“తెలంగాణకు మూడో ప్రత్యామ్నాయం అవసరమా అన్నది రాజకీయ చర్చ. అయితే ఆ ప్రత్యామ్నాయానికి విశ్వసనీయతను ఇచ్చేది గతంలోని పోరాట చరిత్ర కాదు; వర్తమానంలో ప్రజలతో ఉన్న సంబంధం. మాజీ విప్లవకారులు తమ గతాన్ని ఎలా సమీక్షించుకుంటారు? కమ్యూనిస్టు పార్టీలు తమ పాత పరిమితులను ఎలా అధిగమిస్తాయి? యువత, రైతులు, నిరుద్యోగులు, అట్టడుగు వర్గాలకు వారు ఏ కొత్త రాజకీయ దిశను చూపుతారు? ఈ ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలే వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి..”

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మావోయిస్టులు, లొంగిపోయిన నక్సలైట్లు, వివిధ కమ్యూనిస్టు పార్టీల కూటమి కలిసి ప్రజలకు మూడో ప్రత్యామ్నాయం అందించగలరా? ప్రస్తుత పరిస్థితుల్లో వీరు పార్లమెంటరీ రాజకీయాల ద్వారా ప్రజలకు కొత్త రాజకీయ దిశను చూపగలరా? వీరు ప్రతిపాదించే ప్రత్యామ్నాయం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక, సామాజిక న్యాయ తెలంగాణను ఆచరణలోకి తీసుకురాగలదా? ఇవి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సాధారణ ప్రశ్నలు కావు. ఒకప్పుడు తుపాకీని రాజకీయ సాధనంగా ఎంచుకున్న శక్తులు ఇప్పుడు బ్యాలెట్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో, వాటి ముందు నిలిచిన అసలు పరీక్షలివే.
తెలంగాణలో దశాబ్దాలపాటు సాయుధ పోరాటానికి ప్రతీకగా నిలిచిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు దాదాపు అంతర్ధానమైంది. 2024 నుంచి 2026 మధ్య 760 మందికి పైగా మావోయిస్టు కార్యకర్తలు ఆయుధాలు విడిచి జనజీవనంలోకి వచ్చారు. వారిలో పొలిట్‌బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకత్వంలోని పలువురు ఉన్నారు. 2026 ఏప్రిల్ నాటికి తెలంగాణలో క్రియాశీల సాయుధ మావోయిస్టు దళాలు లేవని రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది. ఉత్తర తెలంగాణను దండకారణ్యంతో అనుసంధానించిన ఒకప్పుడు బలమైన సాయుధ నెట్‌వర్క్ ఇప్పుడు దాదాపు చరిత్రగా మిగిలింది.
కానీ ఇక్కడే మరో కీలకమైన మలుపు మొదలవుతోంది. ఆయుధాలను వదిలేయడం అంటే సిద్ధాంతాన్ని కూడా వదిలేయడమేనా? మాజీ మావోయిస్టు నాయకుల మాటలు చూస్తే అలా అనిపించడం లేదు. దేవ్‌జీ, సంగ్రామ్, చంద్రన్న వంటి నాయకులు తమ రాజకీయ విశ్వాసాలను పూర్తిగా త్యజించలేదని, ఇకపై రాజ్యాంగ పరిధిలో ప్రజా జీవితంలో కొనసాగాలనుకుంటున్నామని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం దేవ్‌జీ సీపీఐ (మావోయిస్టు)పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. చట్టబద్ధంగా పనిచేసే పరిస్థితిలో పీఎల్‌జీఏకు స్థానం ఉండదని, సాయుధ విభాగాన్ని రద్దు చేయడం వేరు, రాజకీయ పార్టీని రద్దు చేయడం వేరు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామంలోని సంక్లిష్టతను స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 45 ఏళ్ల అజ్ఞాత జీవితం తర్వాత చంద్రన్న కూడా ప్రజల కోసం పోరాటం ఇక బహిరంగ, ప్రజాస్వామ్య మార్గాల్లో సాగాలని చెబుతున్నారు.
అయితే తుపాకీని పక్కనపెట్టి బ్యాలెట్ పట్టుకోవడం ఒక్కటే ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ప్రవేశానికి ప్రమాణం కాదు. గతంలో తుపాకీ ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలను ఇప్పుడు ఓటు ద్వారా సాధించాలనుకుంటే, ఆ మార్పు కేవలం వ్యూహాత్మకమైనదా? లేక రాజకీయ విశ్వాసాల్లోనూ మౌలిక పరివర్తన వచ్చిందా? ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే కాదు. రాజ్యాంగాన్ని అంగీకరించడం, ప్రత్యర్థి రాజకీయ హక్కులను గౌరవించడం, వ్యక్తి స్వేచ్ఛను గుర్తించడం, భిన్నాభిప్రాయాన్ని సహించడం, హింసను నిరాకరించడం—ఇవన్నీ ప్రజాస్వామ్య రాజకీయాల కనీస ప్రమాణాలు. మాజీ విప్లవకారుల ముందున్న అసలు పరీక్ష ఇక్కడే.
ఈ పరిణామం బలహీనపడిన పార్లమెంటరీ వామపక్షానికి కూడా కొత్త ప్రశ్నలను ముందుకు తెస్తోంది. ఒకప్పుడు తెలంగాణలో రాజకీయ, సామాజిక ఉద్యమాలకు బలమైన పునాది వేసిన సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు ఇప్పుడు పరిమిత ప్రాంతాల్లోనే ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి. ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో సంస్థాగత ఉనికి ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పాత రాజకీయ బలం కనిపించడం లేదు. ముఖ్యంగా కొత్త తరాన్ని తమ వైపు తిప్పుకోవడంలో వామపక్ష పార్టీలకు ఉన్న సవాళ్లు దాచలేనివి. ఇలాంటి సమయంలో మాజీ మావోయిస్టుల రాజకీయ పునరావాసం, వామపక్ష ఐక్యత చర్చలు వాటికి కొత్త అవకాశాన్ని ఇస్తున్నాయా? లేక పాత రాజకీయ బలహీనతలకు మరో పొర మాత్రమే జతచేస్తున్నాయా? అన్నది చూడాల్సి ఉంది.
ఇలాంటి నేపథ్యంలో జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో జరిగిన కమ్యూనిస్టుల సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. పార్లమెంటరీ వామపక్ష పార్టీల ప్రతినిధులు, ప్రగతిశీల కార్యకర్తలు కలిసి మావోయిస్టు ఉద్యమ పతనం తర్వాత ఏర్పడిన రాజకీయ ఖాళీపై చర్చించారు. మాజీ విప్లవకారుల అనుభవాన్ని ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ఎలా తీసుకురావాలి? వామపక్ష శక్తులను ఎలా ఏకం చేయాలి? భూమి, ఉపాధి, సామాజిక న్యాయం వంటి సమస్యలను కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు భిన్నమైన రాజకీయ కార్యక్రమాన్ని ఎలా రూపొందించాలి? అన్న ప్రశ్నలు ఈ చర్చలో ముందుకొచ్చాయి. ప్రశ్నలు రావడం సులభమే. వాటికి ప్రజలు నమ్మే సమాధానాలను రాజకీయ కార్యాచరణగా మలచడమే అసలు సవాలు.
ఇదే సమయంలో జన తెలంగాణ పార్టీ రూపుదిద్దుకుంటుండటం ఈ ప్రయత్నానికి మరింత రాజకీయ రూపాన్ని ఇస్తోంది. లంక పాపిరెడ్డి (లచ్చన్న), న్యాయవాది బల్ల రవీంద్రనాథ్, గురిజాల రవీందర్‌రావు ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ప్రయత్నంలో విప్లవోద్యమంలో దశాబ్దాలపాటు పనిచేసి సాధారణ జీవితంలోకి వచ్చినవారితో పాటు ప్రగతిశీల కార్యకర్తలు, పౌరహక్కుల వర్గాలకు చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. దేవ్‌జీ, సంగ్రామ్, చంద్రన్న వర్గం దీనితో అధికారికంగా అనుబంధం కలిగి లేకపోయినా, సాయుధ పోరాటం నుంచి ప్రజాస్వామ్య రాజకీయాల వైపు మళ్లాలన్న ఆలోచనకు ఇది ఒక రాజకీయ వేదికగా కనిపిస్తోంది.
వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పరిధిలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జన తెలంగాణ సన్నాహాలు చేస్తోంది. జీడీపీ వృద్ధి, భారీ ప్రాజెక్టులనే అభివృద్ధికి కొలమానాలుగా చూడకుండా ఉచిత విద్య, వైద్యం, యువతకు ఉపాధి, అధికారాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ వంటి అంశాలను అభివృద్ధి ప్రమాణాలుగా ముందుకు తెస్తోంది. ఇవి ప్రజల జీవితాలతో ముడిపడిన అంశాలే. కానీ నినాదాలను వోట్లుగా, వోట్లను రాజకీయ శక్తిగా మార్చడానికి కావాల్సిన సంస్థాగత బలం, నిరంతర ప్రజా సంబంధాలు, స్పష్టమైన విధాన కార్యాచరణ ఈ కొత్త ప్రయత్నాలకు ఉన్నాయా అన్నదే కీలకం.
మూడో ప్రత్యామ్నాయం అనేది కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు వ్యతిరేకంగా మరో జెండా ఎగరేయడం కాదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు భిన్నమైన రాజకీయ సమాధానాన్ని చూపగలగడం. భూమి, సాగునీరు, ఉపాధి, విద్య, వైద్యం, సామాజిక న్యాయం వంటి అంశాలపై స్పష్టమైన విధానాన్ని ప్రజల ముందుంచడం. అధికారాన్ని ప్రశ్నించడమే కాదు, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం. గత చరిత్రను రాజకీయ మూలధనంగా ఉపయోగించుకోవడం కంటే వర్తమాన సమస్యలపై విశ్వసనీయమైన కార్యాచరణను చూపడం. ఇదే ఏ ప్రత్యామ్నాయానికైనా గీటురాయి.
ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. విప్లవోద్యమం నుంచి వచ్చిన వ్యక్తుల గతం వారికి రాజకీయ గుర్తింపును ఇవ్వవచ్చు. కానీ అదే గతం ప్రజాస్వామ్య రాజకీయాల్లో కొత్త ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. హింసాత్మక రాజకీయాల నుంచి ప్రజాస్వామ్య రాజకీయాలకు మారుతున్నామని చెప్పినప్పుడు, గతాన్ని ఎలా సమీక్షించుకుంటారు? గతంలో అనుసరించిన పద్ధతులపై ఏ వైఖరి తీసుకుంటారు? రాజ్యాంగబద్ధ వ్యవస్థపై ఎంత స్పష్టమైన నిబద్ధత ప్రకటిస్తారు? రాజకీయ ప్రత్యర్థిని శత్రువుగా కాక ప్రత్యర్థిగానే చూడగలరా? ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి వచ్చే ప్రతి మాజీ విప్లవకారుడి ముందూ ఇవి తప్పించుకోలేని ప్రశ్నలు.
అందుకే మాజీ మావోయిస్టులు, లొంగిపోయిన నక్సలైట్లు, పార్లమెంటరీ కమ్యూనిస్టులు ఒకే వేదికపైకి రావడం కంటే వారు ఎలాంటి రాజకీయ సంస్కృతిని నిర్మిస్తారన్నదే ముఖ్యం. తుపాకీని వదిలి బ్యాలెట్‌ను ఎంచుకోవడం ఒక పరిణామం కావచ్చు. కానీ అది ప్రజాస్వామ్య పరివర్తనగా నిలవాలంటే హింస స్థానంలో రాజ్యాంగం, రహస్య కార్యకలాపాల స్థానంలో బహిరంగ రాజకీయాలు, నినాదాల స్థానంలో ప్రజా సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు రావాలి. లేకపోతే పేరు మారినా రాజకీయ పద్ధతి మారలేదన్న విమర్శ తప్పదు.
తెలంగాణకు మూడో ప్రత్యామ్నాయం అవసరమా అన్నది రాజకీయ చర్చ. అయితే ఆ ప్రత్యామ్నాయానికి విశ్వసనీయతను ఇచ్చేది గతంలోని పోరాట చరిత్ర కాదు; వర్తమానంలో ప్రజలతో ఉన్న సంబంధం. మాజీ విప్లవకారులు తమ గతాన్ని ఎలా సమీక్షించుకుంటారు? కమ్యూనిస్టు పార్టీలు తమ పాత పరిమితులను ఎలా అధిగమిస్తాయి? యువత, రైతులు, నిరుద్యోగులు, అట్టడుగు వర్గాలకు వారు ఏ కొత్త రాజకీయ దిశను చూపుతారు? ఈ ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలే వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. తుపాకీ పోరాటం ముగిసిన చోట ప్రజాస్వామ్య రాజకీయ పోరాటం మొదలవుతుందా? లేక పాత సిద్ధాంతాలకు కొత్త రాజకీయ వేదిక మాత్రమే ఏర్పడుతుందా? తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు చూడాల్సింది ఇదే.





