తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే

· వృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు

· ఆస్తుల విషయంలో వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి

· డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పూజిత, డాక్టర్‌ అనితారెడ్డి

హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 01: తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత పిల్లలదేనని, వృద్ధులను నిర్లక్ష్యం చేయడం, వేధింపులకు గురిచేయడం చట్టరీత్యా నేరమని డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి నేరెళ్ల వెంకట హైమ పూజిత, సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ కోర్టు సభ్యురాలు, అనురాగ్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ అనితారెడ్డి అన్నారు. వృద్ధులకు ఏవైనా సమస్యలు ఎదురైతే న్యాయ సహాయం కోసం డీఎల్‌ఎస్‌ఏ లేదా సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని సూచించారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం కేయూ సమీపంలోని వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ, రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి నేరెళ్ల వెంకట హైమ పూజిత, సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ కోర్టు సభ్యురాలు డాక్టర్‌ అనితారెడ్డి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులను ఆత్మీయంగా పలకరించారు.

అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వృద్ధుల పోషణ, రక్షణ చట్టం, ట్రిబ్యునల్‌ బెంచ్‌ ద్వారా అందే న్యాయ సహాయంపై వివరించారు. వృద్ధులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా, పిల్లలు లేదా ఇతరుల నుంచి వేధింపులకు గురైనా డీఎల్‌ఎస్‌ఏ లేదా ట్రిబ్యునల్‌ను సంప్రదించాలని సూచించారు. వృద్ధులను వేధించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.వృద్ధాప్యంలో తమ అవసరాలకు ఆస్తిని ఉంచుకోవాలని, పిల్లలకు మొత్తం ఆస్తిని ముందుగానే బదలాయించవద్దని సూచించారు. అనంతరం తమ ఆస్తి ఎవరికి చెందాలనే విషయాన్ని వీలునామా ద్వారా స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. తల్లిదండ్రుల బాధ్యత తీసుకోని పిల్లలకు వారి ఆస్తి, అధికారాలపై హక్కు ఉండదని పేర్కొన్నారు. వృద్ధులను గౌరవించడం, ప్రేమించడం మన సంస్కారానికి నిదర్శనమన్నారు. తల్లిదండ్రులను ప్రేమించకుండా, వారిని ఇబ్బందులకు గురిచేసే వారు ఎంతటి సంపన్నులైనా విలువైన మానవ సంబంధాలను కోల్పోయినట్టేనని పేర్కొన్నారు. వృద్ధాప్యం ఎవరికీ శాపంగా మారకూడదని, ప్రతి వృద్ధుడికి గౌరవప్రదమైన జీవితం అందేలా కుటుంబ సభ్యులు, సమాజం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రవి, సంస్థ నిర్వాహకులు నాగరాణి, నరేష్‌, శ్రీకాంత్‌, మమతతో పాటు పలువురు వృద్ధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *