స్కిల్స్ యూనివర్సిటీకి ఏఐజీ సహకారం

– బీఎస్సీ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ కోర్సుపై సమీక్ష 

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : వైద్య రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఏఐజీ ఆస్పత్రులు సంయుక్తంగా చేపట్టిన బీఎస్సీ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ కోర్సుపై సమీక్ష సమావేశం నిర్వహించాయి. 2026 బ్యాచ్‌కు సంబంధించిన ఈ సమావేశంలో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వి.ఎల్.వి.ఎస్.సుబ్బారావుతోపాటు రెండు సంస్థలకు చెందిన విద్యా, వైద్య రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కోర్సులో ప్రవేశ అర్హతలు, ఫీజుల విధానం, పాఠ్యప్రణాళిక, సిలబస్‌లో అవసరమైన మార్పులపై సమగ్రంగా చర్చించారు. కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ రంగంలో వస్తున్న ఆధునిక పరిజ్ఞానం, మారుతున్న వైద్య విధానాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడంపై దృష్టి సారించారు. ముఖ్యంగా విద్యార్థులకు తరగతి గది బోధనతోపాటు హాస్పిటల్స్‌లో ప్రత్యక్ష అనుభవం, క్లినికల్ శిక్షణ, ప్రాక్టికల్ లెర్నింగ్ అవకాశాలను మరింత పెంచాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. వైద్య రంగంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా విద్యార్థుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడంపై చర్చించారు. పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఉపాధి అవకాశాలకు అనుగుణమైన విద్యను అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఏఐజీ హాస్పిటల్స్ కలిసి పనిచేస్తున్నాయి. వైద్య రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *