– దేశవ్యాప్తంగా పార్టీ మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు
– తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు 9 మంది
– దానం నాగేందర్ కేసు ప్రత్యేకం
హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై ప్రజల మద్దతుతో గెలిచి, ఆ తర్వాత మరో పార్టీలోకి వెళ్లిన ప్రజాప్రతినిధుల సంఖ్య దేశవ్యాప్తంగా గణనీయంగా ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ తాజా అధ్యయనం వెల్లడించింది. 2022 నుంచి 2026 మధ్య జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికలను పరిశీలించిన సంస్థలు మొత్తం 111 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత పార్టీలు మారినట్లు గుర్తించాయి. ఇందులో తెలంగాణకు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. ఏడీఆర్ లెక్కల ప్రకారం పార్టీ మారిన 111 మందిలో 26 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇటువంటి మార్పులు నమోదయ్యాయి. అత్యధికంగా నాగాలాండ్‌లో 32 మంది పార్టీలు మారగా, పశ్చిమ బెంగాల్లో 20 మంది, తెలంగాణలో తొమ్మిది మంది ఉన్నారు. గోవా, పంజాబ్‌లలో ఎనిమిది మంది చొప్పున, మహారాష్ట్ర, మేఘాలయలో ఆరుగురు చొప్పున పార్టీలు మారినట్లు నివేదిక పేర్కొంది. సంఖ్యాపరంగా తెలంగాణ దేశంలో మూడో స్థానంలో నిలిచింది.
బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది ఫిరాయింపు
తెలంగాణకు సంబంధించిన ఏడీఆర్ గణాంకాల్లో ప్రత్యేకత ఏమిటంటే, నమోదైన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లినవారే. ఒకదశలో కాంగ్రెస్ వైపు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య పదిగా ప్రచారం జరిగింది. వీరు వరుసగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీలు. సహజంగానే బీఆర్ఎస్ ఈ పదిమంది ఎమ్మల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనసు మార్చుకొని బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి తగ్గింది. ప్రస్తుతం ఏడీఆర్ పేర్కొన్న సంఖ్య ఇదే.
దానం కేసు ప్రత్యేకం
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన మిగిలిన ఎమ్మెల్యేలతో పోలిస్తే దానం నాగేందర్ కేసు ప్రత్యేకమైనది కావడానికి ప్రధాన కారణం ఆయన కాంగ్రెస్ అధికారిక ‘బి-ఫామ్’ పై 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుండి పోటీ చేయడమే. ఫలితంగా రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించినట్లయింది. మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు కేవలం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం లేదా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే చేశారు. కానీ దానం నాగేందర్ ఒక అడుగు ముందుకు వేసి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఇది ఆయన స్వచ్ఛందంగా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకున్నారనడానికి తిరుగులేని, అధికారిక నిరూపణగా మారింది.మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో వారు అధికారికంగా కాంగ్రెస్ లో చేరినట్లు సరైన పత్రాలు లేదా ఆధారాలు లేవనే సాంకేతిక కారణాన్ని చూపుతూ అసెంబ్లీ స్పీకర్ వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు. అయితే దానం నాగేందర్ స్వయంగా కాంగ్రెస్ బి-ఫామ్‌పై నామినేషన్ వేయడంతో ఆయన విషయంలో స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ చెల్లకుండా పోయింది.ఈ బలమైన ఆధారాల కారణంగానే తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18, 2026న ఆయనపై అనర్హత వేటు వేస్తూ, ఆయన నామినేషన్ వేసిన ఏప్రిల్ 23, 2024 నుంచే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు తీర్పునిచ్చింది. హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సెప్టెంబర్ 24, 2026 న సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.ఈ విధంగా, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా దానం నాగేందర్ స్వయంగా చట్టపరమైన ఉచ్చులో చిక్కుకున్నారు. దీనివల్ల మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల కంటే ముందే ఆయన తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది
పదో షెడ్యూల్ మళ్లీ చర్చలోకి
భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించిన నిబంధనలను నిర్దేశిస్తుంది. ఒక ప్రజాప్రతినిధి తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం లేదా నిర్దిష్ట పరిస్థితుల్లో పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం అనర్హతకు దారితీయవచ్చు. పార్టీకి అధికారికంగా రాజీనామా చేయడం ఒక్కటే ప్రమాణం కాకుండా, సభ్యుడి రాజకీయ ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని గత న్యాయ తీర్పులు స్పష్టం చేశాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజాప్రతినిధులను కోల్పోయిన పార్టీల్లో ఎన్డీపీపీ నుంచి 25 మంది, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది, కాంగ్రెస్ నుంచి 19 మంది ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది బయటకు వెళ్లారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి అత్యధికంగా ఎన్పీఎఫ్ లోకి 32 మంది, బీజేపీలోకి 29 మంది, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాలో 20 మంది చేరినట్లు నివేదిక పేర్కొంది. తెలంగాణలో 2023 ఎన్నికల అనంతరం ఏర్పడిన పరిస్థితి పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు, స్పీకర్ పాత్ర, న్యాయసమీక్ష వంటి అంశాలను కూడా ముందుకు తెచ్చింది. ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మారినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు స్థితి ఏమిటి, అటువంటి కేసులపై ఎంత కాలంలో నిర్ణయం తీసుకోవాలి అనే ప్రశ్నలు ప్రస్తుతం రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏడీఆర్ తాజా నివేదిక, దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టు తీర్పు-ఈ రెండు పరిణామాలు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై జరుగుతున్న రాజకీయ, రాజ్యాంగ చర్చకు మరింత ప్రాధాన్యం ఇచ్చాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




