ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యకు భరోసా

– బీఏఎస్‌కు రూ.40.68 కోట్ల బకాయిల విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యతోపాటు వసతి సౌకర్యాన్ని అందిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ పథకం కింద విద్యార్థులకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని 225కుపైగా ప్రైవేటు పాఠశాలలకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.40.68 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న బీఏఎస్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 32 వేల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యను అభ్యసించడంతోపాటు వసతి సౌకర్యాన్ని పొందుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, పాఠశాలలకు చెల్లించాల్సిన బకాయిలను పరిష్కరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సహకారంతో రూ.40.68 కోట్ల నిధులను విడుదలయ్యాయి.

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ప్రత్యేక చొరవ

బీఏఎస్ కింద విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి సౌకర్యాల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటంతోపాటు పాఠశాలలకు చెల్లించాల్సిన బకాయిల పరిష్కారానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక చొరవ చూపారు. పాఠశాలల యాజమాన్యాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ బకాయిల విడుదలకు అవసరమైన చర్యలను వేగవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. పాఠశాలలకు బకాయిల విడుదలతో విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత స్థిరత్వం చేకూరడంతోపాటు పథకం అమలులో భాగస్వాములైన ప్రైవేటు పాఠశాలలకు కూడా ఆర్థికంగా ఊరట లభించనుంది. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే బకాయిల విడుదల జరిగిందని, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *