– రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించిన మంత్రి పొన్నం
న్యూదిల్లీ, నవంబర్ 11 : స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) జాతీయ అవార్డును అందుకుంది. న్యూదిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి, రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌లు అవార్డును స్వీకరించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ఈ జాతీయ గుర్తింపు లభించింది. నగరంలో పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ఘన వ్యర్థాల శుద్ధి, మురుగునీటి నిర్వహణ, పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం వంటి పది ప్రధాన అంశాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనంలో జీహెచ్ఎంసీ తన పనితీరును ప్రదర్శించింది.
స్వచ్ఛతలో హైదరాబాద్ ప్రస్థానం
2017లో హైదరాబాద్‌కు ఓడీఎఫ్ హోదా లభించగా 2019లో ఓడీఎఫ్++ హోదా సాధించింది. 2021లో తెలంగాణలోనే తొలిసారిగా వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ పొందిన స్థానిక సంస్థగా జీహెచ్ఎంసీ గుర్తింపు పొందింది. 2023, 2024 సంవత్సరాల్లోనూ వాటర్ ప్లస్ హోదాను కొనసాగించింది. 2024 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో హైదరాబాద్ 6వ ర్యాంకు సాధించింది. 2023లో 5 స్టార్, 2024లో 7 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ గుర్తింపు పొందింది.
10,500 మార్కులతో మూల్యాంకనం
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో భాగంగా మొత్తం 10,500 మార్కులతో పది ప్రధాన విభాగాల్లో నగరాలను అంచనా వేశారు. కనిపించే పారిశుధ్యం, చెత్త వేరు చేయడం, సేకరణ, రవాణా, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య సదుపాయాలు, వినియోగించిన నీటి నిర్వహణ, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, పౌరుల అభిప్రాయాలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. స్వచ్ఛ షెహర్ జోడీ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ మెంటార్ సిటీగా మంథని, చేర్యాల మున్సిపాలిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఆ మున్సిపాలిటీల్లో పారిశుధ్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకు శిక్షణ కార్యక్రమాలు, సామర్థ్య పెంపు వర్క్‌షాప్‌లు నిర్వహించింది. 2026 ఏప్రిల్, మే నెలల్లో హైదరాబాద్ జంట నగరాల్లో మూడో పక్షం ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి పారిశుధ్య మౌలిక సదుపాయాలు, చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఇంటింటి చెత్త సేకరణతో పాటు ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీహెచఎంసీకి జాతీయ అవార్డు లభించడం హైదరాబాద్ నగర ప్రజలకు, అధికారులకు, పారిశుధ్య కార్మికులకు గర్వకారణమని పేర్కొంటూ నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని మంత్రి పొన్నం, కమిషనర్ కర్ణన్‌లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




