు, నిబద్ధత, పట్టుదలతో కూడిన నిరంతర ప్రక్రియ అని డాక్టర్‌ కిషోర్‌ కుమార్‌ అన్నారు. పరిశోధన నిధులు పొందేందుకు ప్రస్తుత పరిశోధన ధోరణులు, సాంకేతిక పురోగతిపై అవగాహనతో పాటు అంతర్‌ విభాగ సహకారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్ఐటీ వరంగల్‌తో కిట్స్‌ వరంగల్‌ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా వృత్తిపరమైన అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. సాంకేతిక రంగంలో ఉన్నతమైన వృత్తిని కొనసాగించేందుకు సరైన దృక్పథం, నిరంతర అభ్యాసం అవసరమని పేర్కొన్నారు.

కార్యక్రమానికి కిట్స్‌ వరంగల్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె. అశోక్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. అధ్యాపకులు, విద్యార్థుల్లో విద్యా, పరిశోధనా సామర్థ్యాలను పెంపొందించేందుకు నిరంతర అభ్యాసం, పరిశోధనా సహకారం, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మారడం ఎంతో ముఖ్యమని అన్నారు. వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపే ప్రాజెక్టులను రూపొందించడంతో పాటు సంస్థలో పరిశోధనా సంస్కృతిని పెంపొందించేందుకు ఈ సెమినార్‌ దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈసీఈ విభాగం ప్రొఫెసర్‌, ఆర్‌అండ్‌డీ డీన్‌ ప్రొఫెసర్‌ బి. రమాదేవి, ఆర్‌అండ్‌డీ విభాగం ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ బి. జీవన్‌, ఆంగ్ల విభాగం సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డబ్ల్యూ. గ్రేస్‌ శాంతి, కెమిస్ట్రీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, పీఆర్వో డాక్టర్‌ డి. ప్రభాకరాచారి, సీనియర్‌ ప్రొఫెసర్లు, వివిధ విభాగాల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. మొత్తం 250 మందికి పైగా అధ్యాపకులు ఈ సాంకేతిక సెమినార్‌లో చురుకుగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *