– కర్ణాటక ప్రభుత్వంతో కీలక భేటీ
హైదరాబాద్/బెంగళూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాలో ఏర్పడిన తీవ్ర సాగు, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న కర్ణాటక జలాశయాల నుంచి దశలవారీగా నీటిని విడుదల చేయాలని కోరేందుకు మంత్రుల నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి బృందం బెంగళూరుకు పయనమైంది. పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పర్యాటక & ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుల నేతృత్వంలోని ఈ బృందంలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి భాగస్వాములయ్యారు. ఈ బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌తో భేటీ అయి పాలమూరు జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వివరించనుంది. ఈ పర్యటనకు ముందే ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా కర్ణాటక సీఎంతో ఫోన్‌లో మాట్లాడి ప్రాథమిక చర్చలు జరిపారు. అనంతరం క్షేత్రస్థాయి పరిస్థితులను కర్ణాటక ప్రభుత్వానికి సమగ్రంగా వివరించి, ఒప్పించేందుకు ఈ మంత్రివర్గ బృందాన్ని బెంగళూరుకు పంపారు.
ఎండిపోతున్న పంటల పరిరక్షణే లక్ష్యం
వర్షభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం వల్ల పాలమూరు ప్రాంతంలో పంటలు ఎండిపోయే స్థితికి చేరాయి. జూరాల ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని సాధించడం ద్వారా అక్కడ నిల్వ ఉన్న పంటలను కాపాడటంతోపాటు భవిష్యత్తు తాగునీటి అవసరాలను తీర్చడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. రైతుల ప్రయోజనాలను కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత. తాగు, సాగునీటి అవసరాలను బేరీజు వేసుకుని కర్ణాటక ప్రభుత్వంతో గట్టిగా సంప్రదింపులు జరిపి జూరాలాకు నీటిని సాధిస్తాం అని ఈ బృందం అంతకుముందు విలేకరుల సమావేశంలో స్పష్టం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





