ఒక ఉద్యోగి లంచం తీసుకుంటే అది ఆ వ్యక్తి తప్పా, లేక లంచం ఇవ్వకపోతే పని జరగని వ్యవస్థదా? ఆ వ్యవస్థలోని ఏ ఒక్క ఉద్యోగినో పట్టుకుంటే అవినీతి అంతమవుతుందా? కెవి నరేందర్ రాసిన ‘జెర్రి’ కథ ఒక అవినీతి ఉద్యోగి జీవితంలో జరిగిన పరిణామాల ద్వారా ఈ ప్రశ్నలన్నింటినీ మన ముందుకు తెస్తుంది. కథ అవినీతిని కేవలం ఒక వ్యక్తికున్న దురాశగానే చూడకుండా, దాని వెనకుండే అధికార సంబంధాలనూ, ఒకరి ప్రయోజనాల్ని మరొకరు కాపాడుకునే విధానాలనూ, సామాజిక విలువలనూ లోతుగా పరిశీలిస్తుంది.
రామకృష్ణ ఒక గవర్నమెంట్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్. ముప్పై ఏళ్లుగా లంచాలు తింటూ విపరీతంగా ఆస్తులు కూడబెట్టిన తను, చివరకు బోరగూడెం సర్పంచ్ ఉమ్లానాయక్ దగ్గర ఎనభై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోతాడు. ఎనిమిది కోట్ల విలువైన ఇల్లూ, తొమ్మిది కార్లూ, నూట ఇరవై కోట్ల విలువైన భూములూ, ఫ్లాట్లూ, విల్లాలూ, బంగారు నగలూ- ఇలా అతని అక్రమ సంపాదన ఎంత పెద్దదో బయటపడుతుంది. అతన్ని అరెస్టు చేసిన వ్యవస్థలోనే లంచాల పర్వం సాగుతుంది. తిరిగి ఉద్యోగంలో చేరాలంటే మళ్లీ లంచమివ్వాల్సి రావడమే కాకుండా, చివరికి తనను పట్టించిన సర్పంచ్‌కే నెలకి కొంత డబ్బు చెల్లించాల్సిన పరిస్థితొస్తుంది.
లంచాల తీరు తెన్నులు ఎట్లా ఉంటాయో చూపించడానికి ఈ జైలు సన్నివేశాలే పెద్ద ఉదాహరణ! లంచం తిని పట్టుబడొచ్చిన రామకృష్ణను చూసి కానిస్టేబుళ్లు ఎగతాళిగా మాట్లాడుతూనే, ఫోన్ మాట్లాడటానికి రోజుకి ఐదు వందలడుగుతారు. జైలర్ నిజాయితీ గురించి నీతులు చెప్తూనే, ఖైదీకి ఇంటి భోజనం రావడానికి డబ్బులొసూలు చేస్తాడు. జైల్లోకి వెళ్లాలన్నా, భార్యను కలవాలన్నా, భోజనం రావాలన్నా- ప్రతీదానికీ లంచమే కావాలి. రామకృష్ణను ఏసీబీ పట్టుకోవడం అవినీతిపై గెలుపులా కనిపించినా, ఆ తర్వాత చుట్టూ కనిపించే వాతావరణమంతా ఆ గెలుపెంత చిన్నదో తేల్చిచెప్తుంది.
కథలో అసలైన మలుపు ఉమ్లానాయక్ పాత్రతోనొస్తుంది. తన ఊరిలో స్కూలునూ, అంగన్వాడీ భవనాలనూ కట్టాలనే మంచి ఉద్దేశంతో సర్పంచ్ అయిన అతను, ఆ బిల్లులు పాసవ్వడం కోసం రామకృష్ణకి లంచమివ్వాల్సిసొస్తుంది. భార్య పుస్తెల తాడమ్మీ, అప్పులు చేసీ ఆ పనులు చేశానని అతను చెప్తాడు కానీ, రామకృష్ణ మాత్రం తను పైఅధికారులకు వాటాలివ్వాలనీ, కమీషన్లు తగ్గించడం తన వల్ల కాదనీ సమర్థించుకుంటాడు. దీన్ని బట్టి అవినీతనేది ఇద్దరి మధ్య జరిగే డబ్బు లావాదేవీ మాత్రమే కాక, ప్రజల డబ్బూ, అధికారులూ, రాజకీయ నాయకుల మధ్య ఉన్న అధికార సంబంధాల సమస్య అనీ అర్థమవుతుంది.
అయితే ఉమ్లానాయక్ను కేవలం ఒక బాధితుడిగానే చూడలేం. ఏసీబీ దాడి జరుగుతున్నప్పుడు అతని ముఖంలో కనిపించే చిరునవ్వు, రామకృష్ణ నాశనమయ్యాడనే ఆనందాన్ని చూపిస్తుంది. జైల్‌నుంచి బయటికొచ్చిన రామకృష్ణ తన కాళ్లపై పడినప్పుడు, కేసు వెనక్కి తీసుకోవాలంటే నెలకు ఇరవై వేలివ్వాలని డిమాండ్ చేస్తాడు. ముందు లంచమిచ్చిన వ్యక్తే, తర్వాత లంచం గుంజే అధికారంలోకొస్తాడు. బాధితుడిగా ఉన్నంత మాత్రాన ఒకడు మంచివాడయిపోడనీ, అధికారం చేతికొస్తే గత అన్యాయాన్ని అడ్డుకోకపోగా దాన్నే కొనసాగిస్తారనీ ఈ పరిణామం చెప్తుంది.
రామకృష్ణను పట్టించిన ఉమ్లానాయక్ అతని కంటే నైతికంగా గొప్పవాడేమీ కాదు. ఉద్యోగం తిరిగి తెచ్చుకోవాలనుకున్న రామకృష్ణ నుంచి వ్యవస్థ డబ్బులు గుంజాలని చూస్తుంది. ఆ తర్వాత రామకృష్ణ కూడా ఈ వ్యవస్థను మార్చాలని అనుకోడు. తనకొచ్చిన నష్టాన్ని ఎలాగైనా భర్తీ చేసుకోవాలనీ, పోయిన నాలుగు లక్షల స్థానంలో నాలుగు కోట్లు సంపాదించాలనీ డిమాండ్ పెంచుకుంటాడు.
ముప్పై ఏళ్లుగా లంచాలు తింటున్నా, అది తప్పనే స్పృహ రామకృష్ణకి పూర్తిగా లేకపోలేదు. లంచమిచ్చే పేద మహిళల కళ్లలో నీళ్లు కనిపించేవనీ, కొన్నిసార్లు డబ్బు తీసుకోవడం పాపం అనిపించేదనీ అతనికి గుర్తుకొస్తుంది. కానీ పైఅధికారుల ఒత్తిడీ, తోటి ఉద్యోగుల మాటలూ, వ్యవస్థలోని అలవాట్లూ తన మనసును రాయిలా మార్చేశాయని సరిపెట్టుకుంటాడు. ఈ ఆలోచనలు అతని తప్పును కప్పిపుచ్చవు కానీ, ఒక నేరం మనిషికి ఎట్లా అలవాటుగా మారిపోతుందో వివరిస్తాయి. వ్యవస్థ తప్పు అని చెప్పడం వేరు, దాన్నే సాకుగా చూపుతూ మనిషి బాధ్యత లేకుండా నడుచుకోవడం వేరు.
రామకృష్ణపై ఏసీబీ దాడి జరుగుతున్నప్పుడు అతని భార్య లావణ్య భర్తను కాపాడటానికి కాకుండా, బెడ్రూమ్లో ఉన్న బంగారాన్ని దాచడానికి చూస్తుంది. కూతురు రితిక తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని తెలిసాక రామకృష్ణ భార్యనే నిందిస్తాడూ, కొడతాడు. ప్రజల డబ్బును దోచుకున్న తన నైతిక వైఫల్యాన్ని ఒప్పుకోలేక, కుటుంబంపై అధికారాన్ని చూపిస్తాడు. రితిక పాత్రకు పెద్దగా స్వాతంత్ర్యం ఉండదు కానీ, ఆమె నిర్ణయం రామకృష్ణను కోలుకోలేని దెబ్బ తీస్తుంది.
జైలు వాతావరణమూ, పింక్ వాటరూ, జెర్రీ ప్రతీకలు రచయిత ఉద్దేశాన్ని బాగా చూపిస్తాయి. చీకటీ, జిడ్డు వాసనా, బూజు పట్టిన గోడలూ రామకృష్ణ పతనాన్ని కళ్లకు కడతాయి. చివర్లో పింక్ రంగులో కనిపెట్టే వర్షపు నీరు, లంచం నోట్లకు పూసే పింక్ రంగును గుర్తు చేస్తుంది. అవినీతి ఒక ఇంట్లోనో, ఒక ఆఫీసులోనో, ఒక వ్యక్తి చేతిలోనో లేదు, దాని రంగు మొత్తం వ్యవస్థకే అంటుకుందన్నది దీని సంకేతం.
‘వెయ్యికాళ్ల జెర్రి’ అనే పోలిక అవినీతి ఎంత పెద్దదో అన్నదానికి ప్రతీక. పరంధాములు చెప్పే “కాళ్లను కాదు, మెడను నరకాలి” అనే మాట వ్యవస్థ వేళ్లను నరకాలనే విషయాన్ని ముందుకు తోస్తుంది. కానీ చివర్లో ప్రభుత్వం లంచాలు తీసుకునే అధికారుల్ని ఉద్యోగాల్లోంచే తీసేయాలని నిర్ణయించిందని వార్త రాగానే- పరంధాములు “జెర్రి కాలు కాదు.. ప్రభుత్వమే దాని తలకాయ పగలగొట్టింది” అంటాడు. ఇది కథ మొదట్లో చెప్పిన వ్యవస్థాగత సమస్యను, కేవలం వ్యక్తులపై చర్యలు తీసుకోవడమనే చిన్న విషయంగా కుదించేస్తుంది. ఉద్యోగులను తీసేస్తే శిక్ష తీవ్రం కావచ్చు కానీ, లంచాలకు దారితీసే అధికార వాటాలూ, పర్యవేక్షణ లోపాలూ మారకపోతే అవినీతి అంతమైపోతుందా? దీనికి కథలో సమాధానం దొరకదు. పరంధాములు ఆఫీసులో మద్యం పోస్తూ అవినీతి అధికారుల మధ్య తిరిగే అటెండర్‌గా ఉంటూనే, సంపాదన పిచ్చిపై మంచిప్రశ్నల్నే లేవనెత్తుతాడు. అయితే కొన్నిచోట్ల అతని మాటలు రచయిత నేరుగా వచ్చి చెప్తున్నట్టనిపిస్తాయి. అధికారులు వార్త విని భయపడతారు కానీ, ఆ భయం వాళ్లలో వచ్చిన నైతిక మార్పుగా కాక, ఉద్యోగం పోతుందనే భయంగానే మిగిలిపోతుంది!
కథలో వ్యంగ్యమే ముఖ్యమైన భాగం. “లంచావతారం”, లంచం తిన్న అధికారుల జాబితాలో ఎస్సై, జడ్జీ ఉండటం, ఏసీబీలోనే అవినీతి ఉండటం- ఇవన్నీ అవినీతి ఒక్క శాఖకే పరిమితం కాలేదని చూపుతాయి. అయితే కొన్నిచోట్ల పాత్రల ప్రవర్తనే విషయాల్ని చెప్పేస్తున్నప్పుడు, ఆ పాత్రల సంభాషణల్లో మళ్లీ మళ్లీ వివరించడం వల్ల ఆ వ్యంగ్యపు పదును కాస్త తగ్గింది.
ఈ కథ ముఖ్య బలం ఏంటంటే అవినీతిపరుడిని పట్టుకోవడమే అవినీతి అంతం కాదని చెప్పడం. రామకృష్ణను నేరస్తుడిగా చూపిస్తూనే, అతనున్న వ్యవస్థనీ ప్రశ్నిస్తుంది. అలా అని అతని తప్పును తక్కువ చేసి చూపదు. ముగింపులో ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం అవినీతి జెర్రి తల నరికినట్టు చెప్పడం, అంతవరకు కథ నిర్మించిన లోతైన ఆలోచనను కొంత సరళం చేస్తుంది.
అవినీతి అనే జెర్రికి కాళ్లెన్ని అనే దానికంటే, ఆ కాళ్లకు బలం ఎక్కడ్నుంచొస్తోందనేదే అసలైన ప్రశ్న. రామకృష్ణను పట్టుకోవడం ఒక ఎత్తయితే ఉమ్లానాయక్ లాంటి వాళ్లు ఇంకో లంచగొండిగా మారకుండా చూసే పరిస్థితుల్ని కల్పించడం అసలైన బాధ్యత. ఒక ఉద్యోగిని తీసేయడం శిక్ష మాత్రమే అవుతుంది కానీ, లంచం ఇవ్వకపోతే పని జరగని పరిస్థితిని మార్చడమే వ్యవస్థ చేయాల్సిన పని. ఈ రెండింటి మధ్య తేడాను పాఠకులకు గుర్తు చేయడంలో కథ సఫలమైంది. ముగింపు ఇచ్చే పరిష్కారంపై కొన్ని ప్రశ్నలు మిగిలినా, అవినీతిని కేవలం కొంతమంది వ్యక్తుల జాబితాగా కాకుండా, ఒకదానిపై ఒకటి ఆధారపడిన వ్యవస్థగా చూడాల్సిన అవసరాన్ని ఈ కథ మన ముందుకు తెస్తుంది.
(ఈ కథ ఆదివారం ‘తెలుగు ప్రభ’లో సెప్టెంబర్ 6న ప్రచురితమైంది)





