మెరుపు తీగెలు
“ఆ రోజు అమావాస్య. అయినా అంతవరకూ కమ్మిన చీకటి చీకట్లో కలిసిపోయింది. ఎందుకంటే, నిండు చంద్రుడు ఆకాశంలోకి వచ్చేశాడు, యెందుకు? వెన్నల వర్షం కురిపిస్తున్నాడు, యెందుకు?” అడిగాడు మిత్రుడు.
“ఎందుకూ? నువ్వు కవివయినా కావాలి. లేదంటే మధువు అయినా సేవించి వుండాలి” అన్నాను, తన గొంతు యెండిపోవడం పసిగట్టి.
“మధువు… చూడు ‘వధువు’లాగ, ఆ సౌండే యెంత బాగుందో?!’ పులకించిపోయాడు, నిజమే అతని కరకు గొంతు మృదువుగా మారిపోయింది.
“సభానంతర కార్యక్రమాలు లేవా?” అడిగాను నవ్వుతూ.
“ఉంటే, గొంతెందుకు యెడారిలా మారిపోతుంది?’ అన్నప్పుడు నిజంగానే మిత్రుడి గొంతు మళ్ళీ కరకుగా మారిపోయింది.
నేను పెద్దగా నిట్టూర్చాను. పదమన్నాడు. బయటపడమన్నాడు. బాల్కనీలోంచి వస్తుంటే, మా ఆవిడ నాకో వార్నింగ్ లుక్ యిచ్చింది. నేను సిగ్గులేని నవ్వు నవ్వి వీధిలోకి వచ్చాను. అప్పటికే చీకటి పడింది.
“చకోరా” అని పిలిచాడు, ముద్దుగా. “ఇద్దరమూ చకోరపక్షులమే” అని నవ్వాను. నవ్వుతూనే చెప్పాను. “ఈ వ్యసనం యెక్కడిదాక తీసుకెళ్తుందో, మా ఆవిడ భయపడుతోంది” అన్నాను. “అది వొక సహజాతము” టక్కున అన్నాడు మిత్రుడు.
“వ్యసనం పరువు తీస్తుందని తన బాధ” అన్నాను. నా ముఖంలో బాధ చూసి తనూ బాధపడుతూ, “నిజం చెప్పనా, వ్యసనం అన్ని వేళలా పరువు తీయదు. పైగా యెంతో కొంత కీర్తిని కూడా తెస్తుంది” అన్నాడు మిత్రుడు.
ఆ మాటతో నడుస్తున్న వాడిని ఆగిపోయి, “పీఆర్ మంచిదే, కాకపోతే…” అని ఆగిపోయాను, మాటలు తడుముకుంటూ. “ఊ… చెప్పు, మరి పీఆర్ యెలా పెరుగుతుంది? ఎవరిమీదైనా యెవరైనా గౌరవాన్ని యెలా చూపిస్తారు… వెన్నెల గ్లాసులో పోసుకు పంచుకొని తాగితేనే కదా మజా?” అన్నాడు మిత్రుడు. అని అక్కడితో ఆగలేదు, “పక్కవాడిలో పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలన్నా మన గురించి నెగటివ్ టాక్స్ పోవాలన్నా తప్పదు. మన సాహిత్య సమాజం కూడా అందుకు అతీతంగా యెందుకు వుండాలి?” అని తిరిగి బాధతో ప్రశ్నించాడు.
బారులో కూర్చున్నాం.
నెలాఖరు అనేకాదు, మన డబ్బుతో మనం తాగితే కిక్కురాదు, వొక్కరం తాగితే అంతకన్నా కిక్కు రాదు… అని మా యిద్దరికీ తెలుసు. ఇలాంటి సమయాల్లో పెద్దాయన వుండి వుంటే యెంత బాగుణ్ణు అనుకొని ఆ మాటే అన్నాను, జ్ఞాపకం చేసుకుంటూ.
“చూశావా, పెద్దాయనని అందరిలా మనం యెందుకు మర్చిపోలేదు?” అన్నాడు మిత్రుడు. “ఆయన రచనల వల్ల” అన్నాను నేను పుసుక్కున. తుపుక్కున నా ముఖాన వుమ్మి “యీ పూట యెవ్వరూ పొయ్యడానికి లేరే అని దిగులు కమ్మినప్పుడు ‘నేనున్నాను’ అని ఆపద్ధర్మంగా వుండేవారు గనుక” అన్నాడు మిత్రుడు. వాళ్ళ పిల్లలిద్దరూ నేవీలో పని చేయడం, కోటాకింద బాటిళ్ళు తెచ్చి యింట్లో పెట్టుకోవడం అన్నీ గుర్తుకువచ్చాయి.
అలవాటుగా సర్వర్ తెచ్చి పెట్టాడు.
“గ్లాసుల శబ్దం… మా ఆవిడ గాజుల శబ్దంకన్నా బావుంది” అన్నాను, యాంగ్జైటీలో. “చూశావా? తాగక ముందే పొంగిపొర్లుతోంది కవిత్వం. అందుకోసమైనా తాగాలి” అని “చీర్స్” చెప్పిన మిత్రుడు గ్లాసుకు గ్లాసు తగిలించి “యివీ ముద్దాడుకుంటున్నాయి” నవ్వాడు.
సిప్ చేస్తూ “యిందాక యేమన్నాను? ‘వ్యసనం అన్ని వేళలా పరువు తీయదు. పైగా యెంతో కొంత కీర్తిని కూడా తెస్తుంది’ అని, యెందుకు అన్నాను?” అన్నాడు మిత్రుడు. నా మట్టిబుర్రకు యేమీ తట్టలేదు. తనే గుర్తుచేశాడు. “పెద్దాయన రాయడం మానేశాక, ప్రపంచం కూడా మరిచిపోయింది. తప్పులేదు. ఎవరిని వాళ్ళే గుర్తుపెట్టుకున్న కాలం మనది. సరే, ఆయన పోయినప్పుడు ఆఖరుగా కలిసింది, నాలుగు ముక్కలు సోషల్ మీడియాలో రాసింది…” చెప్పడం పూర్తికాలేదు. “మనమే” అన్నాను. “అప్పుడు నువ్వు రాసినందుకూ ఆయన్ని మనం కలిసినందుకు మనకు మంచి అప్లాజ్ వచ్చింది” అన్నాను, సంతోషంగా.
ఖాళీ అయిన గ్లాసుల్ని నింపుతూ “మనం పెద్దాయన యింటికి యెందుకు వెళ్ళాము? పెద్దాయన మీద ప్రేమతోనా? వయసయిందనా? అనారోగ్యమనా?” అని నావైపు చూస్తూ అడిగాడు. నేను గుటకలు మింగాను. “కాదు, ఆ పూట మనం దాహార్తితో వెళ్ళాం, బాటిల్ కోసం. ముండాకొడుకు యివ్వలేదు” అన్నాడు మిత్రుడు.
నేను అంతా గుర్తున్నట్టు తలాడించాను.
తాగుతూ “యిలాంటి నిజాలు మాట్లాడాలంటే తాగక తప్పదు” అంటూ తలాడించిన మిత్రుణ్ణి చూసి నవ్వాను. “మనం మన లిటరేచర్లో రాసిన విషయాలకన్నా రాయనివి, రాయలేనివి యెక్కువ…” అన్నాడు మళ్ళీ.
ఎక్స్ ప్రెషన్ తెలీక మిత్రుడి చేతిని అందుకొని ముద్దు పెట్టుకున్నాను!




