– దానం నాగేందర్ అనర్హతపై సుప్రీం స్పష్టత
– ఫిరాయింపులపై ఇక న్యాయపరమైన ఉచ్చు
– స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షకు బలం
– ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఉత్కంఠ
– పదో షెడ్యూల్ అమలుపై మరోసారి చర్చ
– పార్టీలు మారే సంస్కృతికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడేనా?
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి)
ఖైరతాబాద్ ఎంఎల్‌ఏ దానం నాగేందర్ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీల ఫిరాయింపుదారులకు పెద్ద గుణపాఠం చెప్పినట్లయింది. భవిష్యత్తులో ప్రజల చేత ఎంపికైన నాయకులు పార్టీ ఫిరాయించే ఆలోచన చేయడానికి భయపడే పరిస్థితి సుప్రీం కోర్టు తీర్పుద్వారా వెల్లడయింది. పాలన విషయంలో సమర్ధమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని ప్రజలకు రాజ్యాంగం కల్పించింది. తాము ఎంచుకున్న నాయకుడు లేదా పార్టీపైన విశ్వాసాన్ని వోటు రూపంలో ప్రకటించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమంటే ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కానీ దురదృష్టమేమంటే ప్రస్తుత రాజకీయాలన్ని కలుషితంగా మారాయి. ప్రజాభిప్రాయాలను పక్కకుపెట్టి కేవలం తమ స్వార్థ ప్రయోజనాలకే నాయకులు ప్రాధాన్యమిస్తున్నారన్నది ప్రస్తుత రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. ఫిరాయింపుదారులు మాత్రం ప్రజా ప్రయోజనం కోసమే తాము పార్టీ మారుతున్నామని బుకాయిస్తున్నారు. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి కావల్సినన్ని నిధులు సమకూర్చుకునే అవకాశముందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటివరకు అధికారపక్షంలో ఉన్న నాయకుడు దురదృష్టవశాత్తు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఎదురైతే భరించలేకపోతున్నాడు. మరో అయిదేళ్ళు అధికారానికి దూరంగా ఉండాలన్న విషయాన్ని జీర్ణించుకోలేక వెంటనే పార్టీ ఫిరాయిస్తున్నారు. చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ రాజకీయ క్రీడకు సుప్రీంకోర్టు తాజా తీర్పుతోనైనా ఫుల్‌స్టాప్ పడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ తీర్పు ఒక్క దానం నాగేందర్‌కు మాత్రమే పరిమితమా లేక 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఇతర ఎంఎల్‌లకు కూడా వర్తిస్తుందా అన్నదింకా ఆసక్తిని కలిగిస్తున్న అంశం. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి మొత్తం పదిమంది ఎంఎల్‌ఏలు పార్టీ ఫిరాయించగా ఒకరు వెనక్కు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో దానం నాగేందర్‌ది స్పెషల్ కేసు కాగా మిగతా శాసనసభ్యులు తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదని, దేవుడి కండువా అంటూ సాకులు చెబుతూ ఇంకా అగ్నిపరీక్షలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరి విషయంలోకూడా త్వరలోనే చట్టప్రకారం నిర్ణయం జరుగుతుందన్న నమ్మకం ఇప్పుడు ప్రజల్లో ఏర్పడింది. ఫిరాయింపుదారుల విషయంలో స్పీకర్ల పక్షపాత ధోరణికూడా ఇకముందు చెల్లదన్న విషయాన్ని కోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఫిరాయింపుదారులపై రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కింద అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ వేసిన పిటీషన్‌పై చర్య తీసుకునే విషయంలో స్పీకర్ చేసిన జాప్యం తెలియనిదికాదు. ప్రధానంగా దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం పలువురిని ఆశ్చర్యపర్చింది. అధికార పార్టీకి అనుకూలంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారంటూ పలువురు ప్రతిపక్ష నాయకులు తప్పుబట్టారు. దానం నాగేందర్ బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు నిర్ధారించడానికి తగిన ఆధారాలు లేవంటూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిర్ణయాలు తీసుకునే విషయంలో స్పీకర్లు చేస్తున్న కాలయాపన, పక్షపాత ధోరణికి న్యాయస్థానాలు ఒక విధంగా గట్టి షాక్ ఇచ్చినట్లయింది. స్పీకర్ నిర్ణయంతో సంబంధం లేకుండా న్యాయస్థానాలు నేరుగా జోక్యం చేసుకుని అనర్హత వేటు వేయగలవని ఈ తీర్పు ద్వారా వెల్లడైంది. ఇది ఫిరాయింపు దారులకుకూడా ఒక హెచ్చరిక లాంటిది. ఇదొక గుణపాఠం కూడా. ఒక పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికై మరో పార్టీ పక్షాన సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన దానంను శాసన సభ సభ్యత్వానికి అనర్హుడని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. వాస్తవంగా సుప్రీం కోర్టుకు వెళ్ళేందుకు కూడా నాగేందర్‌కు హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ 19న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ కింద చేసుకున్న దరఖాస్తులో హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాల్సిందిగా దానం కోరారు. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం దానం నాగేందర్ శాసనసభ్యత్వానికి అనర్హుడని, 2024 ఏప్రిల్ 23 నుండి ఈ అనర్హత వేటు అమలులోకి వస్తుందని సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఉప ఎన్నికలో పోటీ చేసుకోవచ్చని పేర్కొంటూ ఆయన పోటీ చేసి గెలిచిన ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గ స్థానం ఖాలీ అయినట్లుగా ప్రకటిస్తూ తీర్పు ప్రతిని శాసనసభ స్పీకర్, అసెంబ్లీ సెక్రెటరీకి అందజేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పార్టీ ఫిరాయించిన ఇతర బీఆర్‌ఎస్ ఎంఎల్‌లకు ఈ తీర్పు నిద్ర పట్టకుండా చేస్తున్నది. తిరిగి మాతృసంస్థలో చేరాలనుకున్నా వీరిపై న్యాయస్థానానికి వెళ్ళింది బీఆర్‌ఎస్ పార్టీ నాయకులే కావడంతో తిరిగి ఆ పార్టీలోకి వేళ్ళేందుకు కూడా ఇప్పుడు వీలు లేని పరిస్థితి. కిం కర్తవ్యం అన్న ఆలోచనలోపడ్డ వీరి స్థానాల్లోకూడా భవిష్యత్తులో ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడనుందా అన్న ఆసక్తికరమైన చర్చజరుగుతున్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





