– ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు ఎదగాలన్నదే లక్ష్యం
– ఉప ముఖ్యమంత్రి భట్టి
– రూ.10 కోట్లతో కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన
కాజీపేట, ప్రజాతంత్ర, నవంబర్ 11 : విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యమని, అందుకోసం రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించి ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో కాజీపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనానికి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ సర్వే నిర్వహించిందని తెలిపారు. ఈ సర్వే విశ్లేషణలో సమాజంలోని కుటుంబాలు, కులాలు, వర్గాలు అభివృద్ధి చెందడానికి విద్యే ప్రధానమైన సాధనమని స్పష్టమైందన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో విద్యారంగంలో పటిష్టమైన పునాదులు వేస్తున్నామని చెప్పారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన యంగ్ ఇండియా పత్రిక స్ఫూర్తితో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 105 పాఠశాలలకు ఒకేసారి అనుమతులు మంజూరు చేశామని, ఒక్కో పాఠశాలను సుమారు రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. ఈ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలందరూ ఒకే ప్రాంగణంలో కలిసి చదువుకునేలా ప్రత్యేక విద్యావిధానాన్ని రూపొందించామని చెప్పారు. ఆంగ్ల మాధ్యమ బోధన, ఆధునిక సదుపాయాలు, విద్యార్థులతోపాటు బోధన, బోధనేతర సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్యనందించి సమానత్వం, సామాజిక సమైక్యత, సోదరభావం పెంపొందించేలా ఈ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అలాగే ప్రతీ నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్య అందించే ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్యాబోధన, ఆధునిక తరగతి గదులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. విద్యార్థులకు యూనిఫామ్, షూస్, టైలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు ఉచితంగా అందిస్తామని వివరించారు. ఈ స్కూల్స్‌ను సెమీ రెసిడెన్షియల్ విధానంలో నిర్వహిస్తామని, విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం పాఠశాలలోనే అందిస్తామని చెప్పారు. పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులను ప్రభుత్వ రవాణా సదుపాయంతో తిరిగి వారి ఇళ్లకు చేరుస్తామన్నారు. రాత్రివేళల్లో కుటుంబ సభ్యులతో గడుపుతూ పగటిపూట అత్యుత్తమ విద్యా సదుపాయాలను పొందేలా ఈ విధానం ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క చెప్పారు.
27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పరిశుభ్రమైన వాతావరణంలో కేంద్రీకృత వంటశాలల ద్వారా పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతోపాటు పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ సంస్కరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, నాయకులు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, శాసనమండలి సభ్యుడు బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ‘కుడా’ చైర్మన్ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఎండీ అయూబ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎన్పీడీసీఎల్ ఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, పోలీస్ కమిషనర్ శ్వేత, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భట్టికి ఘన స్వాగతం
తొలుత హనుమకొండకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కడియం కావ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, తదితర అధికారులు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గం పరిధిలోని కాజీపేట బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జాతీయ విద్యా దినోత్సవం, దేశ తొలి విద్యా శాఖ మంత్రి, భారతరత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి భట్టి ఘనంగా నివాళులర్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





