“మరో వంక ఆర్య సమాజ ఉద్యమం బలోపేతమై ముస్లిం ఆధిపత్య ధోరణిపై ఎదురు సవాళ్ళు విసరడం మొదలు పెట్టింది. మరో వైపు ‘మజ్లిస్ ‘ వేదిక మతోద్రేకాలను రెచ్చగొట్టసాగింది. దరిమిలా హిందువులకు ముస్లింలపైనా, ముస్లింలకు హిందువుల పైనా అనుమానాలకు, అపోహలకు, ఈర్ష్యాసూయలకు పునాదులేర్పడటం మొదలైంది.“
(నిన్నటి సంచిక తరువాయి ..పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి 105 బాల్య విశేషాల గురించి మరొక్కసారి)
-పాములపర్తి నిరంజన్ రావు
పిన్నా శివకుమార్
రెండో ప్రపంచ యుద్ధం తీవ్రంగా సాగుతున్నది. యుద్ధ ఒడి దుడుకుడుల వలన విపరీతంగా పెరిగిన ధరలు, ఆహార రేషనింగ్, సివిల్ సప్లై సరుకుల కొరత మున్నగు నిత్య కష్టాలు హైదరాబాదు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అప్పటికే కాళోజీ నారాయణ రావు గారు హైదరాబాద్ లో న్యాయ వాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కోర్టుకు వేసవి సెలవు లిచ్చినప్పుడు పీవీ, కాళోజీ లిద్దరూ మహా బలేశ్వర యాత్రకు బయలు దేరారు. ఈ యాత్రా విశేషమేమంటే మహాబలేశ్వర ప్రకృతి సౌందర్యాన్ని రికార్డ్ చేసి మిత్రులకు చూపించాలని ఒక కెమెరా కొని ఫోటోగ్రఫీ అనే నూతన సరదా ప్రారంభించాడు పీవీ. ఫోటోగ్రఫీ కి చెందిన వివిధ టెక్నికులు నేర్చుకొనుటయే కాక సన్నిహిత మిత్రులకు అవి సోదాహరణంగా వివరించేవాడు. ఈ యాత్ర నుండి తిరిగివచ్చేప్పుడు బొంబాయిలో ఆగి బాంబే స్టాక్ మార్కెట్ ను సందర్శించాడు. అక్కడ షేర్ మార్కెట్ విధానం గురించి తెలుసుకున్న పీవీకి కొద్ది మంది పారిశ్రామిక, బ్యాంకర్ కుబేరుల గుప్పిట్లో జాతీయ ఆర్థిక స్థితి గతులు నిగూఢంగా ఒదిగి యున్న జటిల సమస్య పీవీ సవిమర్శక దృష్టిని ఆకర్షించి వినూత్న సమాలోచనలకు ప్రేరణ ఇచ్చింది. యాత్ర నుంచి హైదరాబాదుకు తిరిగి రాగానే వకీళ్ళిద్దరూ తమ కోర్టు వ్యవహారాలల్లో మళ్ళీ బిజీ బిజీ.
ఇక హైదరాబాదు రాష్ట్ర రాజకీయాల్లో, నిజాం ప్రభుత్వంపై జరుగుతున్న ప్రజా ఉద్యమాల్లో తీవ్ర మార్పులొచ్చాయి. ఒక వైపు మైసూర్ స్టేట్ పరిపాలనలో అనుభవమున్న ‘మీర్జా ఇస్మాయిల్’ ను హైదరాబాద్ రాష్ట్రానికి తెచ్చి ముఖ్యమంత్రిగా నియమించాడు నిజాం. ఈయన ప్రోద్బలంతో హిందూ ప్రజలను ఆకట్టుకొనడానికి “హిందూ-ముస్లిం రెండు కండ్ల సమాన ప్రాతినిధ్యం” అనే కొన్ని నూతన సంస్కరణలు ప్రతిపాదించాడు. కానీ ఆచరణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వృత్తి నియామకాల్లోనూ ముస్లిములనేమో రాజ బంధువులుగా, హిందువులనేమో ప్రజా సేవకులుగా పరిగణించడం జరుగుతూ అనేక అపోహలకు కలతలకు దారితీసేది. నిజాం వ్యతిరేక రాజకీయ ఉద్యమం కూడా కొత్త మలుపులు తిరిగింది. అప్పటిదాకా నిషేధంలో వున్న స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం నిషేధం ఎత్తేయడంతో మళ్ళీ ప్రారంభమై నిజాం ప్రభుత్వ ప్రతిపాదిత సంస్కరణలను వ్యతిరేకించింది.
ఇక నిజాం వ్యతిరేక ఏకైక తెలంగాణా ప్రజా ఉద్యమ సంస్థ ‘ఆంధ్ర మహా సభ ‘ రెండుగా చీలి పోయింది. కమ్యూనిస్టుల సారథ్యంలో ‘కమ్యూనిస్ట్ ఆంధ్ర మహాసభ’ అనీ, కమ్యూనిస్టేతర నాయకుల సారధ్యంలో ‘ జాతీయ ఆంధ్ర మహాసభ’ అనీ విడివిడిగా పని చేయడం మొదలు పెట్టాయి. ఈ రెండూ కూడా నిజాం సూచించిన సంస్కరణలను వ్యతిరేకించాయి. వీటన్నిటి మూలంగా హిందువులు, ముస్లిముల మధ్య వైమనస్య వాతావరణం పెరగసాగింది. మరో వంక ఆర్య సమాజ ఉద్యమం బలోపేతమై ముస్లిం ఆధిపత్య ధోరణిపై ఎదురు సవాళ్ళు విసరడం మొదలు పెట్టింది. మరో వైపు ‘మజ్లిస్ ‘ వేదిక మతోద్రేకాలను రెచ్చగొట్టసాగింది. దరిమిలా హిందువులకు ముస్లింలపైనా, ముస్లింలకు హిందువుల పైనా అనుమానాలకు, అపోహలకు, ఈర్ష్యాసూయలకు పునాదులేర్పడటం మొదలైంది.
పౌర జీవనంలో అనిశ్చిత వాతావరణం అలుముకొనసాగింది. మేధావి వర్గానికి చెందిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులు ఈ విపరీత పరిణామానికి కలవరపడ సాగారు. ఇక పీవీ లో కూడా న్యాయ వాద వృత్తిపైన, ఆ వృత్తి పై గల గౌరవం, దాని స్థిరత్వం, భద్రత పైన గల ఆత్మ విశ్వాసం తగ్గుతూ దానిపై శ్రద్ధాసక్తులు సడలిపోసాగాయి. మానసికాందోళన మొదలైంది. మళ్ళీ ‘ కిం కర్తవ్యం?’ ఆలోచనలు. ఈ సారి అది ‘భవిష్యత్ జీవన మార్గ నిర్ణయ’ ప్రశ్న! ఈ మానసిక ఆందోళన పరిస్థితుల్లోనే ‘అప్రెంటిస్ షిప్’ పూర్తై అడ్వకేట్ గా బోర్డ్ కట్టాడు. కేసులు, కోర్టు పని బాధ్యతలపై కంటే భారత దేశ, హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల పై ఎక్కువ దృష్టి సారించాడు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ ఉద్యమం లో ‘ఎవరికి వారే’ అన్న చందాన వ్యవహరించడం వల్ల పురోగమన సూచనలు కనబడటం లేదు. మత రాజకీయ ప్రేరణనే ప్రజల మనో భావాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు గ్రహించ గలిగాడు పీవీ.
1945 -47 ల మధ్య పీవీ విస్తృత అధ్యయనాలు చేసాడు. థామస్ కార్లయిల్, రస్కిన్, లెనిన్, బేకన్ మున్నగు సాంఘిక తత్త్వవేత్తల రచనలను, పలు చారిత్రిక, అర్థ శాస్త్ర గ్రంధాలను చదివాడు. మొపాసా, బాల్ జాక్, ఉమర్ ఖయ్యూం రచనలు కూడా చదివాడు. ఆరోజుల్లో సాంఘిక, రాజకీయ అస్థిమిత వల్ల యువకులు సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. గ్రంధాలయ సభలు, కవి సమ్మేళనాలు, రచయితల వేదికలు తరచుగా జరిగేవి. పీవీ, కాళోజీ, సదాశివరావులు అప్పుడప్పుడూ వీటిల్లో పాల్గొనే వారు. ఐతే పీ వీ కి తెలుసు – యివి కేవలం కాలక్షేప వ్యాపకాలే తప్ప రాజకీయ అస్థిరతకు ప్రత్యామ్నాయ మార్గాలు కావని! ఆ రోజుల్లోనే తెలంగాణాలో ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ప్రాచుర్యం పొందింది. దేవులపల్లి రామానుజ రావు ”శోభ” అనే పత్రికను నడిపారు. వరంగల్ లో 1942 ప్రాంతంలో పాములపర్తి సదాశివరావు మార్గదర్శకత్వంలో పట్టణ వ్యాపార పెద్దల సహకారంతో శ్రీ రాయపరాజు వెంకట్రామారావు గారి అధ్యక్షతన ‘కాకతీయ కళా సమితి ‘ని నెలకొల్పి ప్రతి యేడూ త్యాగరాజ మహోత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించేవారు.
దక్షిణ భారత శాస్త్రీయ సంగీత ప్రముఖుల (ద్వారం వెంకటస్వామి నాయుడు, మంగళంపల్లి బాల మురళీకృష్ణ, దంతాలపల్లి పురుషోత్తమ శాస్త్రి మొదలగు వారి) సంగీత సమ్మేళనాల్ని నిర్వహించడమే కాకుండా నాటికలు, వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, స్త్రీలకు చర్చా కార్యక్రమాలు, కవి, కథక సమ్మేళనం లాంటివి నిర్వహించే వారు. ఆ మూడు రోజులు వరంగల్ ప్రజలకు ఒక పండుగ వాతావరణం ఉండేదని అంటారు. ఆ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కవి సమ్మేళనానికి పీవీ అధ్యక్షత వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1943 నుండి 1958 దాకా సుమారు 15 సంవత్సరాలు నిర్విఘ్నంగా పనిచేసిన కాకతీయ కళా సమితి తరువాత కనుమరుగైంది.
శ్రీ కొండబత్తిని జగదీశ్వరరావు గారి మాటల్లో … “కాకతీయ కళా సమితి కార్యక్రమాల్లో శ్రీ పీవీ గారు కూడా అప్పుడప్పుడూ పాల్గొనేవారు. పీవీ గారు తబలా వాయిస్తే, సదాశివరావుగారు హార్మోనియంపై అరుదైన రాగాల గమకాల్ని తమ గొంతుతో చూపించేవారు. ఆ దృశ్యం ఎంతో కమనీయంగా ఉండేది ”. ` మిత్రులు దూరంగా ఉన్నా సంగీత సాహిత్య అభిరుచులను పంచుకోవడం జరిగేదన్న దానికి ఒక ఉదాహరణ: 1981 ప్రాంతంలో సదాశివరావు గారు ఆచార్య బృహస్పతి గారనే ఒక సంగీత విద్వాంసుడు రాసిన ఒక పుస్తకం చదివి అందులో కొన్నింటిపై వివరణలు కోరుతూ ఒక ఇన్ లాండ్ లెటర్ ఆ పుస్తక ప్రచురణకర్తలకు రాయడం, దాన్ని వారు దిల్లీ లోని ఆ రచయిత ఇంటికి ఫార్వర్డ్ చేయడం జరిగింది.
కానీ అప్పటికే ఆయన నిర్యాణం చెందటం వల్ల ఆయన సతీమణి శ్రీమతి సులోచనా బృహస్పతి గారు తాను కూడా సంగీత విదూషీమణి కాబట్టి వివరణలిస్తూ ఆ పుస్తక మలి ప్రచురణలో ఆ వివరణలు పొందుపరుస్తామని ఒక లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ లేఖా పరిచయాన్ని ఉటంకిస్తూ సదాశివరావు పీవీగారికి ఉత్తరం రాసి అందులో ఆమె అడ్రస్ పొందుపరుస్తూ ఆమెకు ఇంటర్వ్యూ యివ్వమని కోరడం జరిగింది. అప్పటి విదేశాంగ మంత్రి పీవీగారు ఫోన్ చేసి ఆమెని పిలిపించుకొని సంగీత ముచ్చట్లు మాట్లాడుకొనడమే కాకుండా తన ఇంట్లోనే కొద్ది మంది ముఖ్యులను ఆహ్వానించి ఆమె సంగీత కార్యక్రమాన్ని ఏర్పరచారని తెలిసింది. అంతే కాదు – వరంగల్ లో 1982 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధ్వైర్యంలో జరిగిన పోతన పంచశతి ఉత్సవాల సందర్భంగా శ్రీ పీ వీ గారు ఆమె పాట కచేరీని ఆ ఉత్సవ కార్యక్రమంలో పొందుపరచారని ఆమె వరంగల్ వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొన్నారని తెలిసింది.
(మిగతా రేపటి సంచికలో )





