– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం
– రెండు పార్టీలకు ప్రజల బాగోగులు పట్టవా?
– ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం
– రబీ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేయాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : అధికారంలో ఉన్న కాంగ్రెస్, గతంలో పాలించిన బీఆర్ఎస్ల మధ్య పరస్పర అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకునే క్విడ్‌ప్రోకో నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ మంత్రులు, కుటుంబీకుల ఆస్తులపై వ్యాఖ్యలు చేశారని, దానికి ప్రతిగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, వీటివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. ‘నువ్వు ఎంత తిన్నావు.. నేను ఎంత తిన్నాను.. మీరే అంతా తినేస్తే మాకేం మిగిల్చలేదు’ అన్న చందంగా ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అవినీతి రహిత పరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో మాతం ఎవ్రరు ఎక్కువ అవినీతి చేయాలనే పోటీ పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో బీఆర్ఎస్ అవినీతి చిట్టా విప్పి అరెస్టులు చేస్తామని ప్రగల్భాలు పలికిందని, నేటికీ ఒక్క కేసులోనూ అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితమై లోపాయికారీ ఒప్పందాలతో కాలం గడుపుతున్నదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రశ్నించే వారిపై అక్రమ అరెస్టులతో ఉక్కుపాదం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద జీవో 317ను బీజేపీతోపాటు ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారని, దానికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రభుత్వం తెచ్చిన జీవో 190ను సైతం సరిగ్గా అమలు చేయడం లేదని రామచందర్ రావు విమర్శించారు. జీవో 190 పరిధిలో దాదాపు 4000 మందికి బదిలీలు, డెప్యుటేషన్లు రావాల్సి ఉండగా 100 నుంచి 200 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దీనిపై గాంధీ భవన్ ఎదుట న్యాయబద్ధంగా ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయులను అరెస్టు చేయించడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులతోపాటు రైతులు, విద్యార్థులు, రాజకీయ నాయకులను అరెస్టు చేస్తూ ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వదలిచిందని ఆయన ప్రశ్నించారు. టీచర్ల న్యాయమైన కోరికలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, నీళ్లు లేక, కరెంట్ రాక పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో బోరు బావుల్లో నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని, జూరాలకు వెళ్తుంటే రైతులను, తమ పార్టీ నేతలను అరెస్టు చేశారని మండిపడ్డారు. ఖరీఫ్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారని, రాబోయే రబీ పంటకు సిద్ధమవుతున్న వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ఒక విడత ‘రైతు భరోసా’ నిధులను వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించచకపోవడం వల్లే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రబీకి ముందే రైతు భరోసా అందించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆరఎస్‌ల తీరుతో విసిగిపోయిన ప్రజలు రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని రామచందర్ రావు పేర్కొన్నారు. మేధావులు, రాజకీయ చైతన్యం ఉన్న యువత పెద్దఎత్తున బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు.





