అశ్వాపురం ప్రాంతంలో గోదావరి జలాల పరుగులు

– మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభం
– తుమ్మల చెరువులోకి నీరు విడుదల చేసిన మంత్రులు తుమ్మల, పొంగులేటి
– తొలి విడతలో 4,300 ఎకరాలకు
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్ల‌డి

అశ్వాపురం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : రైతుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ అశ్వాపురం మండలం మారేళ్లపాడులో ఎత్తిపోతల పథకాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు బుధవారం ప్రారంభించారు. పంపులను ఆన్ చేసి గోదావరి జలాలను తుమ్మల చెరువుకు విడుదల చేసి పథకాన్ని జాతికి అంకితం చేశారు. సుమారు రూ.610 కోట్లతో చేపట్టిన ఈ పథకం ద్వారా తొలి విడతలో 4,300 ఎకరాలకు, దశలవారీగా అశ్వాపురం మండలంలో 22 నుంచి 23 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ సంద‌ర్భంగా గొందిగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ తుమ్మల చెరువుకు గోదావరి జలాలు అందించాలన్న అశ్వాపురం ప్రాంత రైతుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంతో  సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి అశ్వాపురం, పినపాక ప్రాంతం నుంచి గోదావరి జలాలను పాలేరు వరకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాల్వ‌ల నిర్మాణానికి అవసరమైన అదనపు నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ఇల్లెందు నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు జూలూరుపాడు టన్నెల్, లలితాపురం వద్ద ఎత్తిపోతల పథకం తదితర అంశాలపై సర్వేలు నిర్వహించి సవరించిన అంచనాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అన్నదైవం ప్రాజెక్టుకు కూడా గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని తెలిపారు. కాల్వ‌ల భూసేకరణలో రైతులు సహకరించాలని, భూములు కోల్పోయే వారికి పరిహారం అందించాల‌ని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సుమారు పది నియోజకవర్గాల్లో సాగునీటి విస్తరణకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. భద్రాచలం నియోజకవర్గంలో ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి పాలెంవాగు, తాలిపేరు, మోడికుంటవాగు వంటి ప్రాజెక్టులతో అనుసంధానం చేస్తే మరిన్ని మండలాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని చెప్పారు. పులుసుబొంత్ ప్రాంతంలో అటవీ అనుమతులు, ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు వంటి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సాధ్యమైన ప్రాంతాల్లో చిన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఏర్పాటు చేసి గోదావరి జలాలను నిల్వ చేయాలని సూచించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు. అశ్వారావుపేట, పినపాక ప్రాంతాల్లో ఆయిల్‌పామ్ సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని మంత్రి తుమ్మ‌ల‌ తెలిపారు.

దక్షిణ అయోధ్యగా అభివృద్ధి చేయాలనేది లక్ష్యం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ మేరకు రూ.350 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. పుష్కరాల నాటికి సాధ్యమైనంత మేరకు పనులు పూర్తి చేసి భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రహదారులు, సాగునీరు, విద్య, వైద్య రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

నిరుద్యోగులు, యువత సంక్షేమానికి భ‌రోసా : మంత్రి పొంగులేటి

ప్రజా ప్రభుత్వం పేదలు, రైతులు, గిరిజనులు, మహిళలు, నిరుద్యోగులు, యువత సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత 30 నెలల్లో సుమారు 72 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. పులుసుబొంత్ ప్రాజెక్టుకు సంబంధించి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి త్వరలో టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల తదుపరి దశల్లో గిరిజన ప్రాంతాల్లో గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తరించడంతో రోజుకు సుమారు 450 నుంచి 500 మంది వరకు సేవలు పొందుతున్నారని తెలిపారు.

రైతులకు పండుగ వాతావరణం : ఎంపీ బలరాంనాయక్

ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ మారేళ్లపాడు ఎత్తిపోతల ద్వారా అశ్వాపురం మండలంలోని సుమారు 24 గ్రామాలతోపాటు ఇతర మండలాలకు కూడా సాగునీరు అందించే అవకాశం ఏర్పడిందన్నారు. గోదావరి జలాలు తుమ్మల చెరువుకు చేరుకోవడం రైతులకు పండుగ వాతావరణాన్ని కల్పించిందన్నారు. 2005 డిసెంబర్ 31న దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుకు పునాది వేసినప్పటి నుంచి జరిగిన పరిణామాలను వివరించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రాజెక్టు రూపకల్పనలో మార్పులు చేసి సీతారామ ప్రాజెక్టుగా అభివృద్ధి చేశారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2025 ఆగస్టు 15న సీతారామ ఎత్తిపోతలను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. అశ్వాపురం మండలంలో కుడి కాలువ పనులకు సుమారు రూ.130 కోట్లతో పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. చింతకుంట, జగ్గారం పరిధిలోని ఎర్రబోకల చెరువు, మిట్టగూడెం పరిధిలోని లోయర్ చెరువుతోపాటు అనుసంధాన చెరువులకు నీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కుడి కాలువ ద్వారా తొమ్మిది గ్రామ పంచాయతీలకు నీరు అందించి సుమారు 11,981 ఎకరాల కమాండ్ ఏరియాను స్థిరీకరించే అవకాశం ఉందన్నారు. కుడి, ఎడమ కాలువల ద్వారా 24 గ్రామ పంచాయతీల పరిధిలోని 68 గ్రామాలకు, సుమారు 13,037 కుటుంబాలకు, దాదాపు 24 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని తెలిపారు. తుమ్మల చెరువు ప్రధాన కాలువను బలోపేతం చేసి కాంక్రీట్ లైనింగ్‌తో పాటు సుమారు 22 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రులను కోరారు. గొందిగూడెం, వెంకటాపురం వంటి గిరిజన గ్రామాలకు కూడా సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, ఎస్పి రోహిత్ రాజు, జిల్లా అటవీ అధికారి సిధార్డ్ విక్రమ్ సింగ్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ , నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస రెడ్డి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *