అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో పెట్టుబడులకు అనుకూలం

– తెలంగాణ అవకాశాలు పుష్కలం
– పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
– ఇటలీ రాయబారికి మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేలా ఇటలీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధులను ఆయన కోరారు. ఇటలీ దేశ రాయబారి‘ఆంటోనియో బార్టోలి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఏయే రంగాల్లో తెలంగాణ- ఇటలీ కలిసి పనిచేసేందుకు అవకాశాలున్నాయనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. నేడు ఐరోపాలోనే అత్యంత బలమైన ఎగుమతి ఆధారిత, ఉత్పాదక రంగం కలిగిన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఇటలీ కొనసాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మెషీనరీ, ప్రిసిషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఆటోమోటివ్ సిస్టమ్స్, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. తెలంగాణను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలను, పాలసీలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. భారత్-ఇటలీ మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ 4.0, రోబోటిక్స్, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, క్లీన్ మొబిలిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ తదితర రంగాల్లో ఇటలీ మార్గదర్శకం తెలంగాణ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటలీకి నమ్మకమైన భాగస్వామిగా ఉండేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టం మరింత బలోపేతమయ్యేలా టీ హబ్, వీ హబ్, జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైజెస్ పార్కు, యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలతో ఇటలీ కంపెనీలు, నిపుణులు, సంస్థలు భాగస్వామ్యమయ్యేలా చొరవ చూపాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ఈ సమావేశం తొలి అడుగు మాత్రమే.. రాబోయే రోజుల్లో తెలంగాణకు నమ్మకమైన భాగస్వామిగా మారుతాం.. కీలక రంగాల్లో కలిసి పని చేస్తాం.. ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం అని ఇటలీ రాయబారి బార్టోలి పేర్కొన్నారు.
——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *