తీసివేతే కూడిక

మెరుపు తీగెలు

-బమ్మిడి జగదీశ్వరరావు

“ఇంతకీ సినిమా యెలా వుందంటావ్? హిట్టా ఫట్టా?”

“హిట్టా ఫట్టాతో యేమి సంబంధం? బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగుంటే సరి!”

“మంచి కథేనట కదా? హీరో బాగా కష్టపడ్డాడట కూడా?”

“ఈ మధ్య సినిమాలన్నీ హీరో ఎలివేషన్ల కిందపడే చచ్చిపోతున్నాయి…”

“హీరో ఎలివేషన్ సరే, హీరోయినుకు ఎలివేషన్స్ యేముంటాయి?”

“బాడీ ఎగ్జిబిట్ చెయ్యడమే ఎలివేషన్… అచ్చమ్మయినా బుచ్చమ్మయినా…”

“అంతేలే, అయినా బాలావుడ్ నుండి హీరోయిన్ను తెచ్చి చీరకట్టి తులసికోట చుట్టూ తిరిగినట్టు హీరో చుట్టూ తిరిగితే యెవరు చూస్తారు? కాస్త రొమాంటిక్‌గా చూపిస్తే…”

“రొమాంటిక్‌గా కాదు, సెక్సీగా…”

“ఊ…?”

“ఆమె మాట్లాడుతున్నప్పుడు ముఖం కాకుండా యెర్రని పెదాలు, ఆమె నడుమూ బొడ్డూ క్లీవేజ్ పార్ట్సూ…”

“ఫ్రంట్లో నిలబడితే బ్యాకూ… అయినా సినిమాలో ఆమె పాత్ర భావాలకన్నా ప్రేక్షకుల మనోభావాలకు పట్టం కడితే తప్పేంటి? డైరక్టర్ యెందుకు సారీ చెప్పాలి? ఈ సినిమాలోనేనా? ఏ సినిమాలోనయినా హీరోయినంటే అంతే కదా?

“అంతే అనుకో, హీరోయిన్ యిష్టం లేకుండా ముద్దు పెట్టడం… లవ్వుని బాడీతో ఎక్సుప్రెస్ చెయ్యడం…”

“ఆగాగు… రియల్ ఎక్సుప్రెషన్ బాడీయే కదా? లవ్ లాంగ్వేజ్ సెక్సు… అయినా హీరో చెప్పాడు కదా, మళ్ళీ పుడతామా యేటి? అని…”

“హీరోయిన్ అంటే హీరోకు హక్కుంటుంది. ఆడాళ్ళ మీద మగాళ్ళకు హక్కుంటుంది. అంతే కదా నీ ఒపీనియన్?”

“అంతే కాదు, డైరక్టర్ సారీ చెప్పడం నచ్చలేదు, సీన్స్ తీసేయడం నచ్చలేదు, రేపు అన్ని సినిమాల మీద యీ ఇంపాక్ట్ పడుతుంది కదా?”

“నువ్వు అంతలా గింజుకోకు. సినిమా అన్నాక కలెక్షన్స్ పెంచడానికి సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని సీన్స్ యాడ్ చేస్తారు… కొన్ని సీన్స్ తీసేస్తారు… రిపీట్ ఆడియన్స్ కోసం…”

“నిజమే, హీరోయిన్‌వి ఆ… సీన్స్ తీసెయ్యకముందే సినిమా మళ్ళీ చూడాలని మా బ్యాచ్ అంతా అనుకున్నాం…”

“అదీ సినిమా. అదీ కలెక్షన్స్ పెంచడం అంటే. మరి డైరక్టర్ చేసింది తప్పా వొప్పా?”

“ఓహ్… పెద్ద స్కెచ్చే!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *