సంతోషం గెలుచుకోవడం ఎలా? -డా. జె. రవీంద్రనాథ్

బెర్ట్రాండ్ రస్సెల్ (1872-1970) ఆధునిక, హేతుబద్ధ ఆలోచనకు విఖ్యాతి గన్న బ్రిటీష్ గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త, సామాజిక విమర్శకుడు, శాంతి ఉద్యమనేత. 1952లో నోబెల్ బహుమతి పొందిన ఆయన  రచనల్లో “ప్రిన్సిపియా మాథెమాటికా”, “ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీ”, “మ్యారేజ్ అండ్ మోరల్స్”, “ప్రిన్సిపుల్స్ ఆఫ్ సోషల్ రికన్స్ట్రక్షన్”, “ది హిస్టరీ ఆఫ్ వెస్ట్రన్ ఫిలాసఫీ”, “పవర్”, “అథారిటీ అండ్ ఇండివిడ్యుయల్”, “రోడ్స్ టు ఫ్రీడమ్” తదితర గ్రంథాలున్నాయి. బెర్ట్రాండ్ రస్సెల్ “సంతోష స్వాధీనం” (The Conquest of Happiness) గురించి రాసిన ఈ పుస్తకం సామాన్యులకు, మేధావులకు రెండు తరగతుల వారికి తగు సలహా, ఆచరణలో ఉపయోగపడే క్లాసిక్. ఈ పుస్తకం రచనాశైలి అందమైనది మాత్రమే కాక విశాలమైన మది అలవర్చుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ పుస్తకంలో మొదటిభాగంలో సంతోషలేమి కారణాలు, రెండోభాగంలో సంతోష కారకాలు ఉన్నాయి. మనుష్యులలో సంతోషలేమికి హేతువుల్లో- బైరానిక్ అసంతృప్తి, పోటీ, అలసట, అసూయ, పాపభావన, ఆత్మపీడన భావం, ప్రజాభిప్రాయం అంటే భీతి ఉన్నాయి.

సంతోషం సాధించాలంటే మనిషికి ఉత్సాహం, ప్రేమ, కుటుంబం, పని, వస్తుగత ఆసక్తులు, ప్రయత్నం – వదిలి వేయటం అవసరం. బైరానిక్ అసంతృప్తి (ఉద్వేగ భరిత చర్యలకు తహతహపడటం) అనేది ఒక మార్మిక విషయం. ఇది పోవాలంటే మనుషులు తమకు లోతుల్లోని కోరికలు తీర్చుకోవాలి. తాము ఉద్వేగ భరితంగా చేయాలనుకునేది చేయగలగాలి. రచయితలు ఇక తాము రాయలేకుండా ఉండలేము అని భావించినప్పుడు మాత్రమే రాయాలి. పోటీని సద్గుణంగా, విజయాన్ని లక్ష్యంగా చూసి ఇతర విషయాలు వదిలేస్తే విజయం సాధించిన తర్వాత విసుగు కలుగుతుంది. అతిపోటీ అనేది పని, విరామాల్ని రెండింటిని విషమయం చేస్తుంది. అలసట ఎన్నో కారణాలు ఉన్నా నిరంతరం ఆందోళన, అనిశ్చితత్వం వల్ల అది కలుగుతుంది. మన చర్యలు, విజయాలు, పరాజయాలు మనం అనుకున్నంత ముఖ్యమైనవి కావు. చేతన అచేతనలోని భయాల వల్ల నరాల అలసట సంభవిస్తుంది. మరింత ధైర్యం పెంచుకోవడం మూలాన అలసటను పోగొట్టుకోవచ్చు.

అసూయను మానసిక క్రమశిక్షణ, ఇతర విజేతలతో పోల్చుకోకుండా ఉండటం ద్వారా తప్పించుకోవచ్చు స్వేచ్ఛకు నాగరిక మానవుడు తన హృదయాన్ని, మదిని విశాలం చేసుకొని ‘సొంత’ భావన దాటి విశ్వజనీన స్వేచ్ఛను పొందవచ్చు. పాపభావన పోవడానికి అపరాధభావన నుంచి స్వేచ్ఛనిచ్చే హేతుబద్ధతను అలవరుచుకోవాలి. ఆత్మపీడన భావం  పోయేందుకు  కారణాలుగా  వస్తుగత దృక్పథం లేకుండా ఉండటం, తన బలాలపై అతి అంచనా, ఇతరులు తనపట్ల ఎక్కువ ఆసక్తి చూపారని భావించటం, తన్ను   వేధించాలని చూస్తున్నారనుకోవడం. దీనికి విరుగుడు భ్రాంతి వదిలి నిజాన్ని చూసి అంగీకరించే జీవితాన్ని కొనసాగించడమే. ప్రజాభిప్రాయం పట్ల భయం పోవాలంటే తనలాంటి ఆలోచన ఉన్నవారితో కలవడం, స్వీయ, లోతైన సహజతాలను అనుసరించడం చేయవచ్చు.

ఇక సంతోష కారకాలను గురించి ఆలోచిస్తే మనుషులకు ఉండే సహజమైన జీవనోల్లాసం కొన్ని దురదృష్ట ఘటనలు, స్వేచ్ఛపై ఆంక్షలు, ‘గౌరవం’ పట్ల తప్పుడు అభిప్రాయం వల్ల దెబ్బతింటుంది. ఉత్సాహం అదనపు శక్తి పైన, మానసిక యంత్ర పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ప్రేమ- భద్రతను, స్వీయ జైలునుంచి విముక్తిని ఇస్తుంది. అది పరస్పర ఆధారితం. వ్యతిరేక జెండర్ తో ఆత్మీయత లేకపోవడం వల్ల ఉత్సాహం నశించి అంతర్ముఖత్వం పెరుగుతుంది. బాల్యంలో తక్కువగా తల్లిదండ్రుల ప్రేమ లభించినట్లయితే ఆలోచన, తత్వం, మతశాస్త్రం బాట తీసుకుంటారు. పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రేమ కుటుంబానికి మూలాధారం. స్నేహితులు మనగుణాలను, ప్రేమికులు మన ఆకర్షణలను ఇష్టపడతారు. కానీ కష్టాల్లో తల్లితండ్రులు మనతో నిలుస్తారు. తల్లిదండ్రులు తమ ఆనందం పిల్లల విషయంలో రక్షణ- నిరంకుశత్వాల మధ్య కోల్పోవడం జరుగుతుంది. మాతృత్వం అనేది ఇతర ఆసక్తుల నుంచి జీవితాన్ని దూరం చేయరాదు.

పని, మితంగా ఉంటే అది ఖాళీగా ఉండటం కన్నా మిన్నగా ఉండి సెలవుల్ని ఆనందిస్తాం. పనిచేయటం ఒక స్థిర లక్ష్యాన్ని, సృజనాత్మకమైన నైపుణ్యం సంతోషాన్ని ఇస్తాయి. నిర్మాణాత్మక, సమగ్ర దృక్పథం ఉన్నవారు మిగిలినవారి కన్నా సంతోషంగా ఉంటారు. వస్తుగత ఆసక్తులు కూడా ఆనందాన్ని ఇస్తాయి. ప్రపంచం గురించి, వ్యక్తిగతం గురించి వాస్తవిక ఆలోచన ఉండాలి. మంచి లక్ష్యం వైపు చేసే చిన్న పని అయినా ఎక్కువ ఆనందం ఇస్తుంది ప్రయత్నం, వదిలివేయటం మధ్య సమతూకం, వ్యక్తి- సమాజాల మధ్య సమన్వయం అవసరం. బెర్ట్రాండ్ రస్సెల్ పుస్తకం మొదట్లోనే అసంతృప్తి లేదా సంతోష లేమి అనేది ప్రపంచం పట్ల తప్పుడు దృక్పథం, తప్పుడు నీతి, అలవాట్లు వల్ల కలిగి సంతోషానికి మూలమైన జీవన ఉల్లాసాన్ని నాశనం చేస్తుంది అని రాశాడు. అయితే ఈ “సంతోష స్వాధీనం”లో సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో అవసరమైన మౌలిక మార్పులు, విలువలు, హక్కులు మొదలగువాటి ప్రభావం గురించి లేకపోవటం ఒక లోటు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *