– యూనిఫాం రంగు, డిజైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
– కిట్ల పంపిణీకి ఎస్వోపీ రూపొందించండి
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : విద్యార్థులకు అందించిన యూనిఫాంపై వారినుంచి అభిప్రాయాలు (ఫీడ్ బ్యాక్) సేకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు, కిట్ల పంపిణీపై సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. గతంతో పోలిస్తే ఎంతో నాణ్యమైన యూనిఫాంలు, ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లతో అందజేశామన్నారు. అయితే ఆయా రంగులు, డిజైన్లకు సంబంధించి విద్యార్థుల నుంచి అభిప్రాయాలు(ఫీడ్బ్యాక్) సేకరించాలన్నారు. అలా చేస్తే ఎక్కువమంది విద్యార్థులు కోరుకునే రంగులు, డిజైన్లకు భవిష్యత్తులో ప్రాధాన్యమివ్వచ్చని అన్నారు. యూనిఫాంలతోపాటు టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, షూలు, సాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, కార్పెట్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ దాదాపు పూర్తయిందని అధికారులు సీఎంకు తెలియజేశారు. ఒకట్రెండు సంస్థల పరిధిలో కొన్ని వస్తువుల పంపిణీ 95 శాతం వరకు పూర్తయిందని చెప్పారు. ఆ వస్తువుల పంపిణీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదికి విద్యార్థులకు అందజేసే యూనిఫాంలు, ఇతర సామగ్రికి సంబంధించి విధివిధానాలను (ఎస్వోపీ) రూపొందించాలన్నారు. విద్యార్థులకు అందజేసే వస్తువుల జాబితా రూపకల్పన, టెండర్లు, సరఫరా, అందజేత వరకు ప్రతిదీ నిర్దేశిత సమయంలో పూర్తవ్వాలని తెలిపారు. పాఠశాలలు తెరిచిన రోజునే మొత్తం వస్తువులు అందేలా ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. సమీక్షలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, రాష్ట్ర గిరిజన, వెనుకబడిన తరగతుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, వివిధ శాఖల అధికారులు షఫీఉల్లా, బాలమాయాదేవి, విజయేందిర బోయి, దివ్య దేవరాజన్, జి.రవి, బి.సైదులు, బీఎం సంతోష్, నవీన్ నికొలస్, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





