సామూహిక సాహిత్య నిర్మాత

చెమ్మ: వారాల ఆనంద్

‘‘అనాదిగా వెలి వేయబడ్డ నేను/ వెలిగించి అంధకారానందాన్ని తగలబెడుతున్నాను/ నా వెంట ఆత్మవిశ్వాసపు అన్నలు/ ఆత్మాభిమానపు అక్కలు/ పూలు మొగ్గలు నా సైన్యం’’ ఈ కవిత చదివితే జ్వలిత అంటే ఎవరో కవిగా తానేమిటో తెలిసిపోతుంది. సాహిత్యం కొన్నిసార్లు మనసుకు సాంత్వన ఇస్తుంది. మరికొన్నిసార్లు కలవరపెడుతుంది. ప్రశ్నలు వేస్తుంది. అలవాటుగా ఆలవోకగా అంగీకరించిన వ్యవస్థల వెనుక దాగిన అసమానతలను చూపిస్తుంది. జ్వలిత దెంచనాల రచనలు చదువుతున్నప్పుడు రెండో లక్షణం ప్రత్యేకంగా గుర్తుకొస్తుంది. ఆమెకు అక్షరం కేవలం అలంకారం కాదు. ఆలోచనను రగిలించే సాధనం. తన కవిత్వం భావోద్వేగాల వ్యక్తీకరణ మాత్రమే కాదు. సామాజిక వైరుధ్యాలను ప్రశ్నించే వేదిక.

విజయకుమారి దెంచనాలగా జన్మించిన జ్వలిత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేసారు. కవయిత్రిగా, కథారచయిత్రిగా, నవలాకారిణిగా, అనువాదకురాలిగా, సంపాదకురాలిగా ఆమె చేసిన కృషి విస్తృతమైనది. జ్వలిత తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బహుముఖ సృజనశీలి. ‘కాలాన్ని జయిస్తూ నేను’, ‘సుదీర్ఘ హత్య’, ‘అగ్నిలిపి’, ‘సంగడి ముంత’ అనే కవితా సంపుటాలు, ఆత్మాన్వేషణ, రూపాంతరం, జ్వలిత-వెన్నెల, మాతృక నాలుగు కథా సంపుటాలు, జ్వలితార్ణవాలు అన్న వ్యాస సంపుటి, ఎర్రరంగు బురద, ఒడిపిళ్ళు అనే నవలలు రాసారు. ముజఫర్ నగర్లో దీపావళి, రస్కిన్ బాండ్ కథలు, అనే అనువాద పుస్తకాలు రాసారు. తెలంగాణ కథలు, ఖమ్మం కథలు, మల్లెసాల (శతాధిక చేతివృత్తి కథలు), రుంజ, పరివ్యాప్త, సంఘటిత, కరోనా డైరీ వంటి ఇరవై సంకలనాలు ప్రచురించారు. జ్వలిత రచనలు ఇంగ్లీషు, హిందీ, కన్నడభాషల్లో అనువాదం అయ్యాయి. తను ‘బహుళ’ అంతర్జాల త్రైమాసిక పత్రికను నిర్వహిస్తున్నారు

 ‘సుదీర్ఘ హత్య’ శీర్షికే బలమైన ప్రశ్నను రేకెత్తిస్తుంది. హత్య అంటే ఒక్క క్షణంలో జరిగే సంఘటనేనా? లేక ఒక మనిషి జీవించే హక్కును, ఆత్మగౌరవాన్ని, అవకాశాలను క్రమంగా హరించే సామాజిక వ్యవస్థలు కూడా దీర్ఘకాలిక హత్యకు కారణమవుతాయా? ఈ ప్రశ్నను ఆమె సంధిస్తుంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘అగ్నిలిపి’ కవిత్వం ప్రాంతీయ ఆకాంక్షలను ఎలా వ్యక్తీకరించగలదనే అంశాన్ని తెలుపుతుంది. ఉద్యమం కేవలం రాజకీయ నినాదాలు కాదు, అది ఆత్మగౌరవం, గుర్తింపు, హక్కులు, భవిష్యత్తుపై ఆశల సమ్మేళనం. ఈ నేపథ్యంతో జ్వలిత కవిత్వాన్ని పరిశీలించినప్పుడు ప్రాంతీయ చైతన్యం తన సాహిత్యంలో ఎలా ప్రతిఫలిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

జ్వలిత కవితల్లో ‘పక్కనే వెన్నుపోట్లుంటాయి’ ప్రస్తావించదగిన కవితల్లో ఒకటి. ఇందులో నమ్మకానికి ఎదురుగ్గా ద్రోహం నిలుస్తుంది. దగ్గరగా ఉన్న ప్రతివ్యక్తి మనకు తోడుగా ఉంటాడా? ప్రజల ప్రయోజనాల పేరుతో ముందుకు వచ్చే ప్రతి వ్యవస్థ నిజంగానే ప్రజల పక్షాన నిలుస్తుందా? మాటలకు, చేతలకు మధ్య అంతరం ఏర్పడినప్పుడు దాని ప్రభావం వ్యక్తులమీద మాత్రమే కాకుండా సమాజంమీద కూడా పడుతుంది. ఇది నమ్మకం, ద్రోహం, సామాజిక సంబంధాల వైరుధ్యాలను వివరిస్తుంది.

జ్వలిత  ‘నెత్తురోడే గోటీలాట’ బలమైన దృశ్యాన్ని మన ముందుంచుతుంది. సాధారణంగా గోటీలాట బాల్యానికి, అమాయకత్వానికి, ఆటపాటలకు సంబంధించినది. కానీ అదే ఆట నెత్తురోడే పరిస్థితిగా మారితే, ఆటను నడిపిస్తున్న చేతుల గురించి ప్రశ్నించాల్సి వస్తుంది. సంఘర్షణలో కనిపించేవారు ఒకరినొకరు ఎదుర్కొంటున్నా, ఆ సంఘర్షణకు కారణమైన శక్తులు మరెక్కడో ఉండవచ్చు. పరస్పరం ఘర్షణ పడే రెండు సేవావ్యవస్థల వెనుక ఉన్న పాలనా వైరుధ్యాలను కవయిత్రి దీంట్లో ప్రశ్నిస్తారు. ఆయుధాలకు మనసు, కళ్ళు ఉండవనే భావన ద్వారా వాటిని ఉపయోగించే మనిషి విచక్షణ, బాధ్యతల ప్రాధాన్యాన్ని చెబుతారు. రక్షణ కోసం ఏర్పడిన వ్యవస్థలే విధ్వంసానికి దారితీసినప్పుడు, వాటిని నడిపించే అధికార నిర్మాణాలను ప్రశ్నించాల్సిన అవసరాన్ని ఈ కవిత గుర్తుచేస్తుంది. ఇక్కడ కవిత్వం కేవలం సంఘటనను వర్ణించి ఆగిపోదు. సంఘటన వెనుక ఉన్న కారణాలను అన్వేషించే విమర్శనాత్మక దృష్టికి అవకాశం కల్పిస్తుంది. ఇదే సామాజిక చైతన్యంతో కూడిన కవిత్వం చేయగల పని. చేయాల్సిన పని.

జ్వలిత ప్రచురించిన ‘ఆత్మాన్వేషణ’, ‘రూపాంతరం’ కథా సంపుటాలు చదివితే కథ అనేది సంఘటనల కూర్పు మాత్రమే కాదు. మనిషి ఎందుకు అలా ప్రవర్తించాడు? అతని నిర్ణయాలను కుటుంబం, సమాజం, ఆర్థిక పరిస్థితులు ఎలా ప్రభావితం చేశాయి? మారుతున్న విలువలు వ్యక్తుల సంబంధాలను ఎలా మార్చాయి? ఇలాంటి ప్రశ్నలకు ఆమె కథలు సమాధానాలను అన్వేషిస్తాయి. జ్వలిత ‘ఎర్ర రంగు బురద’ నవలలో సామాజిక సంఘర్షణలు ముఖ్యంగా కనిపిస్తాయి. నవల ఇంగ్లీషు, కన్నడ భాషల్లోకి అనువాదం అయింది. జ్వలిత సాహిత్య సేవలో ‘బహుళ’ అంతర్జాతీయ త్రైమాసిక స్త్రీవాద పత్రికకు ప్రత్యేక స్థానం ఉంది.

అంతేకాదు ప్రాంతీయ సాహిత్యానికి అక్షర భాండాగారంగా జ్వలిత ‘ఖమ్మం కథలు, అవలోకనం – కరోనా డైరీ, గల్పికా తరువు, లేఖావలోకనం, సంఘటిత, మల్లెసాల వంటి సంకలనాల సంపాదకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఒక ప్రాంతపు కథలను సమీకరించడం అంటే రచనలను ఒకచోట చేర్చడమే కాదు. ఆ ప్రాంతపు భాషను, ప్రజల జీవనానుభవాలను, కాలానుగుణమైన మార్పులను సాహిత్య స్మృతిలో భద్రపరచడం కూడా. జ్వలిత తను సోలంకి కథలను ‘ముజఫర్‌నగర్‌లో దీపావళి’గా తెలుగులోకి తెచ్చారు. జ్వలిత దెంచనాల ప్రయాణంలో రచయిత్రి, సంపాదకురాలు అనే రెండుపాత్రలు పరస్పరం పూరకంగా కనిపిస్తాయి. ఒకపాత్ర తన అనుభవాన్ని అక్షరంగా మలిస్తే, మరొకటి అనేకమంది అనుభవాలను కలిపి సామూహిక సాహిత్య చరిత్రగా నిలుపుతుంది. అక్షరాన్ని సామాజిక బాధ్యతగా, సాహిత్యాన్ని చైతన్య వేదికగా చూడాలనే ప్రయత్నంలోనే జ్వలిత ప్రత్యేకత ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *