విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం

– పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
– ములుగు కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: ఈ నెల 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లT ముందుగానే పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఈమేరకు ములుగు జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, విద్యా శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠశాలల సిద్ధతపై సమీక్షించారు. పాఠశాలల ఆవరణ, తరగతి గదులు, హాస్టల్ గదులు, వంటశాలలు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి లోపాలు సరిచేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదంటూ పాఠశాలల్లోని తాగునీటి ట్యాంకులను పూర్తిస్థాయిలో శుభ్రపరచి పరిశుభ్రమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున‌ నీటి ద్వారా వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, బాలికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. సెలవుల కారణంగా మూసి ఉన్న తరగతి గదులు, హాస్టల్ గదుల్లో విషపురుగులు, క్రిమికీటకాలు ఉండే అవకాశం ఉన్నందున పాఠశాలల ప్రారంభానికి ముందే తనిఖీలు నిర్వహించి అవసరమైన క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. కాగా, పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కృషి చేసిన జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించారు. ఈ ఘనతను కొనసాగిస్తూ రాబోయే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందంటూ ఆదివాసి గిరిజనుల సంస్కృతి కాపాడేలా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేయాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *