మన పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు

– గర్వకారణమన్న మంత్రి జూపల్లి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్‌’ పర్యాటక నివేదికలో రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని, ఇది గర్వకారణమని అన్నారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధానిలోని హుస్సేన్ సాగర్, చారిత్రక గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి కట్టడాలతోపాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలు నిత్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని వివరించారు. కేవలం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలే కాక ప్రకృతి ఒడిలో విరాజిల్లే కుంటాల, బొగత జలపాతాలు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర వంటి సాంస్కృతిక వేడుకలు రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని మంత్రి చెప్పారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి ఇక్కత్ వంటి సంప్రదాయ కళలు పర్యాటక రంగాన్ని మరింత సుసంపన్నం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని సుసంపన్నమైన సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలను తిలకించేందుకు దేశవిదేశీ పర్యాటకులు తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పనను మరింత బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ పర్యాటక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని మంత్రి జూపల్లి పునరుద్ఘాటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *