మిడిల్ ఈస్ట్ మంటల్లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ

“హూతీలతో అమెరికా రహస్యం ఒప్పందం చేసుకుని, రెడ్ సీ లో తమ నౌకలను కాపాడుకుంటుందనే వార్తల నేపథ్యంలో తమకు సాయం చేయాలన్న సౌదీ విన్నపాన్ని అమెరికా తోసిపుచ్చడం లో ఆశ్చర్యం లేదు. ఇదే సందర్భంలో టర్కీ,పాక్,సౌదీ మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం నీరుగారింది.ఈ నేపథ్యంలో సౌదీ పాలకులు ఇజ్రాయిల్ సాయం కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. హూతీల దాడితో ముదిరిన మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రపంచాన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో పడేసింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత్ లో కూడా చమురు సంక్షోభం తీవ్రతరం కావడం తథ్యం..”
sunkavalli sathibabu
-సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్)
మొ:9704903463.

అగ్ర దేశాధీశుడననే ట్రంప్ అహం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నది. మధ్య ప్రాచ్యం లో రావణకాష్టం మరింతగా రగులుతున్నది.

పగ,ప్రతీకారాలు, అసూయాద్వేషాలు, అధికార మదం, ఆధిపత్య , అహంకార భావాలు ఎంతటి వినాశనానికి దారితీస్తాయో పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతలను చూస్తే అవగతమవుతుంది. దీనికి మూల కారణం ట్రంప్. మధ్య ప్రాచ్యం లో యుద్ధం అనేక మలుపులు తిరుగుతూ చివరకు ఏం జరుగుతుందో అర్ధం కాని సంకటస్థితి లోకి నెట్టబడింది.సౌదీ రాజధాని రియాద్ ను యెమన్ కు చెందిన హూతీలు లక్ష్యంగా చేసుకోవడం, క్షిపణి దాడులకు తెగబడడానికి యత్నించడం మక్కా,మదీనా లపై తమ దృష్టిని గురిపెట్టడం ద్వారా ప్రపంచాన్ని పూర్తిగా భయం గుప్పెట్లోకి తీసుకు పోయారు. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసి పడుతున్నాయి.ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా అమెరికా- ఇరాన్ ల మధ్య యుద్ధం సౌదీ అరేబియా -హూతీల మధ్య యుద్ధంగా రూపాంతరం చెందింది.
యెమన్ లోని ఇరాన్ అనుకూల హూతీలు సౌదీ లోని చమురు సదుపాయాలను విధ్వంసం చేయడమే కాకుండా ఎర్ర సముద్రం లోని బాబ్ ఎల్ మండేబ్ జలసంధి ని స్వాధీనం చేసుకుని సౌదీ వాణిజ్య నౌకలను దిగ్భంధనం చేసి, అంతర్జాతీయ చమురు రంగాన్ని తీవ్రమైన సంక్షోభం లోకి నెట్టారు. హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా బాబ్ ఎల్- మండేబ్ ను వినియోగిస్తున్నది.యెమన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న సౌదీ అరేబియాను హూతీలు లక్ష్యంగా చేసుకున్నారు. మొఖా ఓడ రేవును, కొన్ని కీలకమైన ద్వీపాలను హౌతీలు ఆక్రమించుకున్నారు. ఇప్పటికే సౌదీ లోని ఈస్ట్- వెస్ట్ క్రూడాయిల్ పైప్ లైన్ పై హౌతీలు డ్రోన్ దాడులు చేసి తీవ్రంగా నష్టపరిచారు.బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని హూతీలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో భారత్ కూడా ఇబ్బందుల్లో పడింది. పలు ఆసియా,ఐరోపా దేశాల చమురు సరఫరా నిలిచిపోయింది. హిందూ మహాసముద్రం నుండి ఎర్ర సముద్రానికి గల ఏకైక కీలక సముద్ర మార్గం “గేట్ ఆఫ్ టియర్స్” గా పిలవబడే 32 కిలోమీటర్ల వెడల్పు గల అంతర్జాతీయ రవాణా మార్గం “స్ట్రయిట్ ఆఫ్ బాబ్ ఎల్ మండేబ్”. ఈ మార్గం మూతబడితే ప్రత్యామ్నాయ మార్గం మరింత వ్యయప్రయాసలతో దురాభారంతో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది.
భారత్ కు సౌదీ నుండి పక్షం రోజులకు రావలసిన ఇంధన నౌకలు సౌత్ ఆఫ్రికా లోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి రావడానికి రెట్టింపు సమయం పడుతుంది. ఒక వైపు హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు, మరో వైపు ఎర్ర సముద్రం పై హూతీల ఆధిపత్యం,మొఖా పోర్టు స్వాధీనం వెరసి భారత్ లో చమురు సంక్షోభం ముదిరేలా చేసింది.హార్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధనానికి ఆయువు పట్టు కాగా,ఇప్పుడు రెడ్ సీ పై హౌతీలు పట్టు సాధించడం మరో ముప్పుగా పరిణమించింది. అమెరికా నుండి కొనుగోలు చేసిన యుద్ధ విమానాన్ని కూల్చిన హూతీలు ఎర్ర సముద్రం, సూయజ్ కెనాల్ పై ఆధిపత్యం సాధించారు. హూతీలు ఇరాన్ కు బలంగా మారారు. మక్కా కూడా ప్రమాదంలో పడింది. ఇటీవల హూతీల దాడుల దృష్ట్యా సౌదీ ఆత్మరక్షణ లో పడింది. భౌగోళిక పరిస్థితులు, గెరిల్లా తరహా వ్యూహాలు హూతీలకు ఆయుధంగా మారడం విశేషం.సౌదీ అరేబియా భద్రత సంక్షోభంలో పడింది. అమెరికా అండ చూసుకుని తిరుగు లేదనుకున్న సౌదీ భయకంపితమైనది. రియాద్ భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా, చమురు మౌలిక సదుపాయాలపై దాడులు,ఎర్ర సముద్రంలో నావల దిగ్భంధనం వలన సౌదీ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది.
అరామ్ కో “ఈస్ట్- వెస్ట్ ఆయిల్ పైప్ లైన్” మూసి వేయడంతో ప్రపంచం మరింత చమురు సంక్షోభం లోకి నెట్టబడింది.
ఈ పరిస్థితుల్లో తమకు ఆధునాతన ఆయుధాలు కావాలని అమెరికాను సౌదీ అభ్యర్ధించినా ఫలితం లేకపోయింది. యెమన్ లోని హౌతీలు అమెరికా మేడ్ సౌదీ ఎఫ్ -15 ను కూల్చడంతో అమెరికా కూడా హూతీల జోలికి పోవడం లేదు.హూతీలతో అమెరికా రహస్యం ఒప్పందం చేసుకుని, రెడ్ సీ లో తమ నౌకలను కాపాడుకుంటుందనే వార్తల నేపథ్యంలో తమకు సాయం చేయాలన్న సౌదీ విన్నపాన్ని అమెరికా తోసిపుచ్చడం లో ఆశ్చర్యం లేదు. ఇదే సందర్భంలో టర్కీ,పాక్,సౌదీ మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం నీరుగారింది.ఈ నేపథ్యంలో సౌదీ పాలకులు ఇజ్రాయిల్ సాయం కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. హూతీల దాడితో ముదిరిన మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రపంచాన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో పడేసింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత్ లో కూడా చమురు సంక్షోభం తీవ్రతరం కావడం తథ్యం. విదేశీ ఇంధనంపై ఆధారపడ్డ పాక్ లో పరిస్థితులు చేజారిపోతున్నాయి. ప్రజలపైన,వ్యాపారాల పైన పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.పెళ్లిళ్ళలో ఒకే వంటకానికి పరిమితం చేసింది. వాహనాల కొనుగోలు ,ప్రయాణాల తగ్గింపు పై ఆంక్షలు విధించారు. పాక్ లో పెట్రోలు ధర సుమారు 400 రూ. లకు చేరింది.
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో కొనసాగుతుండగా, రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ భీకర దాడులు చేసి విధ్వంసం చేయడంతో చమురు సరఫరా సంక్షోభంలో పడింది. ఇదే సందర్భంలో రష్యా నుండి చమురు కొంటున్న భారత్,చైనా లపై అమెరికా 100 శాతం టారిఫ్ విధించడం పైశాచిక చర్యగా భావించక తప్పదు. అమెరికా చట్టసభలు ట్రంప్ చేతికి టారిఫ్ ల కొరడా అందించడం అనుచితం. రష్యా విషయంలో ఇతర దేశాలపై ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ అమెరికా పవర్ గ్రిడ్ల కోసం రష్యా నుండి యురేనియం కొనుగోలు చేయడం ద్వంద్వ నీతి కాదా?ట్రంప్ చేతిలో అధికారం ప్రపంచ దేశాల చావుకొచ్చింది. ఇజ్రాయిల్ సలహాతో ఇరాన్ పై అకారణ యుద్ధానికి పూనుకొన్న ట్రంప్ ప్రపంచ దేశాల ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నారు. కొన్ని దేశాల ప్రజలు విద్యుత్ కొరతతో, ఆహార కొరతతో అలమటిస్తున్నారు. ఎంత కాలం యుద్ధాలు కొనసాగిస్తారు? ఎంతకాలం ప్రజలను ఇబ్బంది పెడతారు? ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు అమెరికాను నిలువరించలేవా? ఇరాన్ తో శాంతి ఒప్పందానికి అంగీకరింప చేయడంలో ప్రపంచ దేశాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ఎంత కాలం అమెరికాకు దాసోహం చేస్తారు? ప్రజాభీష్టానికి విరుద్ధంగా సాగుతున్న యుద్ధాలు మానవ మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *