పొల్లు!: -బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు

“వార్రావొచ్చు” అంది సుబ్బు.

“ఆఁ?” అన్నాను.

“తొందరగా యింటికి వెళ్ళాలి” సెల్‌లో టైమ్ చూసుకుంటూ కాస్తంత ఆందోళనగా అంది.

నా మొద్దు బుర్రకి పరాకున అర్థం కాలేదు. “వారొస్తే, యెక్కడున్నా వొకటే… అయినా వారొస్తే గిస్తే ముందు బార్డర్లో వస్తుంది” అన్నాను.

“వదినా, జోకులు వద్దు. ఆ వార్ కాదు మా వారు” చివరి అక్షరాన్ని వొత్తి పలికింది సుబ్బు.

“రానీ, యేం చంటి పిల్లాడా? నువ్వు కనపడకపోతే గోల చెయ్యడానికి!” అన్నాను, నవ్వుతూ.

“మావారికి ఆఫీసుకు వెళ్ళేముందు వచ్చేముందు నేను కనిపించాలి, అదో సెంటిమెంటు మావారికి” మళ్ళీ అంది సుబ్బు.

“బాగుంది, మావాడికి నేనవేమీ అలవాటు చెయ్యలేదు” అన్నాను చాలా క్యాజువల్‌గా. “అయినా అలా అలవాటు చేస్తే, చంకనెక్కుతారు” అని సుబ్బు వంక చూశాను. ఏమైనా హర్ట్ అయ్యిందా అని.

“అంటే, మనం అలవాటు చేస్తామా యేంటి? వాళ్ళ మమ్మీ దగ్గర వున్నప్పటి నుంచి మా వారికి అలవాటు, యిప్పుడు వాళ్ళ మమ్మీ ప్లేసులో నేను మావారికి…” యింకా చెప్పబోయింది సుబ్బు.

“బాగుంది” అన్నాను.

సుబ్బు యెందుకో సైలెంట్ అయిపోయింది. అప్పుడు నేనే అన్నాను. “వాళ్ళ వీక్‌నెస్ మన వీక్‌నెస్ కాకూడదు” అని.

“అంటే, మావారు నా కొంగు పట్టుకొనే తిరుగుతారు. నేనూ ఎంజాయ్ చేశాను మొదట్లో, మావారు అలా వుండడం నాకూ నచ్చింది. మావారిని కొంగుకు కట్టేసుకు తిరుగుతున్నానని మా ఆడపడుచూ దెప్పిపొడుస్తుంది. పిల్లలతో పాటుగా మావారూ జతయ్…” సుబ్బు చెప్పడం పూర్తికాలేదు.

“మాటకు ముందొక మావారు… మాటకు వెనకొక మావారు… మొన్ననలాగే వూర్నుంచి వచ్చినప్పుడు ‘వారొస్తారు’ టీపెట్టు వదినా అంటే, ‘యెంతమంది?’ అని అడిగా. వారు వారు వారు… బోరు… ముందా వారు మానేయ్” అన్నాను, నా ధోరణిలో.

“దొంగసచ్చినోడు అన్నిటికీ నామీదే ఆధారపడతాడు. టేబుల్ మీద పెట్టిన టీ కూడా చేతికి అందించకపోతే ‘టీ యేది?’ అని వెతుక్కుంటాడు. ఊపిరి తియ్యనివ్వడు… ‘సుబ్బలక్మీ… సుబ్బలక్మీ’ అనుకొని చంపుకు తినేస్తున్నాడనుకో. వాళ్ళమ్మ కడిగినట్టు మూతీ ముడ్డీ కడగడానికి వాళ్ళమ్మ దగ్గర వున్నంతే వున్నాడా… దొంగసచ్చినోడు దొంగసచ్చినోడు…” సుబ్బు వాక్ ప్రవాహానికి అడ్డొచ్చాను.

“ఎవరూ?” అన్నాను, నోరు వెళ్ళబెట్టి.

“మావారు” తనమాటను తనే వెక్కిరిస్తూ వుక్రోశంతో పలికినప్పుడు స్వరాలన్నీ ఆమె కంఠస్వరమైన శబ్దం.

నేను వుగ్గబట్టుకోలేక నవ్వేశాను! కాసేపటికి తనూ నవ్వింది!!

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *