ఐలమ్మ స్ఫూర్తితో సామాజిక న్యాయం అమలు

– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బలహీనవర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ఆయన శుక్రవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆమె 131వ జయంతి సందర్భంగా ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం బీసీలు, పేదలు, మహిళలు, వెనుకబడినవర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే తెలంగాణ గడ్డపై దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటానికి జంగ్ సైరన్ మోగించారని సీఎం గుర్తు చేశారు. సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టి ఆమె సేవలను స్మరించుకున్నామని సీఎం చెప్పారు. ఐలమ్మతోపాటు తెలంగాణ వీర మహిళలు చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు కూడా ఆదర్శమన్నారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్య, గురుకులాలు, హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు యువత, మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు, గౌరవం, న్యాయం అందించడమే చాకలి ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *