ఆ వేసవి సాయంత్రం
శిఖరాంచున ఆమె ధ్యానముద్రలో ఉంది
సుడులు తిరిగిన ఆమె నల్లటి కురులు
నింగిని నేలను ఏకం చేస్తూ
చీకటై…చిక్కటి నిశ్శబ్దమై …పరుచుకున్నాయి
భావోద్వేగాలు జొరబడలేని ఎక్సోస్పియర్!
శూన్యంగా ఉన్నంత మాత్రాన శాంతంగా ఉన్నట్లు కాదుగా ...
యుగాలుగా రాళ్ళ మాటున అణచి పెట్టిన ఒత్తిడి
అగ్నిపర్వత గర్భాంతరాళాన్ని చీల్చుకుని బయటపడింది
గుండె ఏ మూలో దాగిన ఓ నిప్పు రవ్వ
ఛప్పున రాజుకుంది
పొయ్యిలోని నిప్పురజను పడి
గడ్డివామి అంటుకున్నట్లు!
గిన్నెలో మరిగి మరిగి పాలు
ఒక్కసారే పొంగినట్లు!!
కొండ గుండె
విస్పోటన అగ్నిగుండమై
లావా ఐ పారింది
ప్రవహించిన దారంతా
అతని ఙ్ఞాపకాలు బూడిదై
గాలిలో కలిసిపోయాయి.
రెహానా





