కొన్నిరచనలు అక్షరాలుగా జీవితాన్ని వర్ణిస్తాయి. మరికొన్ని జీవితంలో దాగిన అన్యాయాన్ని బయటపెడతాయి. ఇంకొన్నేమో చరిత్రలో ఎవరికీ కనిపించకుండా వినిపించకుండా మిగిలిపోయిన మనుషుల ఊసును ఉనికిని తిరిగి నమోదు చేస్తాయి. జూపాక సుభద్ర రచనల్లో ఈ మూడూ కనిపిస్తాయి. ఆమె కవిత్వాన్ని చదివినా కథల్లోకి ప్రవేశించినా పాఠకుడికి ఎదురయ్యేది కేవలం సాహిత్య సౌందర్యం కాదు. తరతరాలుగా శ్రమిస్తూ, అవమానాలను భరిస్తూ, తమ జీవితాలకు గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న దళిత స్త్రీల సామాజిక చరిత్ర కనిపిస్తుంది. తెలంగాణ గ్రామీణ జీవితంలోని శ్రమజీవుల మట్టివాసన, మాదిగ వాడల అనుభవాలు, స్త్రీల శ్రమ, కులవివక్ష, భాషా ఆధిపత్యం జూపాక సుభద్ర రచనలకు జీవధాతువులు. వరంగల్ జిల్లా దామరంచపల్లెకు చెందిన ఆమె తెలుగుసాహిత్యంలో ఉన్నతవిద్యను అభ్యసించి, తెలంగాణ ప్రభుత్వ సచివాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలతోపాటు రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా, సంపాదకురాలిగా ఆమె కొనసాగించిన ప్రయాణం విశిష్టమయింది. ఎందుకంటే ఆమెకు రచన ఎక్కడో జీవితానికి దూరంగా కూర్చుని చేసే పరిశీలన కాదు. జీవితంలో ఎదురైన అనుభవాలను, వాటివెనుక పనిచేసే అధికార సంబంధాలను అర్థం చేసుకునే ప్రక్రియ.
సుభద్ర సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆమె రచనల్లోని తల్లిని, అవ్వను చూడాలి. ఇంటి ముందర ఊడ్చి, పేడనీళ్లతో అలికి, పొలాల్లో నాట్లువేసి, కలుపుతీసి, కుటుంబాన్ని పోషించే మహిళ జీవితం మన సమాజానికి కొత్తది కాదు. కానీ ఆ జీవితానికి చరిత్రలో ఎంత చోటు దక్కింది? ఆమె శ్రమకు ఎంత గుర్తింపు లభించింది, ఆమె అనుభవాలను ఎవరు రాశారు? ఈ ప్రశ్నలే సుభద్ర రచనల్లో ధ్వనిస్తాయి. ఆమె ‘అవ్వ’ కవితలో తల్లి జీవితాన్ని కేవలం మాతృత్వపు భావోద్వేగంగా కాకుండా తల్లి శ్రమను, ఆమెకు దక్కని గుర్తింపును, ఆమె ఉనికికి సంబంధించిన వివరాలు ఆధారాలేవీ చరిత్రలో లేకపోవడాన్ని సుభద్ర ప్రశ్నిస్తారు. అయితే తనతల్లి జీవించిన ఆనవాళ్లను వెతుక్కునే ప్రయత్నం తన వ్యక్తిగత జ్ఞాపకాల్ని దాటి, చరిత్రలో నమోదు కాని కోట్లాది శ్రమజీవి మహిళల జీవితాల వైపు విస్తరిస్తుంది. అక్కడే విస్తారమయిన సుభద్ర సృజన కనిపిస్తుంది.
2009లో వెలువడిన ‘అయ్యయ్యో దమ్మక్క’ కవితా సంపుటి సుభద్ర కవితా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రధాన రచన. ఇందులోని ప్రపంచం అణగారిన స్త్రీల అనుభవాలతో నిర్మితమయింది. వారి బాధ, శ్రమ, సామాజిక అవమానం, జీవితాన్ని నిలబెట్టుకునే పట్టుదల కవిత్వానికి వస్తువులయ్యాయి. దళిత స్త్రీ వేసే ప్రశ్నల్ని కేవలం పురుషాధిపత్యానికి వ్యతిరేకమైన పోరాటంగా మాత్రమే చూడకూడదు. కులం, పేదరికం, శ్రమదోపిడీ, లింగవివక్ష కలిసి ఆమె జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సుభద్ర కవిత్వం ఈ అనుభవాల సంక్లిష్టతను గుర్తించింది. అందుకే ఆమె రచనలు దళిత స్త్రీవాద సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. జూపాక సుభద్ర కవిత్వంలో వస్తువులకు అనేక కొత్త అర్థాలు పుడతాయి. ‘చీరకొంగు’ ఇందుకు మంచి ఉదాహరణ. సాధారణంగా కొంగును స్త్రీ మర్యాదకు, శీలానికి, సంప్రదాయానికి ప్రతీకగా చూస్తాం. కానీ శ్రమజీవి దళిత స్త్రీ జీవితంలో కొంగు కేవలం శరీరాన్ని కప్పే వస్త్రం కాదు. చెమటను తుడుచుకునే గుడ్డ, పనిలో తోడుండే వస్తువు, జీవిత ప్రయాణంలో నిత్యం వెంట ఉండే నేస్తం. ఆమె ఈ కవితలోని ప్రతీకాత్మకతను చూస్తే ఒకే వస్తువుకు సమాజంలోని భిన్న స్త్రీలకు భిన్నమైన అర్థాలు ఉంటాయని తెలుస్తుంది. ఒకరికి అది మర్యాదకు చిహ్నం మరొకరికి అది శ్రమలో భాగస్వామి. ఈ తేడా వెనుక కులం, వర్గం, జీవన పరిస్థితులు పనిచేస్తాయి. ఇదే సుభద్ర కవితా శిల్పంలోని ప్రత్యేకత. ఆమె సిద్ధాంతాలను ప్రకటించడానికి పెద్దపెద్ద పదజాలాన్ని ఆశ్రయించరు. మనకు పరిచయమైన ఒక వస్తువు ద్వారా మనకు అంతగా పరిచయం లేని సామాజిక వాస్తవాన్ని చూపిస్తారు. చిన్నవస్తువు నుంచి పెద్ద చరిత్రను ఆవిష్కరించడం ఆమె కవిత్వంలోని సృజనాత్మక శక్తి.
2014లో వెలువడిన ‘రాయక్క మన్యం’ కథాసంపుటి సుభద్ర రచనా పరిధిని మరింత విస్తరింప చేసింది. ఇందులో దళిత జీవితంలోని అనేక పార్శ్వాలు కనిపిస్తాయి. మాదిగలు, దక్కలులు, గ్రామీణ సమాజం, విద్యావంతులైన దళితులు, ప్రభుత్వసంస్థలు, వైద్యవ్యవస్థలు, ఆహారసంస్కృతి ఇవన్నీ ఆమెకథల్లో సామాజిక పరిశీలనకు లోనవుతాయి. ఈ కథల ప్రత్యేకత ఏమిటంటే, కులవివక్ష గ్రామంలోనో, అంటరానితనపు పాతరూపాల్లో మాత్రమే లేదు, ఆధునికవిద్య, ఉద్యోగం, పట్టణజీవితాల్లో వివక్ష కొత్తరూపాల్లో కొనసాగుతున్నదని చూపిస్తారు. చదువుకున్న దళిత ఉద్యోగికి నౌకరి లభించినంత మాత్రాన సమానత్వం దక్కదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనిషికి వైద్యసేవ లభించినంత మాత్రాన మానవీయ గౌరవం హామీకాదు. సంక్షేమహాస్టల్లో ఉన్న బాలికకు వసతి కల్పించినంత మాత్రాన ఆమె భద్రత, గౌరవం కాపాడబడినట్టు కాదు. అంటూ ఆధునిక వ్యవస్థల లోపాలను దళిత జీవితాల అనుభవాల ద్వారా పరిశీలించడం సుభద్ర కథలకు పరిశీలాత్మక విమర్శనాత్మక బలాన్ని ఇచ్చింది. ఆహారపు అలవాట్ల ఆధారంగా ఏర్పడే వివక్షను కూడా ఆమె తన రచనల్లో ప్రశ్నించారు. మనం తినే ఆహారం వ్యక్తిగత అభిరుచి మాత్రమేనా, లేక దానినిబట్టి మనుషుల స్థాయిని నిర్ణయించే కులసంస్కృతి ఇంకా పనిచేస్తోందా? ఆమె కథలు ఇలాంటి అనేకప్రశ్నలను పాఠకుడి ముందుంచుతాయి. ఆమెకథల్లోని వాస్తవికత కేవలం బయట కనిపించే సంఘటనల వర్ణనకాదు. ఆ సంఘటనల వెనుక ఉన్న సామాజిక అధికారాన్ని గుర్తిస్తుంది, ప్రశ్నిస్తుంది.
తెలంగాణ భాష సుభద్ర రచనల్లో జీవిస్తుంది. అది కేవలం కృతకంగా అల్లిన ప్రాంతీయపదాల సమాహారం కాదు. తెలంగాణా సమాజపు జీవనవిధానం, ఆలోచనాపద్ధతి, జ్ఞాపకాలు, సంస్కృతి అందులో అంతర్భాగాలుగా ఉంటాయి. లిటరరీ ఈస్తెటిక్స్ ఆమె రచనల్లో ప్రతిబింబిస్తుంది. సుభద్ర భాషలోని మట్టివాసన, స్థానిక పలుకుబడి, జీవితానికి దగ్గరగా ఉండే వ్యక్తీకరణ ఆమె రచనలకు ప్రత్యేకమైన స్వరాన్ని ఇచ్చాయి. ఇక ఆమె ఆత్మకథ ‘గునుగుపూలు’ తాను నడిచొచ్చిన దారుల్ని, యెదిగొచ్చిన యెన్నెలని, సాహితీ లోకానికి బొమ్మకట్టి పటమేసిన రచన. సుభద్ర ప్రత్యేకత స్వీయ రచనలతోనే ముగియదు. ఇతర మహిళల రచనలను వెలికితీయడం, సంపాదకత్వం వహించడం, సాహిత్య వేదికలను నిర్మించడం కూడా ఆమె కృషిలో మరో ముఖ్యమైనభాగం. ‘నల్లరేగడి సాళ్లు’ మాదిగ మహిళల కథలకు వేదిక కల్పించగా, కృపాకర్ మాదిగతో కలిసి సంపాదకత్వం వహించిన ‘కైతునకల దండెం’ మాదిగ కవిత్వాన్ని సమీకరించే ప్రయత్నంగా నిలబడింది. తమిళ దళిత రచయిత్రి బామా రచించిన సంగతిని ఆంగ్ల అనువాదం చేసి తెలుగులోకి తీసుకురావడం ఆమె అనువాద కృషిలో మరో ముఖ్యమైన అంశం. భిన్నభాషల్లోని అణగారిన మహిళల అనుభవాల మధ్య సంభాషణకు ఇది ఎంతో దోహదపడుతుంది.
సాహిత్యంలో తనగొంతును వినిపించడం ఒక విజయం. తనతో పాటు మరెందరో గొంతులు వినిపించేలా వేదిక నిర్మించడం మరింత పెద్ద విజయం. ఈ రెండో బాధ్యతను కూడా సుభద్ర స్వీకరించారు. సుభద్ర సాహిత్యం మనల్ని కేవలం కదిలించదు. మనం చూస్తున్న ప్రపంచాన్ని మళ్లీ చూడమంటుంది. మనం చదువుతున్న చరిత్రలో ఎవరు లేరో గమనించమంటుంది. మనం సాహిత్యంగా అంగీకరించిన భాషల్లో ఎవరి గొంతులేవో వినమంటుంది. జూపాక సుభద్ర రచనలు అట్టడుగు జీవితాలకు సాహిత్యంలో చోటు కల్పించడమే కాదు, సాహిత్య చరిత్రను మరింత సమగ్రంగా, న్యాయంగా, మానవీయంగా మార్చాలని కోరుతున్నాయి. వాడలో పుట్టిన జూపాక సుభద్ర రచనలు ఇప్పుడు తెలుగు సాహిత్యపు గుండెల్లో ప్రశ్నలై మొలుస్తున్నాయి. ఆ ప్రశ్నల్లో సమాజపు ఆవేదన ఉంది, ఆత్మగౌరవపు జెండా ఉంది, రేపటి సమానత్వపు స్వప్నం ఉంది. అదే జూపాక సుభద్ర అక్షరాల్లో నిరంతరం ప్రవహించే చెమ్మ.




