– హరేకృష్ణ ఫౌండేషన్‌తో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఒప్పందం
– సీఎం రేవంత్ చేతుల మీదుగా చెక్కుల అందజేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలులో విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలని, వారి శారీరక పెరుగుదల, విద్య పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులకు సూచించారు. ఆహార పదార్థాల క్యాలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించుకోవాలన్నారు. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు హరే కృష్ణ ఫౌండేషన్‌తో జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లు ఒప్పందం చేసుకున్నాయి. అందుకు సంబంధించిన చెక్కులను సీఎం చేతుల మీదుగా ఆయన నివాసంలో హరేకృష్ణ ఫౌండేషన్‌కు ఆయా సంస్థల ప్రతినిధులు శుక్రవారం అందజేశారు. నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం జున్నా సోలార్ సిస్టమ్స్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈవో అనిల్ బాబులు రూ.5.17 కోట్ల చెక్కును, వికారాబాద్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం కోసం చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి సమంత డే, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్‌లు రూ.4 కోట్ల చెక్కును అందించగా ముఖ్యమంత్రి ఆ సంస్థల ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, హరే కృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్రదాస్ స్వామీజీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రాంతాల వారీగా అక్కడి అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయాలని, సెంట్రలైజ్డ్ కిచెన్లను విద్యార్థులు సందర్శించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇది జీవితకాలం కొనసాగే కార్యక్రమం కాబట్టి అత్యంత జాగ్రత్త వహించాలన్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామని, నవంబర్ 30లోగా ఇవి పూర్తి అయ్యేలా చూడాలని, డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రలైజ్డ్ కిచెన్ల ప్రారంభం జరుగుతుందని సీఎం తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





