చరిత్రాత్మక ఘట్టం కానున్న ‘సమ్మిట్’

– రాష్ట్ర భవిష్యత్తు, ఆర్థిక ప్రగతి కొత్త శిఖరాలకు
– ప్రతిష్టాత్మకంగా ‘గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లు చేపట్టాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– దేశ, విదేశాల్లో రోడ్‌షోలు.. వార్‌రూమ్ ద్వారా పర్యవేక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 2026 డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. తెలంగాణ భవిష్యత్తును, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని కొత్త శిఖరాలకు చేర్చే ఈ చరిత్రాత్మక ఘట్టంలో అధికారులంతా భాగస్వాములై దిగ్విజయం చేయాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు నిర్వహించనున్న ఈ గ్లోబల్ సదస్సు ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు. సచివాలయంలో బుధవారం జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, ప్రచారం, రోడ్‌షోల నిర్వహణపై డిప్యూటీ సీఎం కార్యాచరణను ఖరారు చేశారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న రెండో ప్రపంచ సదస్సు అని, దీని ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. సదస్సు నిర్వహణ పర్యవేక్షణకు దాదాపు పది ప్రత్యేక అధికారుల కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రతి కమిటీకి ఒక సీనియర్ అధికారి నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. పనుల రూపకల్పన, బడ్జెట్ అంచనాలు, ఆమోదాల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అధికారుల కమిటీలతోపాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసి వాటికి సంబంధిత మంత్రులను చైర్‌పర్సన్లుగా నియమించినట్లు తెలిపారు. ప్రతి కమిటీకి కన్వీనర్లను కూడా నియమించామని, వారు వెంటనే సంబంధిత మంత్రులను కలిసి బాధ్యతలు స్వీకరించి పనులు ప్రారంభించాలని సూచించారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రతిరోజూ కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా వేదికలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఈ రోజు నుంచే ప్రతిరోజూ సదస్సుకు సంబంధించిన ఏదో ఒక వార్త మారుమోగాలి.. ప్రచారానికి ఆకాశమే హద్దుగా పనిచేసి అధిక సంఖ్యలో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలి అని అధికారులకు స్పష్టం చేశారు.

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే ధ్యేయం

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న బృహత్తర లక్ష్యంలో ఈ సమ్మిట్ కీలక మైలురాయి కానుందని పేర్కొన్నారు. గతంలో కుదిరిన ఎంవోయూలను కూడా సమీక్షించి వాటి అమలు పురోగతిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి ప్రతి అధికారి భాగస్వామి కావాలని సూచించారు. సదస్సు ఏర్పాట్లను కేవలం ఒక కార్యక్రమంగా కాక రాష్ట్రానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడే ఆస్తిగా తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాలు, నగరాలు, రంగాలను గుర్తించి దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహించేందుకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ఏ దేశంలో ఏ రంగంలో పెట్టుబడులకు అవకాశాలున్నాయో అధ్యయనం చేసి దానికి అనుగుణంగా రోడ్‌షోల ప్రణాళిక రూపొందించి మంత్రిమండలి ఉపసంఘానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కార్యాచరణను ఖరారు చేసి రోడ్‌షోలను ప్రారంభించాలన్నారు. అధికారులు వెంటనే తమ టీమ్‌లతో సమావేశమై వార్ రూమ్ ద్వారా పనులను పర్యవేక్షించాలని, రోజూ సాయంత్రం పనుల పురోగతిని తనిఖీ చేసిన తర్వాతే రోజువారీ బాధ్యతలు ముగించాలని భట్టి చెప్పారు.

రాష్ట్ర సంస్కృతి, విశిష్టత ప్రతిబింబించాలి

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్- 2026 కేవలం పెట్టుబడుల సమీకరణకే పరిమితం కాకుండా తెలంగాణ సంప్రదాయాలు, సాంస్కృతిక విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడి ప్రత్యేక వంటకాలు ఈ ఈవెంట్‌లో ప్రధానంగా ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారి హరిచందనకు సూచించారు. బతుకమ్మ వంటి పండుగల నిర్వహణ మనకు కొత్తేమీ కాదని, గతంలోనూ సమర్థవంతంగా నిర్వహించామని గుర్తు చేస్తూ సాంస్కృతిక శాఖ సమన్వయంతో మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు. హోటళ్ల వాతావరణం అంతర్జాతీయ, జాతీయ అతిథులకు అంత ప్రత్యేకంగా అనిపించకపోవచ్చని, అందువల్ల ఇక్కడి సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించడానికి ఇదొక అద్భుత అవకాశమని పేర్కొన్నారు. రాష్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి దాదాపు 2,000 నుండి 3,000 మంది ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి మన సంస్కృతి ఒక దృశ్య కావ్యంగా నిలిచిపోవాలని అభిప్రాయపడ్డారు. దిల్లీలో జరిగిన జి20, బ్రిక్స్ సమ్మిట్‌ల తరహాలోనే సాయంత్రం వేళల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు మన వారసత్వాన్ని సమున్నతంగా చాటిచెప్పేలా ప్లాన్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *