బలపం పట్టిన్రోజు తెలియలేదు
చాక్ పీస్ పట్టేదాకా
ఎదుగుతానని
*
నా ఐదు వేళ్లను
లోపలికి పంపించే
నా ఆరో వేలు సుద్దముక్క
*
మాసార్లు తన్నామని చెపితే
ఇంకా తన్నమనెటోళ్లు
మా అమ్మా నాన్నలు
*
తెలుగులో తప్పుల్రాస్తే
బూతులని తిట్టేది
మా టీచర్
*
గుణితమొచ్చేది కాని
గణితమసలొచ్చేదికాదు
నాకు
*
మా బడిగోడల్ని చూస్తే
మేమేసిన గోడకుర్చీలు
గుర్తొస్తాయి
*
ఒంగుడు దూకుడు
ఎవరెస్టెక్కినంత
సంబరాన్నించేది
*
ఎక్కడా చేతులు చాపొద్దనే
తన ముందు చేతులు చాపమనేవాడు
బెత్తంతో మా మాస్టారు
*
అప్పుడలా
గోడకుర్చీ వేసినందుకే
ఇప్పుడిలా కుర్చీ
*
మాసారు బెంచీ ఎక్కమన్నది
జీవితంలో ఇన్నెత్తులకెక్కటానికేనని
ఇప్పుడు తెలిసింది
*
అప్పుడు పిల్లల్ని కొడితే
ఏడుపే వచ్చేది
ఇప్పుడు కంప్లయింటొస్తుంది





